
పదేళ్ల కిందటి వరకు బుల్లితెరపై ఓ సినిమా నటుడు కనిపించాడంటే.. అతని స్టార్ డమ్ పడిపోయిందని అర్థం. సినిమాల్లో ఛాన్సు లేవు కాబట్టే.. టీవీల్లో కనిపిస్తున్నారని అనుకునేవారు. ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. టీవీ ప్రకటనల్లో కావొచ్చు.. షో హోస్టుగా కావొచ్చు.. ఒక సినిమా స్టార్ స్మాల్ స్క్రీన్ పై కనిపిస్తున్నాడంటే.. అతని స్టార్ డమ్ ఆకాశంలో ఉందని అర్థం.
అయితే.. స్టార్ హీరోలు యాడ్స్ లో నటించడం అన్నది పెద్ద రిస్క్ కాదు. ఓ డేట్ ఫిక్స్ చేసుకుని షూట్ ఫినిష్ చేస్తే సరిపోతుంది. రిపీటెడ్ గా సీడీ ప్లే అవుతూ ఉంటుంది. కానీ.. షో హోస్టు వ్యవహారం అలా ఉండదు. దానికి భారీగా డేట్స్ అడ్జెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల సినిమా షూటింగులు కూడా డిస్ట్రబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి కండీషన్లోనూ స్టార్ హీరోలు బుల్లితెరపై ఎందుకు షోలు చేయడానికి సిద్ధమవుతున్నారు అన్నదే ఆసక్తికరం.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్లోని టాప్ హీరోల్లో ఒకరు. ఆయన కోసం దర్శకులు, నిర్మాతలు వెయిట్ చేస్తుంటారు. అలవైకుంఠ పురములో సినిమా తర్వాత నుంచి ఏడాది కాలంగా జూనియర్ కోసమే కాచుకొని కూర్చున్నారు త్రివిక్రమ్. రాజమౌళి చెక్కడం పూర్తి చేస్తే.. తాను మొదలెట్టాలని చూస్తున్నారు. కరోనా వచ్చి ఎన్నో డేట్స్ ను తినేయగా.. జక్కన్న చిత్రీకరణతో మరింత జాప్యమైంది. అంతా సెట్టయినట్టే అనుకునే టైమ్ లో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోకు ఏకంగా 60 రోజులు డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది.
సినిమాలను కూడా పక్కన పెట్టి, ఇలాంటి షోలను ఎన్టీఆర్ ఎందుకు చేస్తున్నారు? డబ్బు కోసమేనా? అంటే.. అది మాత్రమే కాదు.. అంతకు మించిన టార్గెట్ ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. సినిమా ద్వారా నటులు జనాలకు దగ్గరవుతారు. కానీ.. టీవీల ద్వారా మరింత చేరువవుతారు. ఇంట్లో కూర్చొని ఇంటిల్లిపాదీ చూసే కార్యక్రమాల ద్వారా వారికి దగ్గరయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఇక, డబ్బు కామన్ గా వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే.. తక్కువ రోజులకే ఎక్కువ మొత్తం చెల్లిస్తారు. దీనివల్ల స్వామి కార్యం.. స్వకార్యం రెండూ నెరవేరే అవకాశం ఉంటుంది. స్వామి కార్యం వరకూ ఓకే.. షోకే చేస్తాడు.. డబ్బులు తీసుకుంటాడు. మరి స్వకార్యం ఏంటీ అంటారా..? ఫ్యూచర్ లో జూనియర్ పాలిటిక్స్ లోకి వస్తారనేది బహిరంగ రహస్యమే. రాజకీయాల టాపిక్ వచ్చిన ప్రతిసారీ.. తర్వాత మాట్లాడుకుందాం, నేను ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో కార్యకర్తనే అంటూ ఉంటారు జూనియర్.
ప్రస్తుత పరిస్థితి చూస్తే.. రాజకీయాల్లోకి ఎన్టీఆర్ రావాలంటూ ఆయన అభిమానులు కూడా అప్పుడప్పుడూ స్వరం వినిపిస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనాలకు మరింత దగ్గరవ్వడానికే జూనియర్ ఈ బుల్లితెర షోలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డబ్బుకు డబ్బు రావడంతోపాటు జనాల నోళ్లలో నానే అవకాశం కూడా లభించే అవకాశం దక్కుతుంది. ఈ విధంగా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా జూనియర్ వ్యవహరిస్తున్నాడని అంటున్నారు.