
ఒక దర్శకుడు ఒక గొప్ప చిత్రాన్ని తీశాడంటే దాని గొప్పతనం అతడిది మాత్రమే కాదు.. అంత గొప్పగా ఆలోచించి రాసిన కథా రచయితది. ముందుగా ఆ కథను ఎంతో ఊహించి రాస్తే.. దాన్ని కథగా మలిచిన దర్శకుడికే ఆ పేరు వస్తుంది. రైటర్లను తొక్కేస్తున్న వారు ఎందరో ఇండస్ట్రీలో ఉన్నారు. కథా రచయితకు ఆ పేరు ఇవ్వని వారు ఎంతో మంది ఉన్నారు. టాలీవుడ్ లో రైటర్లకు పేరు ఎందుకు రావడం లేదు.? తెరవెనుక ఏం జరుగుతోంది? స్పెషల్ ఫోకస్
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాకి కావాల్సింది విలువ, విషయం ఉన్న రైటర్లే. అయితే విశ్వసనీయత, విషయం ఉన్న రచయితలు లేకుండా పోయారని ఇండస్ట్రీలో ఈ మధ్య తరుచుగా వినిపిస్తోంది. కానీ విషయం ఉన్న కొత్త రైటర్లకు మాత్రం అవకాశాలు రావు. ఇక్కడ ఒక్క సక్సెస్ కూడా లేని రైటర్ ని ఎవ్వడూ నమ్మడు. ఎవ్వడు నమ్మకుండా ఎక్కడా ఎవ్వడికీ ఒక్క అవకాశం కూడా రాదు. అందుకే, కొత్త రచయితలు ఏళ్ల తరబడి అవకాశాల కోసం తిరగాల్సి వస్తోంది. నిజానికి హీరోలతో పాటు దర్శకనిర్మాతలందరూ మంచి కథలు కోసమే ఎదురుచూస్తున్నాం అంటూ స్టేజీల మీద లెక్చర్లు దంచికొడతారు.
కానీ, కథ చెబుతామని కథలు పట్టుకుని తిరుగుతున్నా.. చివరకు అఫీస్ బాయ్ కూడా వినడానికీ రెడీగా ఉండదు. ఇక పెద్ద హీరోలకు కొత్త రచయితలు కథలు ఎలా చెప్పగలరు ? రికమండేషన్స్ ఉంటే హీరోలను డైరెక్టుగా కలిసే అవకాశం వస్తోంది. అయితే, కథలోని కష్టం తెలియని ఆ హీరోకి, కథ ఎలా నచ్చుతుంది ? నచ్చినా ఆ హీరోగారి ఫ్యామిలీకి నచ్చుతుంది అని గ్యారంటీ లేదు. అర్జున్ రెడ్డి కథను ఇండస్ట్రీలో మొదట చాలమంది హీరోలు విని రిజక్ట్ చేసారంటేనే.. హీరోల ఆలోచనా విధానం ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
ఏది ఏమైనా ఇండస్ట్రీకి ఇప్పుడు రచయితల కొరత ఎక్కువుగా ఉంది. సమస్యల వలయంలో బతుకు భయంతో బాధ పడుతున్న నేటి జనరేషన్ కి ఉపశమనం కలిగించే గొప్ప హాస్య రచయితలు కావాలి నేడు. జంధ్యాల మార్క్ కామెడీని, ఈవివి మాస్ కామెడీని క్రియేట్ చేసే విజన్ కావాలి. అలాంటి విజన్ ఉన్నవాళ్లు పైకి రావాలంటే.. నిర్మాతల దగ్గర నుండి హీరోల వరకూ అందరిలోనూ మార్పు రావాలి. ముఖ్యంగా మంచి కథ రాసే శక్తి ఉన్నవారికి రెమ్యునరేషన్ ను అమాంతం పెంచాలి.
మనం అందరం మంచి రైటింగ్ ను చూసి బాగా ఎంజాయ్ చేస్తాం. అయితే సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా నటించే చివరి ఆర్టిస్ట్ సంపాధించే అంత కూడా, కొత్త రైటర్ సంపాధించలేనప్పుడు ఎవరు మాత్రం ఎందుకు రైటర్ అవుతాడు. సినిమా అయినా, ఇంకేదైనా రచనతో అందర్నీ మెప్పించాలంటే రైటర్ బాగా రాయాలి. మరి రాసిన రైటర్ కి విలువ లేనప్పుడు విలువైన రచనను ఎలా ఆశించిగలం.
హీరోలు నిర్మాతలు మరియు దర్శకులు ఇప్పటికైనా రచయితల విషయంలో బుద్ధి తెచ్చుకుంటే మంచింది. రైటర్ లను తక్కువ చేసి.. తానూ గొప్ప అనిపించుకోవాలనుకునే దర్శకులు బతుకులు తలక్రిందులు అయిపోయిన సంఘటనలు మనం ఇప్పటికే ఎన్నో చూశాము. రైటర్ కు విలువ ఇవ్వని నిర్మాతలు నష్టాల కష్టాలతో మొత్తం మునిగిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికైనా రైటర్ కి తగిన గౌరవం ఇవ్వకపోతే, సినిమాకే ఇక భవిష్యత్తు ఉండదు అని అర్ధం చేసుకుంటే అది సినిమాకే మంచింది.
-శివ. కె