Homeఎంటర్టైన్మెంట్Jetlee Review: రివ్యూ: జెట్ లీ

Jetlee Review: రివ్యూ: జెట్ లీ

Jetlee Review:  నటీనటులు: సత్య, రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్, కబీర్ దుహాన్ సింగ్, హర్ష చెముడు, శుభలేఖ సుధాకర్, తదితరులు
సంగీత దర్శకుడు: కాల భైరవ
ఛాయాగ్రహణం: సురేష్ సారంగం
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
దర్శకుడు: రితేష్ రానా
నిర్మాతలు: చిరంజీవి & హేమలత పెదమల్లు

మత్తు వదలరా చిత్రంతో న్యూ జెనరేషన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలు తీయగలనని ప్రూవ్ చేసుకున్న దర్శకుడు రితేష్ రానా, ఈసారి కమెడియన్ సత్యను హీరోగా పెట్టి జెట్ లీ అనే యాక్షన్ కామెడీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. రితేష్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు రెగ్యులర్ స్టైల్ లో ఉండవని తెలిసిందే. పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఫాస్ట్ కట్ షాట్స్ తో ట్రెండీ ఫీల్ తీసుకొస్తాడు. జెట్ లీ విషయానికి వస్తే టైటిల్, టీజర్ల తో సినిమాపై ఓ మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలు పెంచడం ఒక ఎత్తైతే, ప్రేక్షకులను సినిమాతో మెప్పించడం మరో ఎత్తు. జెట్ లీ ప్రేక్షకులకు నవ్వులు పంచిందా, ఈ సమ్మర్ హీట్ ను, పెట్రోల్- డీజిల్ షార్టేజ్ ను మరిచిపోయేలా చేసిందా అనేది మనం రివ్యూలో చూద్దాం.

కథ: ప్రజాపతి బ్యాంక్ లో పదిహేను వేల కోట్ల స్కామ్ జరుగుతుంది. ప్రజల ఆగ్రహం ఎక్కువ కావడంతో ప్రాణాలకే ప్రమాదమని భావించి బ్యాంక్ ఓనర్ ప్రజాపతి(అజయ్) ఏం చేయాలా అని తీవ్రంగా ఆలోచిస్తాడు. చివరికి స్కాములు చేసేవారు ఫాలో అయ్యే శాసనాల గ్రంథంలో ఉండే మొదటి రూల్ అనుసరించి దుబాయికి పారిపోతాడు. ఈ క్రమంలో అతనిని చంపడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తుంటారు. స్పెషల్ ఏజెంట్ శివాని రాయ్ (రియా సింఘా) ప్రజాపతిని పట్టుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ప్రజాపతిని దుబాయి నుంచి కొచ్చి తీసుకురావడానికి ఒక విమానంలో ఏర్పాట్లు చేస్తారు. ఇదే ఫ్లైట్ లో మన హీరోగారు వేదవ్యాస్(సత్య) స్టోరీలోకి ఎంట్రీ ఇస్తాడు. గతం మర్చిపోయి తనెవరో తెలియకుండా ప్రవర్తిస్తూ ఏం చేశాడు? అసలు వేదవ్యాస్ గతం ఏంటి? ప్రజాపతిని ఇండియాకు తీసుకొచ్చే ఆపరేషన్ కు వేదవ్యాస్ కు ఏమైనా లింకు ఉందా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడక తప్పదు.

విశ్లేషణ: రితేష్ రానా సినిమాల్లో కనిపించే మీమ్ బేస్డ్ జోక్స్, పాత్రలు డైరెక్ట్ గా ప్రేక్షకులతో మాట్లాడడం లాంటివి, then-go లాంటి బూతు కాని బూతు పదాల లాంటివి ఈ సినిమాలో కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ వరకూ హీరో సత్య కామెడీ టైమింగ్‌తో మరియు వెన్నెల కిషోర్ పాత్రతో సరదాగా సాగుతుంది. సత్య క్యారెక్టరైజేషన్, ముఖ్యంగా తనెవరో తనకు తెలియకుండా ప్రవర్తిస్తున్నపుడు వచ్చిన సీన్స్ కాసేపు నవ్విస్తాయి. అయితే వన్ లైనర్స్ మీద పెట్టిన శ్రద్ద స్క్రీన్ ప్లే మీద లేకపోవడంతో అవన్నీపైపై మెరుగుల తరహాలో అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా పూర్తిగా పట్టాలు తప్పి తెరపై ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ప్రేక్షకుల్లో పడతారు. కామెడీ సినిమాల్లో కథ బలంగా లేకుండా పంచుల మీద పంచులు వేసుకుంటే ఒక స్టేజ్ వచ్చేసరికి మొహం మొత్తుతుంది. ఈ సినిమాలో కూడా వన్ లైనర్లు, మీమ్ డైలాగులు ఒక్క క్షణం గ్యాప్ ఇవ్వకుండా ఉండడంతో ప్రేక్షకుల్లో సెకండ్ హాఫ్ వచ్చేసరికి అసహనం కలుగుతుంది. యాక్షన్ పార్ట్ కూడా ఉన్నప్పటికీ అప్పటికే నీరసం రావడంతో ప్రేక్షకులకు వాటిని ఎంజాయ్ చేసే పరిస్థితి ఉండదు.

కాలభైరవ సంగీతం సినిమా స్టైల్ కు తగ్గట్టు, ట్రెండీగా ఉంది. సినిమాలో పాటలు లేకపోవడం పెద్ద రిలీఫ్. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. కథలో ఎక్కువ భాగం ఫ్లైట్ లో జరిగినప్పటికీ ఆ ఫీల్ కలగకుండా చూసుకున్నారు. ఈ విషయంలో సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డిపార్ట్ మెంట్ వారిని మెచ్చుకోకుండా ఉండలేం. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో బోరింగ్ సీన్స్ ను ఎడిటింగ్ లో కట్ చేసి ఉండాల్సింది.

ఈ సినిమాకి హీరో అయిన సత్య తనదైన కామెడీ టైమింగ్‌తో సినిమాను నిలబెట్టడానికి ప్రయత్నించాడు. వెన్నెల కిషోర్ పాత్ర కూడా ప్రేక్షకులకు చాలా సీన్స్ లో వినోదాన్ని పంచింది. హీరోయిన్ రియా కు లవ్ సీన్స్ లేనప్పటికీ స్పెషల్ ఏజెంట్ గా మంచి రోలే దక్కింది. ప్రజాపతి పాత్రలో అజయ్ నటన డీసెంట్ గా ఉంది. ఈ సినిమాలో సహాయ నటుల పాత్రలు చాలానే ఉన్నప్పటికీ పెద్దగా ఎవరికీ స్కోప్ దక్కలేదు. ఉన్నంతలో హర్ష చెముడు కాస్త బెటర్.

ఫైనల్ గా చెప్పాలంటే, రితేష్ రానా స్టైల్ కామెడీని ఇష్టపడే వారు, సత్య నటనను ఎంజాయ్ చేసే వారు కూడా ఈ సినిమాకు టికెట్ కొని థియేటర్ లో చూడడం కష్టం. ఓటీటీలో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ చేతిలో పెట్టుకుని ఒక లుక్కేయవచ్చు.

సినిమాలో బాగోలేనివి ఇవీ..

1. బలహీనమైన సెకండ్ హాఫ్‌

2. సిల్లీ పంచ్ లు, సిల్లీ మీమ్ డైలాగ్స్, అతి అనిపించే సీన్స్

3. రిపీట్ అనిపించే సీన్స్.

ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?

1. సత్య నటన, కామెడీ టైమింగ్

2. అక్కడక్కడా నవ్వించే కొన్ని పంచ్ లు

రేటింగ్: 2 / 5

ఫైనల్ వర్డ్: మిస్ చేయదగ్గ మిస్ ఫైర్

Ramu Kovuru
Ramu Kovuruhttps://oktelugu.com/
Ramu Kovuru is a writer having 10 plus years of experience. He has worked for websites writing movies content. He is also woriking in Telugu film industry as a writer for the past 5 years. He has good knowledge in cinema across the languages. He contributes to movie reviews.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular