Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ నుండి శాశ్వతంగా తొలగించినట్టు ఉదయం నుండి వినిపిస్తున్న వార్తలు ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ ప్రస్తుతం మధ్యంతర బైలు మీద విడుదలయ్యాడు. అయితే ఆయనపై పోక్సో చట్టం క్రింద కేసు నమోదు అవ్వడం తో, అతనికి వచ్చిన నేషనల్ అవార్డుని కూడా వెనక్కి తీసేసుకున్నారు. కేసు రుజువు కాకముందే జానీ మాస్టర్ పై ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదంటూ ఆయన తోటి కొరియోగ్రాఫర్స్ అప్పట్లో స్పందించారు. అంతే కాకుండా 2023 వ సంవత్సరం నుండి కొరియోగ్రాఫర్స్ అస్సోసియేషన్ కి ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న జానీ మాస్టర్ ని తొలగించారు కూడా. నిన్న ఈ ప్రెసిడెంట్ పదవికి ఎన్నికలు జరగగా, జోసెఫ్ ప్రకాష్ ని కొత్త ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. దీనిపై జానీ మాస్టర్ తన అభ్యంతరం వ్యక్తం చేసాడు.
తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా కొత్త అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారని, రూల్స్ కి విరుద్ధంగా జరిగిన ఈ ప్రక్రియ పై తాను న్యాయపోరాటం చేస్తానని చెప్పుకొచ్చాడు జానీ మాస్టర్. అదే విధంగా ఉదయం నుండి తన మెంబెర్ షిప్ ని రద్దు చేసారంటూ సోషల్ మీడియా లో వస్తున్న వార్తలను ఆయన కొట్టి పారేసాడు. నేను ఇప్పటికీ మెంబెర్ గానే కొనసాగుతున్నానని, తనని ఎవ్వరూ కూడా తొలగించలేరని ఈ సందర్భంగా జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు. ఇలా గత కొంత కాలంగా జానీ మాస్టర్ నలుదిక్కులా అశుభాలు తగులుతున్నాయి. దీని నుండి కోలుకొని మళ్ళీ ఆయన మామూలు మనిషి అవ్వడానికి చాలా సమయమే పట్టేలా ఉంది. ఇంతకు ముందులాగా మామూలు అవ్వడానికి ఆయన చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు కానీ, చేతి దాకా వచ్చిన అవకాశాలు జైలు కి వెళ్లడం వల్ల వెనక్కి వెళ్లాయనే బాధ ఆయనలో అలాగే ఉండిపోయింది.
ఉదాహరణకు ‘పుష్ప 2’ చిత్రంలో జానీ మాస్టర్ ఒక పాటకు కొరియోగ్రఫీ చెయ్యాల్సి ఉంది. కానీ ఎప్పుడైతే ఆయన జైలుకు వెళ్ళాడో, అప్పుడే ఆయనకి ఈ ప్రాజెక్ట్ చేజారింది. ‘పీలింగ్స్’, ‘కిస్సిక్’ వంటి పాటలు జానీ మాస్టర్ కంపోజ్ చేయాల్సినవి అట. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ రెండు పాటలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతీ చోట అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. థియేటర్స్ లో అయితే ఈ పాటలు వచ్చినప్పుడు ఆడియన్స్ సీట్స్ మీద కూర్చోవడం లేదు. అలాంటి సెన్సేషనల్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు జానీ మాస్టర్. మళ్ళీ ఆయన మునుపటి లాగా పెద్ద హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ ఎప్పుడు చేస్తాడో అని సోషల్ మీడియా లో ఆయన్ని అభిమానించే వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. మరి జానీ మాస్టర్ భవిష్యత్తులో ఏమైనా మార్పులు వస్తాయో లేదో చూడాలి.