‘జంధ్యాల’.. నవ్వులకు గ్రామర్ నేర్పిన మాస్టర్. తెలుగు వెండితెర పై ఎందరో దర్శక దిగ్గజాలు ఒక వెలుగు వెలిగి ఉండొచ్చు. కానీ, రకరకాల రంగుల మధ్యలో తెలుగు తెరకు తెగులు పట్టకుండా తన కామెడీ టైమింగ్ తో మంచి కామిక్ టానిక్ ఇచ్చి వెళ్ళింది మాత్రం ఒక్క జంధ్యాలనే. నేడు ఆయన వర్ధంతి, ఈ సందర్భంగా జంధ్యాల నవ్వులు గురించి గుర్తుచేసుకుందాం. అసలు జంధ్యాల తలుచుకోగానే ఆయన సినిమాలు మన కళ్ళల్లో ప్లే అవుతూనే ఉంటాయి.
జంధ్యాలే ఓ సినిమాలో రాశారు, ఏ ప్రత్యేకతా లేకపోవడమే ప్రత్యేకత అని. ఇప్పుడు సినిమాల పరిస్థితి అలాగే ఉంది. కానీ అప్పుడెప్పుడో వచ్చిన జంధ్యాల సినిమాల్లో ఇప్పటికీ ఏదొక ప్రత్యేకత ఉంటుంది. కానీ, ఆయన ఎప్పుడూ గుర్తింపు కోసం ప్రయత్నించలేదు, అదే ఆయన ప్రత్యేకత. జంధ్యాల గురించి ఎప్పుడు ప్రస్తావించిన ఒక సీన్ బాగా జ్ఞప్తికి వస్తోంది.
‘చంటబ్బాయ్’ సినిమాలో శ్రీలక్ష్మితో పొట్టి ప్రసాద్ తలా బాదుకుంటూ అనే మాట.. ‘చారు ఎలా చేయాలో ఒక పాత్ర చేత చెప్పించి కథ అంటావా’ అని కోపాన్ని పెదవి చాటునే దాచిపెట్టి, లేని నవ్వును పెదవి బయటకు విసిరేస్తూ బాధగా మూలగ లేక, తల బాదుకొని నవ్వుకుంటూ అనే మాట ఇది. పొట్టి ప్రసాద్ గొప్ప నటుడు ఏమి కాదు. ఈ సీన్ లో ఆయన నటన ముందు మహా మహానటులు కూడా సరిపోరేమో. కారణం జంధ్యాల టైమింగ్.
సామాన్య నటుడ్ని కూడా ఆరాధించేలా ఆ నటుడికి పాత్ర రాయడం ఒక్క జంధ్యాలకే సాధ్యం అయింది. ఇక శ్రీలక్ష్మి కోపంగా అమాయకంగా సమాధానం చెబుతూ ‘అది కథెందుకు కాదు. నెత్తికి రీటా కాలికి బాటా నాకిష్టం సపోటా అంటూ తనకు మాత్రమే సాధ్యమైన ఓ కవిత్వం చెప్పి ఆస్కార్ అవార్డు అందుకున్న నటిలా శ్రీలక్ష్మి చూసే చూపు, ఎన్ని నవ్వులు పూయించింది.
నీకూ నాకూ టాటా… నన్నొదిలెయ్ ఈ పూట అంటూ పొట్టి ప్రసాద్ పారిపోవడానికి ప్రయత్నం చేయడం గుర్తుతెచ్చుకుని మరి మనం హాయిగా నవ్వుకోవచ్చు. జంధ్యాల ఎన్నో సినిమాల్లో ఎంతో గొప్ప కామెడీ రాస్తే.. కేవలం ఈ సీన్ గురించే ఎందుకు ప్రస్తావిస్తున్నాం అంటే.. జంధ్యాల ఈ సీన్ అసలు రాయలేదు. షూటింగ్ ఆ రోజు గంట ముందు అయిపోయింది. మరో అరగంట ఖాళీ సమయం ఉంది. ఆ అరగంటలో అప్పటికప్పుడు అనుకుని తీసిన సీన్ ఇది. అది జంధ్యాల హాస్య చతురత అంటే.