Jagapathi Babu : ఈ నెల నాల్గవ తేదీన సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసిలాట ఘటన రోజురోజుకి కొత్త మలుపులు తీసుకుంటుంది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద మాత్రమే కాకుండా, సినీ ఇండస్ట్రీ పై కూడా తీవ్రమైన అసహనం అసెంబ్లీ సాక్షిగా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ని ఒక్క రోజు జైలులో వేసినందుకే అతనికి జరగరానిది ఎదో జరిగిపోయినట్టు సినీ ఇండస్ట్రీ మొత్తం పరామర్శించడానికి వెళ్ళింది, కానీ పరోక్షంగా అతని వల్ల చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న శ్రీ తేజ్ ని పరామర్శించడానికి ఒక్కరు కూడా రాలేదు. అసలు వీరిలో మానవత్వం ఉందా, అసలు సినీ పెద్దలు ఏమని ఆలోచనలు చేస్తున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీని పై ప్రముఖ సినీ హీరో జగపతి బాబు కాసేపటి క్రితమే ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘సంధ్య థియేటర్ లో జరిగిన దుర్ఘటన తెలిసినప్పుడు నేను వేరే ఊరిలో షూటింగ్ లో ఉన్నాను. షూటింగ్ నుండి హైదరాబాద్ కి రాగానే ఆ అబ్బాయి చికిత్స తీసుకుంటున్న కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి, అతని ఆరోగ్య పరిస్థితి ని ఒక మానవతా దృక్పధంతో తెలుసుకున్నాను. అతను నెమ్మదిగా కోలుకుంటున్నాడు అని తెలుసుకొని సంతోషించాను. ఇదంతా నేను ఎవ్వరికీ చెప్పలేదు, కానీ సినీ ఇండస్ట్రీ ఆ అబ్బాయిని పట్టించుకోలేదని అంటున్నారు కదా, అందుకే ఈ వీడియో చెయ్యాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు. జగపతి బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన ఈ ట్వీట్ వేసిన వెంటనే అల్లు అర్జున్ స్పందిస్తూ ‘థాంక్యూ సార్’ అని రిప్లై ఇచ్చాడు. కేవలం జగపతి బాబు ఒక్కడే కాదు, ఇండస్ట్రీ కి సంబంధించిన మిగిలిన వాళ్ళు కూడా దీనిపై స్పందించే అవకాశాలు ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే నేడు అల్లు అర్జున్ ఇంటిపై ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు దాడి చేసిన ఘటన సంచలనం గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటన కి సంబంధించిన వీడియోలను చూసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి న్యాయం చెయ్యాలని, లేని పక్షం లో చాలా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అంటూ అతని ఇంట్లోకి చొరబడి, సెక్యూరిటీ మీద దాడి చేసి, పూల కుండీలను నేలకేసి కొట్టి విద్వంసం సృష్టించారు. ఒక పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ఇంట్లోకి చొరబడి దాడి చేసేంత స్వేచ్ఛ వచ్చిందంటే, తెలంగాణ లో లా & ఆర్డర్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియా లో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో, ఎన్ని ఘటనలు చూడాలి అని అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.