Jabardasth New Anchor: కింగ్ ఆఫ్ కామెడీ షోస్ జబర్దస్త్ దశాబ్దకాలంగా తిరుగులేకుండా దూసుకుపోతుంది. ఈ షో వేదికగా సామాన్యులు స్టార్స్ అయ్యారు. ముఖ్యంగా యాంకర్స్ రష్మీ గౌతమ్, అనసూయల దశ మార్చేసిన షో ఇది. వాళ్ళు కలలో కూడా ఊహించి ఉండరు ఈ స్థాయికి చేరుతామని, హీరోయిన్ గా సినిమాలు చేస్తామని. ఒక్క యాంకర్స్ ఏంటి… సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, మహేష్, రచ్చ రవి, చమ్మక్ చంద్ర చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే ఉంది. ఒకప్పుడు ఎవరో కూడా తెలియని వీరందరూ బుల్లితెర నుండి వెండితెర వరకూ దున్నేస్తున్నారు.
ఆ షోకి ఉన్న ఫేమ్ రీత్యా జబర్దస్త్ లో అవకాశం కోసం వేల మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా యాంకరింగ్ స్థానం కోరుకునే అమ్మాయిలు ఎందరో ఉన్నారు. అనసూయ నిష్క్రమణతో ఆశావహులకు ప్రాణం లేచి వచ్చింది. కొద్ది నెలల క్రితం అనసూయ జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పింది. తీరిక లేని షెడ్యూల్స్ కారణంగా జబర్దస్త్ వదిలేస్తున్నట్లు వెల్లడించారు. జబర్దస్త్ కి అనసూయ, ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మీ చాలా కాలంగా యాంకరింగ్ చేస్తున్నారు.
అనసూయ మానేయడంతో కొత్త యాంకర్ వస్తుంది అనుకున్నారు. అయితే నిర్వాహకులు రష్మీకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా ఉన్న రష్మీ జబర్దస్త్ కూడా చేస్తున్నారు. కొత్త అమ్మాయిని తెస్తే సక్సెస్ అవుతుందా లేదా అనే సందేహం మేకర్స్ లో కలిగింది. అయితే ఎట్టకేలకు జబర్దస్త్ కి కొత్త యాంకర్ ని తెచ్చారు. నెక్స్ట్ ఎపిసోడ్లో కొత్త అమ్మాయి యాంకర్ గా దిగుతున్నారు.
ఆ యాంకర్ పేరు సౌమ్య రావు అని తెలుస్తోంది. జబర్దస్త్ ప్రోమోలో ఆమెను పరిచయం చేశారు. మంచి హైట్, సన్నజాజి తీగలా ఉన్న సౌమ్య గ్లామర్ లో అనసూయ, రష్మీలకు ఏమాత్రం తీసిపోదు అన్నట్లు ఉంది. సౌమ్య రావుకు జబర్దస్త్ జడ్జెస్ ఇంద్రజ, కృష్ణ భగవాన్ సాదరంగా ఆహ్వానం పంపారు. ఇక మొదటి ఎపిసోడ్ రోజే కొత్త యాంకర్ కి హైపర్ ఆది, రాకెట్ రాఘవ చుక్కలు చూపించారు. జబర్దస్త్ యాంకరింగ్ అతిపెద్ద బాధ్యత కాగా సౌమ్య అంచనాలు ఎంత వరకు అందుకుంటారో చూడాలి.