Jabardasth New Anchor: జబర్దస్త్ కామెడీ షోకి ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో సమూల మార్పులు చేశారు. రష్మీతో పాటు మరొక యాంకర్ కూడా జాయిన్ అయ్యారు. అయితే ఆ నయా యాంకర్ కి రష్మీ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ ఆ యాంకర్ ఎవరో చూద్దాం..
జబర్దస్త్ లెజెండరీ కామెడీ షో అనడంలో సందేహం లేదు. ఆ షో క్రియేట్ చేసిన రికార్డులు అలాంటివి మరీ. గురువారం, శుక్రవారం ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోల కోసం కామెడీ ప్రియులు ఎదురు చూసేవారు. అటు యూట్యూబ్ లో కూడా రికార్డు వ్యూస్ జబర్దస్త్ స్కిట్స్ , ఎపిసోడ్స్ రాబట్టేవి. 2013లో ఈటీవీలో ప్రయోగాత్మకంగా జబర్దస్త్ మొదలైంది. రోజా, నాగబాబు జడ్జెస్ గా వ్యవహరించారు. అనసూయ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. షో ఊహించని ఆదరణ సొంతం చేసుకోవడంతో సామాన్యులు స్టార్స్ అయ్యారు.
ఒకప్పుడు ఎలాంటి ఫేమ్ లేని అనసూయ, రష్మీ, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, చలాకీ చంటి, రామ్ ప్రసాద్ తో పాటు పలువురు జబర్దస్త్ వేదికగా ఫేమ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై రాణిస్తున్నారు. దశాబ్దానికి పైగా ప్రసారం అవుతున్న జబర్దస్త్ ఇటీవల వైభవం కోల్పోయింది. ఒకప్పుడు జబర్దస్త్ కి ప్రత్యేక ఆకర్షణగా ఉన్న స్టార్స్ ఇప్పుడు అక్కడ లేరు. ఒక్కొక్కరిగా షోకి గుడ్ బై చెప్పారు. నాగబాబుతో మొదలైన నిష్క్రమణల పరంపర కొనసాగింది.
సుడిగాలి సుధీర్, హైపర్ ఆది టీమ్స్ ప్రధాన బలంగా ఉండేవి. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను తప్పుకోవడంతో జబర్దస్త్ లో క్వాలిటీ కామెడీ ఇచ్చే టీమ్స్ లేకుండా పోయాయి. తన గ్లామర్ తో అలరించే అనసూయ సైతం జబర్దస్త్ షోను వీడిన సంగతి తెలిసిందే. జూనియర్ కమెడియన్స్ తో పాటు కొందరు కొత్తవాళ్లు టీమ్ లీడర్స్ గా జబర్దస్త్ షో కొనసాగుతుంది. జబర్దస్త్ కి ఒక బ్రాండ్ నేమ్ ఉన్న క్రమంలో ఈ షోని వదులుకోవడానికి మల్లెమాల సంస్థ ఇష్టపడటం లేదు. మార్పులు చేర్పులు చేయడం ద్వారా పునర్వైభవం తేవాలని చూస్తుంది.
రష్మీ గౌతమ్ జబర్దస్త్ కి సోలో యాంకర్ గా చేస్తుంది. కాగా న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ కొత్తగా లేటెస్ట్ ఎపిసోడ్ రూపొందించారు. అన్నీ డబుల్ అంటున్నారు. దాంతో రష్మీకి తోడుగా నటుడు మానస్ ని మరో యాంకర్ గా తెచ్చారు. కృష్ణభగవాన్ జడ్జిగా రీఎంట్రీ ఇచ్చారు. ఇక జబర్దస్త్ న్యూ యాంకర్ మానస్ కి.. ఇక్కడ ఉంది మాస్ పిల్ల అంటూ.. రష్మీ వార్నింగ్ ఇవ్వగా, నేను మానస్.. నువ్వు మాసైతే నేను ఊరమాస్ అంటూ తిరిగి వార్నింగ్ ఇచ్చాడు. జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో వైరల్ అవుతుంది.