Jabardasth Faima: ఒకప్పుడు నిలువ నీడలేని ఫైమా హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కునే స్థాయికి వెళ్ళింది. పట్టుదల ఉంటే ఎవరి అండదండలు లేకుండా లక్ష్యాలు చేరుకోవచ్చని నిరూపించింది. జబర్దస్త్ కి వచ్చే వరకు ఫైమా ఒక పేద అమ్మాయి. నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. కూలీనాలీ చేసి అమ్మ పెంచి పెద్ద చేసింది. ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉండే అద్దె ఇంట్లో కనీసం బాత్ రూమ్ సౌకర్యం కూడా ఉండేది కాదట. అలాంటి దుర్భర స్థితిలో కమెడియన్ గా రాణించగలనని జబర్దస్త్ వైపు అడుగులు వేసింది. చిన్నగా అవకాశాలు అందిపుచ్చుకుంది.

తనకంటూ ఒక కామెడీ స్టైల్ క్రియేట్ చేసుకుంది. తన రూపం, మాటలతో నవ్విస్తూ జబర్దస్త్ టాప్ కమెడియన్స్ స్థాయికి చేరింది. ఫైమా కామెడీ నవ్వులు పూయిస్తుండగా టీమ్ లీడర్స్ ఆమెకు స్కిట్ లో స్పేస్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొని… ఫైమా బుల్లితెర కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక బిగ్ బాస్ షోతో ఫైమా పాపులారిటీ రెట్టింపయింది. ఫైమా అంచనాలకు మించి సక్సెస్ అయ్యారు.
ఏళ్ల తరబడి పరిశ్రమలో ఉన్నవాళ్లు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఎలిమినేటై వెళ్లిపోయారు. ఫైమాను అందరూ తక్కువ అంచనా వేశారు. అంతెందుకు తన సీనియర్ చలాకీ చంటి మూడు నాలుగు వారాల్లోనే బట్టలు సర్దుకున్నాడు. ఫైమా గేమ్స్, టాస్క్లో మగాళ్లకు కూడా గట్టి పోటీ ఇచ్చేది. చాలా తెలివిగా ఆలోచించేది. అందుకే ఫైమా పది వారాలకు పైగా హౌస్లో ఉన్నారు. బిగ్ బాస్ 6లో ఫైమా తన మార్క్ గేమ్ తో ఆడియన్స్ ని అలరించారు.
ఆర్థికంగా నిలదొక్కుకున్న ఫైమా ఇటీవల ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన తల్లిగారి కోసం కారు కొన్నట్లు చెప్పారు. కొడుకు ఉంటే బైక్స్ మీద, కార్లలో నన్ను తిప్పేవాడు కదా, అని మా అమ్మ బాధపడుతూ ఉండేది. ఆ వేదన కూతురిగా నేను తీర్చాను. అమ్మ కోసం కారు కొన్నాను అని చెప్పింది. అమ్మకు సొంత ఇల్లు ఏర్పాటు చేయాలనేది ఎప్పటి నుంచో ఉన్న కల. ఇల్లు అయితే కొన్నాను. దాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయించాల్సి ఉందని ఫైమా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ కి వెళ్లడం వలన ఫైమా జబర్దస్త్ షో చేసే కోల్పోయారు. అయితే ఆమె స్టార్ మాలో బీబీ జోడీ చేస్తున్నారు. ఫైమా అంతకంతకు తన రేంజ్ పెంచుకుంటూ పోతున్నారు.