Johnny Master: టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్స్ లో జానీ మాస్టర్ ఒకరు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ పరిశ్రమలలో ఆయన పని చేస్తున్నారు. కాగా 21 ఏళ్ల లేడీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు పెట్టింది. జానీ మాస్టర్ కొన్నాళ్లుగా తనను లైంగికంగా వాడుకుంటున్నాడు. లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్లిన పలు సందర్భాల్లో జానీ మాస్టర్ లైంగిక దాడి చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఆయన మీద కేసు నమోదైంది.
అయితే ఇదంతా కుట్రలో భాగం అంటున్నాడు జానీ మాస్టర్. ఉద్దేశపూర్వకంగా తనను ఇరికించారని వాపోతున్నాడు. జానీ మాస్టర్ మాట్లాడుతూ… నన్ను ఉద్దేశపూర్వకంగా కొందరు ఇరికించారు. యూనియన్ గొడవలను ఇలా మార్చారు. ఆ యువతికి డబ్బులు చెల్లించి నాపై కేసులు పెట్టించారు. ఆమె నా వద్ద గతంలో పని చేసింది. తర్వాత వివాహం చేసుకుని వెళ్ళిపోయింది. నేను నాన్ మెంబర్స్ తో పని చేయించడం పై ప్రశ్నించాను. ఇది నచ్చని వారు నాపై ఈ కేసు పెట్టించారు. ఆధారాలు ఉంటే నన్ను శిక్షించండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను, అన్నాడు.
ఈ ఉదంతంపై జానీ మాస్టర్ భార్య సైతం స్పందించారు. ఆమె మీడియా సమావేశంలో సంచలన కామెంట్స్ చేసింది. నాన్ మెంబర్స్ తో పని చేయిస్తున్నారని తెలిసి జానీ మాస్టర్ షూటింగ్ స్పాట్ కి వెళ్లి ప్రశ్నించారు. శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ వంటి వాళ్ళు జోక్యం చేసుకోలేదు. బహుశా వాళ్ళు బిజీగా ఉండి ఉండొచ్చు. జానీ మాస్టర్ కి కూడా పనులు ఉన్నాయి. కానీ యూనియన్ మెంబర్స్ శ్రేయస్సు కోసం జానీ మాస్టర్ చొరవ తీసుకున్నారు. అందుకు ఆయన మీద లైంగిక ఆరోపణల కేసు పెట్టించారు.
మేడ్చల్ సీఐ కాల్ చేస్తే జానీ మాస్టర్ మరికొందరితో పాటు స్టేషన్ కి వెళ్లారు. మీ పై కేసు నమోదు అయ్యింది. మీరు అరెస్ట్ అన్నారట. ఏ తప్పు చేయకుండానే జానీ మాస్టర్ 14 రోజులు రిమాండ్ అనుభవించాడని, ఆమె వాపోయింది. కాగా జానీ మాస్టర్ పై గతంలో కూడా కొన్ని కేసులు నమోదు అయ్యాయి. జనసేన పార్టీ మెంబర్ గా ఉన్న జానీ మాస్టర్ ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే సింగర్ చిన్మయి.. జానీ మాస్టర్ పై కీలక ఆరోపణలు చేసింది. ఆ యువతి మైనర్ గా ఉన్నప్పటి నుండే జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడని ఆమె అన్నారు.