మెగాస్టార్ – కొరటాల కాంబోలో వస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా మే 14న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ.. కరోనా విజృంభిస్తున్న ఈ పరిస్థితుల్లో సినిమా విడుదల దాదాపు కష్టం. అయితే.. సహజంగా సినిమా వాయిదా పడితే నిర్మాతకు నిద్రపట్టదు. కానీ.. ఆచార్య విషయంలో రివర్స్ అయ్యిందని అంటున్నారు. నిర్మాతలు ప్రశాంతంగా ఉండగా.. కొరటాలకు కునుకు పట్టట్లేదన్న విషయం చక్కర్లు కొడుతోంది.
అసలు విషయం ఏమంటే.. తాను డైరెక్ట్ చేసిన సినిమాలను తనకు సంబంధించిన వారికే కొరటాల అమ్మి పెడతాడని అంటారు. ఆయనకు ఏరియాల వైజ్ గా డిస్ట్రిబ్యూటర్ల టీమ్ ఉందని చెబుతారు. అంతేకాదు.. సినిమాను వారికి ఎంత అమ్మేయాలన్నది కూడా కొరటాలే డిసైడ్ చేస్తాడట. రేటు కూడా ఆయనే ఫిక్స్ చేస్తాడని అంటారు. ఇప్పడు ‘ఆచార్య’ విషయంలోనూ ఇదే పరిస్థితి అనుకున్నారు.
అయితే.. ఆచార్యకు నిర్మాత నిరంజన్ రెడ్డి అన్నది తెలిసిందే. కొణిదెల వారి సమర్పణ అన్నది కేవలం టైటిల్ కార్డే తప్ప.. పెట్టుబడులు ఏమీ లేవని సమాచారం. అయితే.. నిరంజన్ రెడ్డి కూడా కొరటాలతో ఓ డీల్ మాట్లాడుకున్నారని వార్తలు వస్తున్నాయి. సినిమాకు పెట్టిన పెట్టుబడి మీద ఓ ఐదు కోట్లు లాభం ఇస్తే చాలనేది ఆ ఒప్పందం సారాంశమట. ఆ విధంగా సినిమాను కొరటాలకే వదిలేసినట్టు చెబుతున్నారు.
ఈ డీల్ కొరోనా సెకండ్ వేవ్ కు ముందే జరిగిందట. ఇప్పుడు చూస్తేనేమో.. కరోనా విజృంభిస్తోంది. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పలేని పరిస్థితి. మరి, అప్పటి వరకూ పెరిగిపోతున్న వడ్డీ ఎవరి అకౌంట్లో పడుతుంది అంటే.. కొరటాల పేరే వినిపిస్తోంది. ఈ కారణం వల్లే నిర్మాత ప్రశాంతంగా ఉంటే.. కొరటాల మాత్రం ఆందోళనకు గురవుతున్నారట.