Super Star Krishna: హీరో కృష్ణ నట జీవితం నల్లేరు మీద నడక కాలేదు. తేనెమనసులు సినిమాలో ఆయన సోలో హీరో కాదు. రాంప్రసాద్ అనే నటుడితో తెర పంచుకోవలసి వచ్చింది. వాస్తవానికి ఆ సినిమాలో హీరో కృష్ణను పెట్టుకుంటే చాలామంది తీసేయాలని ఒత్తిడి తెచ్చారు. ఇందుకు కారణాలు ఆదుర్తి సుబ్బారావు చెప్పలేదు. హీరో కృష్ణ బయటికి వెల్లడించలేదు. ఇప్పటికీ అది ఒక చిదంబర రహస్యమే. తేనె మనసులు విజయవంతమైన తర్వాత కన్నెమనుసులు అనే సినిమా ప్రారంభమైంది. అది కూడా విజయవంతమైన తర్వాత మరో సినిమా చేయడానికి హీరో కృష్ణకు చాలా సమయమే పట్టింది.. అయితే మల్లికార్జున రావు ఒక జేమ్స్ బాండ్ కథ రాశారు. దానిని తీసుకొని నిర్మాతలైన డూండీ, సుందర్లాల్ నహతా వద్దకు వెళ్లారు. ఈ సినిమాకి మాటలు రాసే బాధ్యత ఆరుద్ర తీసుకున్నారు. అయితే ఈ కథ మొదట శోభన్ బాబు వద్దకు వెళ్ళింది. ఆయన కూడా చేసేందుకు ఒప్పుకున్నారు. అప్పటికే వీరాభిమన్యు అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టి శోభన్ బాబు మంచి ఫామ్ లో ఉన్నారు.. కానీ ఎందుకో శోభన్ బాబుకి, నిర్మాతలకు మధ్య క్రియేటివ్ గ్యాప్ వచ్చింది. ఇది కృష్ణకు ఆయాచిత వరంలా మారింది. వెంటనే ఏజెంట్ 116 పట్టాలు ఎక్కింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ శోభన్ బాబు ఈ సినిమాలో అతిధి పాత్ర చేసేందుకు ఒప్పుకున్నారు.

కొత్త తరహా ప్రయోగాలు
ఏజెంట్ 116 షూటింగ్ మొదలైంది. బహుశా ఈ సినిమా ఇంట్రడక్షన్ సాంగ్ కొత్త తరహా ప్రయోగాలకు నాంది పలికింది.. ఈ పాటలో వెన్ని రాడై నిర్మల కనిపిస్తారు. కథానాయక జయలలిత తో కృష్ణ నర్తించిన యుగళగీతం ” ఎర్ర బుగ్గల మీద” ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్. “నువ్వు నా ముందుంటే ఆహ్లాదం” ఇప్పటికీ ప్రేక్షకుల నోళ్ళల్లో నానుతూ ఉంటుంది.” “మనసు తీరా నవ్వులు.. నవ్వులే” ఒక మత్తులో ముంచుతుంది. అన్నట్టు ఈ పాటలకు బాణీలు కట్టింది ఈ చలపతిరావు. అప్పట్లో ఈ సినిమా పాటలన్నీ ఆల్ టైం సూపర్ హిట్ గా నిలిచాయి. రవికాంత్ నాగాయిత్ కెమెరా వర్క్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. రేలంగి, రమణారెడ్డి, రాజబాబు హాస్యం పొట్ట చెక్కలు చేస్తుంది. ఇక పహిల్వాన్ అయిన నెల్లూరు కాంతారావు, కృష్ణ మధ్య యాక్షన్ ఎపిసోడ్స్ ఇప్పటికీ థ్రిల్లింగ్ గా ఉంటాయి. రాజనాల, ముక్కాముల విలనిజం భయపెడుతుంది. ఆగస్టు 11, 1966 న విడులయిన ఈ సినిమా గత రికార్డులను పూర్తిగా చెరిపేసింది. న్యూ ఏజ్ సినిమాలకు ప్రాణం పోసింది. ఈ సినిమా తర్వాత కృష్ణ ఏకంగా 20 సినిమాలకి సైన్ చేశారు. ఇదే తరహాలో ఆయన ఆరు సినిమాలు చేశారు. కృష్ణ, డూండీ కాంబినేషన్ చాలా ఏళ్ల పాటు అప్రతిహతంగా సాగింది.

ఆ తర్వాత మూడు షిఫ్టులు పని చేశారు
గూడచారి 116 విజయవంతమైన తర్వాత కృష్ణ 20 సినిమాలకు సైన్ చేశారు. ఏ వుడ్ లో అయినా ఇది ఒక రికార్డు. రోజుకు మూడు షిఫ్టుల్లో పని చేసేవారు. ఏడాది లో 16 సినిమాలు చేశారు. ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ఒక వైపు ఎన్టీఆర్, మరో వైపు ఏఎన్నార్ ను తట్టుకొని నిలబడ్డారు. సాహసమే ఊపిరిగా నటించారు. పడినా అంతే వేగంగా లేచి నిలబడ్డారు.