Superstar Krishna Passed Away: సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా.. రాజకీయ నాయకుడిగా విజయపథంలో నడిచిన కృష్ణ ఇక ఈ లోకంలో లేరనే విషయాన్ని అభిమానులు, సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా ఆయనను చివరిసారిగా చూసేందుకు తరలి వస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు వివిధ మార్గాల్లో సంతాపం వ్యక్తం చేశారు.

కార్మిక లోకానికి నిజమైన హీరో: కేసీఆర్
నాటి కార్మిక లోకానికి సూపర్ స్టార్ కృష్ణ నిజమైన హీరో అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తాను కూడా కృష్ణ అభిమానినేనని గుర్తు చేసుకున్నారు. సినిమా రంగంలో నూతన ఒరవడులను సృష్ణించడంలో కృష్ణ కీలకంగా వ్యవహరించారని తెలిపారు. విభిన్న పాత్రలు వేయడంలో కృష్ణ దిట్ట అని కేసీఆర్ అన్నారు.
సినీ రంగానికి తీరని లోటు: జగన్
కృష్ణ మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అన్నారు. కష్ట సమయంలో ఆదుకునే వ్యక్తి కృష్ణ అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు. నిజ జీవితంలో మనసున్న మనిషి అని జగన్ తెలిపారు.
అద్భుత సినీ శకం ముగిసింది: చంద్రబాబు
తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, నటశేఖరుడిగా సూపర్ స్టార్ గా పిలిపించుకున్న కృష్ణ మరణంతో అద్భుత సినీ శకం ముగిసింది అని మాజీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా మెసేజ్ పెట్టారు. సినీరంగంలోనే కాకుండా ఎంపీగా ఆయన చేసిన సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయని కొనియాడారు.
మాటలకు అందని విషాదం: చిరంజీవి
సూపర్ స్టార్ కృష్ణ మరణం మాటలకు అందని విషాదం ఇది అని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో మెసేజ్ పెట్టారు. ఇంత మంచి నటుడు మమ్మల్ని వదిలిపెట్టడం నమ్మశక్యం కావడం లేదు. మంచి మనసు ఉన్న హిమాలయ పర్వతం కృష్ణ గారు. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయపదం అని ట్వీట్ చేశారు.
ఆయన మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది: బాలకృష్ణ
కృష్ణ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. చిత్ర సీమలోతనదైన నటనతో ఆకట్టుకున్న కృష్ణ మనమధ్య లేరని తెలియడం బాధాకరం, నటుడిగా, నిర్మాతగా స్టూడియో అధినేతగా చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు.. పవన్ కల్యాణ్
‘మద్రాసులో ఉన్నప్పటి నుంచి కృష్ణకు మా కుటుంబంతో అనుబంధం ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో కృష్ణ చేసిన కృషి మాములుది కాదు. నిర్మాతగా, దర్శకుడిగా అనేక కోణాల్లో ఆయన విజయఢంకా మోగించాడు. రాజకీయాల్లోనూ కృష్ణ తనదైన ముద్ర వేశారు. పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగారు. తెలుగు చిత్ర రంగాన్ని ఎన్నో విధాలుగా ఆదుకున్న కృష్ణ లేరని తెలియడం బాధాకం’ అని పవన్ ట్వీట్ చేశారు.

నిన్న తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో సూపర్ స్టార్ కృష్ణ ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కార్డియాక్ అరెస్టుతో కృష్ణ అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. అయితే 48 గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేదని చెప్పారు. అయితే ప్రస్తుతానికి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ తరువాత ఆయనను ఐసీయూకి మార్చి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఈ సందర్భంగా కృష్ణ ను చివరిసారిగా చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు తరలివస్తున్నారు. అటు మహేశ్ తీవ్ర విషాదంలో మునిగిపోవడంతో ఆయనను ఓదార్చుతున్నారు. అందుబాటులో లేని కొందరు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా కృష్ణ గురించి పెట్టడం వైరల్ గా మారింది.