Mada Venkateswara Rao: అసిస్టెంట్ డైరెక్టర్ కాస్తా మాడా ఎలా అయ్యాడు… వెంకటేశ్వరావును అలా మార్చేసిన స్టార్ డైరెక్టర్!

ఒకప్పటి కమెడియన్ మాడా గురించి తెలియనివారుండరు. నిజానికి ఆయన డైరెక్టర్ కావాలని ప్రరిశ్రమకు వచ్చాడు. నటుడిగా సెటిల్ అయ్యాడు. దీని వెనుక పెద్ద కథే ఉంది. ఓ స్టార్ దర్శకుడు ఆయన్ని మాడా గా మార్చేశాడు.

Written By: S Reddy, Updated On : September 21, 2024 9:39 am

Mada Venkateswara Rao

Follow us on

Mada Venkateswara Rao: 70-80లలో పాప్యులర్ కమెడియన్స్ లో మాడా ఒకరు. నపుంసకుడు పాత్రలకు ఆయన బ్రాండ్ నేమ్. పదుల సంఖ్యలో ఆ తరహా పాత్రలు చేశాడు. ‘చూడు చిన్నమ్మా పాడు పిల్లోడు’.. సాంగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆ సాంగ్ లో హిజ్రాగా మాడా నటనను ఎవరూ మర్చిపోలేరు. నపుంసకుడు పాత్రలో ఆయన అత్యంత సహజంగా నటించేవారు. ఆయన డైలాగ్ డెలివరీ చాలా ప్రత్యేకం. అయితే మాడా నపుంసకుడు పాత్రలతో పాటు కమెడియన్, విలన్, క్యారెక్టర్ రోల్స్ కూడా చేశాడు.

కాగా మాడా అసలు పేరు వెంకటేశ్వరరావు. ఆయన దర్శకుడు కావాలని పరిశ్రమకు వచ్చాడు. అప్పటి స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణరావు దగ్గర చేరాడు. మురళీ మోహన్, జయచిత్ర హీరో హీరోయిన్ గా చిల్లర కొట్టు చిట్టెమ్మ చిత్రం తెరకెక్కిస్తున్నారు దాసరి. ఆ చిత్రానికి వెంకటేశ్వరరావు అసిస్టెంట్ డైరెక్టర్. ఈ చిత్రంలో కీలకమైంది మాడా పాత్ర.

నపుంసకుడు పాత్ర కావడంతో చాలా మంది నటులు వెనకడుగు వేశారట. ఎవరిని అడిగా మేము చేయం అన్నారట. ఆ పాత్రకు సరిపోయే నటులను వెతికి వెతికి విసిగిపోయిన దాసరి… తన అసిస్టెంట్ అయిన వెంకటేశ్వరరావుతో… ”వెంకాయ్, ఎవరో ఎందుకు? నువ్వు ఈ మాడా పాత్ర చేసేయ్” అన్నాడట. గురువు చెప్పిందే తడవుగా వెంకటేశ్వరావు మాడా పాత్రకు సిద్దమయ్యాడట.

1977లో విడుదలైన చిల్లరకొట్టు చిట్టెమ్మ సూపర్ హిట్ కొట్టింది. ఆ సినిమా విజయంలో మాడా పాత్ర కీలకమైంది. అప్పట్లో మాడా పాత్ర చేసిన వెంకటేశ్వరరావు గురించి పరిశ్రమలో చర్చ నడిచింది. మాడా పాత్రలో వెంకటేశ్వరరావు చెప్పిన కొన్ని డైలాగ్స్ చాలా కాలం జనాల నోళ్ళలో నానాయి. అప్పటి నుండి నపుంసకుడు పాత్ర అంటే వెంకటేశ్వరరావునే సంప్రదించేవారు.

చిల్లర కొట్టు చిట్టెమ్మలో ఫేమస్ రోల్ మాడా చేసిన వెంకటేశ్వరావు కాస్తా… మాడా వెంకటేశ్వరావు అయ్యారు. అది ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. మాయదారి మల్లిగాడు, ముత్యాల ముగ్గు, సఖియా, శివయ్య చిత్రాల్లో మాడా చేసిన పాత్రలు అద్భుతంగా ఉంటాయి. మాడా కరుడుగట్టిన విలన్ రోల్స్ సైతం రక్తికట్టించారు.

కాలక్రమేణా మాడాను పట్టించుకునే దర్శక నిర్మాతలు కరువయ్యారు. పాత తరం దర్శకులు కనుమరుగు కావడంతో ఆయనకు ఆఫర్స్ తగ్గాయి. 2004లో వచ్చిన సఖియా ఆయన చివరి చిత్రం. 2015 అక్టోబర్ 24న మాడా హైదరాబాద్ లోని తన నివాసంలో కన్నుమూశారు.