https://oktelugu.com/

India Vs Bangladesh T20: భారత్ జోరు మీదున్నా.. ఆ విషయంలో ఆటగాళ్లు మారాల్సిందే.. బంగ్లాతో నేడు ఢిల్లీలో రెండో టీ – 20 మ్యాచ్

మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ లో బంగ్లాదేశ్ పై భారత్ బోణి కొట్టింది.. గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టి20 లో అద్భుత విజయం సాధించింది. ఇదే ఊపులో రెండో టి20 లోనూ గెలిచి సిరీస్ దక్కించుకోవాలని భావిస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 9, 2024 9:58 am
    India Vs Bangladesh T20

    India Vs Bangladesh T20

    Follow us on

    India Vs Bangladesh T20: రెండవ టీ – 20 మ్యాచ్ బుధవారం ఢిల్లీ వేదికగా రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో భారత జట్టు సులువుగా విజయం సాధించింది. రెండవ మ్యాచ్ లోను అదే స్థాయిలో ప్రదర్శన చూపి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ దక్కించుకోవాలని భావిస్తోంది..గిల్, బుమ్రా, అక్షర్ పటేల్, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లు లేకపోయినప్పటికీ.. బంగ్లాదేశ్ తో టీమ్ ఇండియా తొలి మ్యాచ్ లో సులభంగానే విజయం సాధించింది.. అయితే ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలి మార్చుకోవాల్సి ఉంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ తొలి టి20 ఏడు బంతుల్లో 16 పరుగులు చేశాడు. అంతలోనే రనౌట్ అయ్యాడు. సంజు కూడా దూకుడుగా ఆడినప్పటికీ.. దానిని భారీ స్కోర్ లాగా మలచలేకపోయాడు.. నిర్లక్ష్యపు షాట్ ఆడి అనవసరంగా ఔటయ్యాడు. వీరిద్దరూ కనుక మరింత మెరుగ్గా ఆడి ఉంటే భారత్ తొలి టీ20 లో ఇంకా తక్కువ ఓవర్లలోనే బంగ్లాదేశ్ ను మట్టి కరిపించేది.. సాధారణంగా ఓపెనర్లు మెరుగ్గా ఆడితే.. తర్వాత వచ్చే ఆటగాళ్లపై ఒత్తిడి ఉండదు.. ఇదే సూత్రాన్ని రెండవ టి20 లో అభిషేక్, సంజు పాటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. రెండవ టి20లో తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. యువ పేస్ బౌలర్ మాయాంక్ యాదవ్ తొలి టి20 మ్యాచ్ లో సత్తా చాటాడు. రెండో టి20 లోనూ అతడు అదే తీరుగా బౌలింగ్ వేస్తే బంగ్లా జట్టుకు ఇబ్బందులు తప్పవు.

    తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తొలి మ్యాచ్లో రెండు ఓవర్లు వేసి.. పర్వాలేదనిపించాడు. బ్యాటింగ్ కు దిగి 16 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ప్రస్తుతం జట్టులో స్థానం కోసం విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో.. తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే నితీష్ రెడ్డి మరింత మెరుగైన ఆట తీరు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్ లో మాదిరిగా రెండవ మ్యాచ్ లోనూ మెరుగైన ఇన్నింగ్స్ ఆడితే భారత జట్టుకు ఇక తిరిగి ఉండదు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత జట్టులోకి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వచ్చాడు తన మ్యాజిక్ బాల్స్ తో అదరగొట్టాడు. ఏకంగా మూడు వికెట్లు సాధించి సత్తా చాటాడు. రెండో టి20 లోనూ అదే స్థాయిలో అతడు తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శిస్తే భారత జట్టుకు తిరిగి ఉండదు. గెలుపు నల్లేరు మీద నడికే అవుతుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ మ్యాచ్ ఆడేందుకు ఇప్పటికే భారత జట్టు మంగళవారం ఢిల్లీ చేరుకుంది. ఆటగాళ్లు ముమ్మరంగా సాధన చేశారు.. మరోవైపు బంగ్లా జట్టు ఈ మ్యాచ్లో గెలిచి ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తుంది. అయితే ఉపఖండ మైదానాలపై ఆ జట్టు ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా భారత బౌలర్ల ముందు చేతులెత్తేస్తున్నారు. తొలి మ్యాచ్లో అదే జరిగింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ కు బంగ్లా ఆటగాళ్లు దాసోహం అయ్యారు. అర్ష్ దీప్ సింగ్ కీలకమైన సమయంలో అద్భుతమైన బంతులు వేయడంతో బంగ్లా బ్యాటర్లు తట్టుకోలేకపోయారు.. అతడు ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడంటే.. బంగ్లా బ్యాటర్ల బ్యాటింగ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

    రెండో టి20 లో భారత బౌలర్లను ఎదుర్కోవాలంటే బంగ్లా బ్యాటర్లు గట్టిగా నిలబడాలి.. బంగ్లా వెటర్న ఆటగాడు మహమ్మదుల్లాకు టి20 ఫార్మాట్లో ఇదే చివరి సిరీస్. దీంతో అతనికి ఘనంగా వీడ్కోలు పలకాలంటే ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలవాల్సి ఉంది. అరుణ్ జెట్లీ మైదానంలో భారత జట్టుపై ఏకైక టీ20 విజయాన్ని బంగ్లా జట్టు దక్కించుకుంది. అదే ఊపులో మరోసారి విజయం సాధించాలని బంగ్లాదేశ్ టెస్ట్ భావిస్తోంది. బంగ్లా జట్టులో మిరాజ్, షాంటో మాత్రమే బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నారు. లిటన్ దాస్ నుంచి బంగ్లా భారీ ఇన్నింగ్స్ ను ఆశిస్తోంది. ఇక బౌలర్లు కూడా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది.

    పిచ్ ఎలా ఉందంటే..

    అరుణ్ జెట్లీ మైదానం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది ఐపీఎల్లో ఇక్కడ ఐదు మ్యాచ్లు జరిగాయి. అన్ని మ్యాచ్ ల్లోనూ 200+ స్కోర్లు నమోదయ్యాయి.

    జట్ల అంచనా ఇలా

    భారత్: సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్, సంజు శాంసన్, నితీష్ కుమార్, రియాన్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్, మయాంక్ యాదవ్.

    బంగ్లాదేశ్: లిటన్ దాస్, పర్వేజ్ హొస్సేన్, షాంటో(కెప్టెన్), తౌహీద్, మహమ్మద్ ఉల్లా, జఖీర్ అలీ, మిరాజ్, రిషాద్, తన్జీమ్ హసన్, ముస్తాఫిజుర్, తస్కిన్, షోరి ఫుల్.