Pushpa 2: పుష్ప 2 విడుదలై దాదాపు మూడు నెలలు కావస్తుంది. ఏదో ఒక విధంగా ఈ మూవీ వార్తల్లో నిలుస్తుంది. 2024కి గాను పుష్ప 2 అతిపెద్ద హిట్. ఇండియన్ బాక్సాఫీస్ ని ఈ మూవీ షేక్ చేసింది. ఒక్క హిందీ వెర్షన్ మాత్రమే రూ. 800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ రూ. 1800 కోట్లకు మించి పుష్ప 2 వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దేశంలోనే అతిపెద్ద స్టార్ గా అల్లు అర్జున్ ఎదిగారు. నార్త్ లో అల్లు అర్జున్ పాపులారిటీ చూసి ఇండస్ట్రీ జనాలు షాక్ అయ్యారు.
పుష్ప 2 ఎంత పెద్ద విజయం సాధించిందో అదే స్థాయిలో వివాదాలు రాజేసింది. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుని ఒక మహిళ మృతి చెందింది. అల్లు అర్జున్ అండ్ టీం సరైన అనుమతులు లేకుండా పుష్ప 2 ప్రదర్శిస్తున్న సంధ్య థియేటర్ ని సందర్శించడమే ఇందుకు కారణం అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ తెలంగాణాలో రాజకీయ దుమారం రేపింది.
అల్లు అర్జున్ తో పాటు ఇండస్ట్రీ ప్రముఖులపై ఫైర్ అయిన సీఎం రేవంత్ రెడ్డి.. బెనిఫిట్ షోలు, టికెట్స్ పెంపుకు ఇకపై అనుమతులు ఉండవు అని అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి నిర్ణయానికి అల్లు అర్జున్ తీరే కారణం అంటూ కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఒక స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పుష్ప 2 మూవీని ఉద్దేశిస్తూ కీలక కామెంట్స్ చేశారు.
యూసుఫ్ గూడ హైస్కూల్ హెడ్ మిస్ట్రెస్ మాట్లాడుతూ.. అసలు పుష్ప వంటి చిత్రాల విడుదలకు ప్రభుత్వాలు ఎలా అనుమతులు ఇస్తున్నాయి? సెన్సార్ బోర్డు సభ్యులు ఎలా సర్టిఫికెట్స్ జారీ చేస్తున్నారు?. సగం మంది స్కూల్ విద్యార్థులు పుష్ప మూవీ చూసి పాడైపోయారు. వాళ్ళ మాట తీరు, హెయిర్ స్టైల్, ప్రవర్తన పుష్ప 2 వంటి చిత్రాల వలన మారిపోయాయి, అన్నారు. హెడ్ మిస్ట్రెస్ కామెంట్స్ చర్చకు దారి తీశాయి. అయితే సినిమాను సినిమాలానే చూడాలి. సినిమాలో మంచి చెడు రెండూ ఉంటాయి. చెడును వదిలేసి మంచిని తీసుకోవాలని.. కొందరు అభిప్రాయపడుతున్నారు.