Pawan and Puri Jagannadh: పవర్ స్టార్ అనే పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. అది ఫ్యాన్స్ తోపాటు చాలా మంది డైరెక్టర్లకూ ఇష్టం. పవన్ తో ఒక్క సినిమా అయినా చేయాలని ఎదురు చూస్తున్న దర్శకుల జాబితా.. ఇండస్ట్రీలో పెద్దదే ఉంది. అయితే.. ఒకే దర్శకుడు పవన్ కోసం ఏకంగా ఐదు కథలు రాసుకున్నాడు. కానీ.. రెండు మాత్రమే పట్టాలెక్కాయి. ఆ దర్శకుడు మరెవరో కాదు.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) .
పవన్ (Pawan Kalyan) సినిమా అవకాశం ఇవ్వడంతో.. ‘బద్రి’ని సెల్యులాయిడ్ పై చెక్కిన పూరీ.. బంపర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం చూసినవాళ్లు వీడెవడో కాస్త తేడాగా ఉన్నాడే అని అనుకున్నారు. మామూలు తేడా కాదు.. చాలా తేడా అని వెంట వెంటనే నిరూపించుకున్నాడు పూరీ. ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి వంటి చిత్రాలతో ఇండస్ట్రీని షేక్ చేశాడు.
అయితే.. ఈ మూడు చిత్రాలు కూడా పవన్ హీరోగా రావాల్సినవే. కానీ.. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో.. రవితేజ, మహేష్ బాబు వద్దకు వెళ్లిపోయాయి. సీన్ కట్ చేస్తే.. బంపర్ హిట్, ఇండస్ట్రీ హిట్లు ఖాతాలో పడ్డాయి. ఇడియట్ కథను పవన్ కు వినిపించినంత సేపు ఎంజాయ్ చేశారట పవన్. దీంతో.. సినిమా ఓకే అయినట్టే అనుకున్నాడట పూరీ. కానీ.. తర్వాత ఏమైందోగానీ పవన్ నుంచి ఆమోదం లభించలేదు.
ఇడియట్ సినిమా రవితేజ కెరీర్ ను ఎలా మలుపు తిప్పిందో అందరికీ తెలిసిందే. స్టార్ హీరోగా మార్చేసింది. ఆ తర్వాత అమ్మానాన్న ఓ తమిళమ్మాయి కూడా పవన్ కోసమే సిద్ధం చేశాడట పూరీ. అయితే.. అప్పటికే బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తమ్ముడు చేసి ఉన్నాడు పవన్. ఆ కారణంగా ఈ సినిమాను ఓకే చేయలేదు. దీంతో.. మళ్లీ రవితేజ వద్దకే ఈ చిత్రం వెళ్లడం.. సూపర్ హిట్ కొట్టడం జరిగిపోయాయి.
ఇక, మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన పోకిరి కూడా పవన్ కోసమే రెడీ చేశాడు పూరీ. ఈ చిత్రం ప్రిన్స్ ను సూపర్ స్టార్ ను చేసిపారేసింది. ఇండస్ట్రీలో అగ్రహీరోల జాబితాలోకి చేర్చేసింది. ఈ విధంగా మూడు సూపర్ హిట్ చిత్రాలను మిస్ చేసుకున్నాడు పవన్. నిజంగా.. ఈ మూడు చిత్రాలు పవర్ స్టార్ చేసి ఉంటే ఎలా ఉండేది?