Ibomma: సినిమా రంగం గురించి అందులో జరిగే పైరసీ గురించి చర్చ జరిగినప్పుడు రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తాయి. కొంతమంది సినిమా రంగం పైరసీ వల్ల ఇబ్బంది పడుతోందని వ్యాఖ్యలు చేస్తుంటారు. ఫలితంగా వేలాది మంది శ్రమ వృధా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. మరి కొంతమందేమో సినిమా అనేది సామాన్యుడికి అందకుండా పోయిందని.. టికెట్ల ధరలు విపరీతంగా పెంచారని.. అలాంటప్పుడు పైరసీ చేయడం న్యాయమైనదని చెబుతుంటారు.
చాకచక్యమైన ఆపరేషన్
తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమ అతిపెద్ద పైరసీ భూతం నుంచి తెలంగాణ పోలీసుల చాకచక్యమైన ఆపరేషన్ వల్ల రక్షణ పొందింది. కొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఐ బొమ్మ వల్ల నరకం చూస్తోంది. కొత్త సినిమాలు ఐ బొమ్మ సైట్లో కనిపించేవి. ఈ సైట్ నిర్వాహకుడు రవి హ్యాకింగ్ ద్వారా సినిమాలను డౌన్లోడ్ చేసి తన సైట్లో అందుబాటులో ఉంచేవాడు. దీనివల్ల సినిమాలు చూసేవాళ్ళు థియేటర్ దాకా వెళ్లేవారు కాదు. ఓటీటీ లను కూడా పట్టించుకునే వారు కాదు. తద్వారా నిర్మాతలకు విపరీతంగా నష్టం వచ్చేది. కొంతకాలంగా ఐ బొమ్మ ఆగడాలు పెరిగిపోయిన నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఐ బొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేశారు. అతని వెబ్సైట్ కార్యకలాపాలను శాశ్వతంగా నిలుపుదల చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఐ బొమ్మ చరిత్ర ముగిసిన తర్వాత.. పైరసీకి అడ్డుకట్ట పడినట్టేనా.. ఇక కొత్తగా ఎటువంటి వెబ్సైట్లు రావా.. ఐ బొమ్మ నిర్వాహకుడు రవిని మన చట్టాలు ఎన్ని రోజులపాటు జైల్లో ఉంచుతాయి.. నిజంగా అతడు జీవితాంతం జైల్లో ఉండే అవకాశం ఉంటుందా.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు చర్చకు దారి తీస్తున్నాయి.
కొత్త వెబ్సైట్లు..
వాస్తవానికి ఇంటర్నెట్లో ఐ బొమ్మ మాత్రమే కాదు.. చాలా వెబ్సైట్లు కొత్త సినిమాలను అందుబాటులో వస్తున్నాయి. మూవీ రూల్స్, తమిళ్ రాకర్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఐ బొమ్మలో హెచ్డి క్వాలిటీ సినిమాలు ఉంటాయి కాబట్టే ఈ సైట్ కు అంత పాపులారిటీ వచ్చింది. పైగా ఈ సైట్లో ఎప్పటికీ కొత్త సినిమాలు కనిపించేవి.. అందువల్లే ఈ సైట్ కి విపరీతమైన ఆదరణ ఉండేది. వాస్తవానికి ఐ బొమ్మ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత కొత్త సైట్లు రావని చెప్పడానికి లేదు. ఎందుకంటే హ్యాకింగ్ చేయడం ద్వారా సినిమాలను డౌన్లోడ్ చేసి సైట్లో పెట్టుకోవచ్చని రవి నిరూపించాడు..