Nitish Kumar: చాలామంది అతడిని అవకాశవాది అని పిలుస్తుంటారు. ఇంకొంతమందేమో వారసత్వంలేని నికార్సైన నాయకుడు అంటారు . ఇంకా కొంతమందేమో అవినీతి లేని విలక్షణ నాయకుడు అని కీర్తిస్తుంటారు. ఇలా ఎవరికివారు తమకు నచ్చిన మాటలు.. తాము మెచ్చిన మాటలు అనేస్తుంటారు. ఇవన్నీ వినిపించినప్పటికీ నితీష్ నిశ్శబ్దంగానే ఉంటారు. ఎందుకంటే ఆయన మామూలు నాయకుడు కాదు. తన రాజకీయ జీవితాన్ని విభిన్నంగా మొదలు పెట్టి విభిన్నదారులోనే వెళ్తున్న నాయకుడు అతడు.
ప్రత్యర్థులు హేళన చేశారు
నితీష్ కుమార్ తన ప్రారంభ రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే పదవిని కోల్పోయారు. దీంతో ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయిందని ప్రత్యర్ధులు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వారం రోజుల్లోనే ముఖ్యమంత్రి స్థానం నుంచి దిగిపోయాడని హేళన చేశారు. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని నితీష్ కుమార్ ఆ తర్వాత తన అసలు కథను మొదలుపెట్టారు. తనకు ఇబ్బందిగా ఉన్న ప్రత్యర్థులకు అనేక సందర్భాలలో గట్టి సమాధానాలు చెప్పారు. అంతేకాదు రాజకీయంగా కూడా వారికి అసలు సినిమా చూపించారు. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా దూకుడు కొనసాగించారు. అవినీతి లేకుండా.. వారసత్వం కనబడకుండా పరిపాలన సాగించారు.
19 సంవత్సరాలుగా..
2000 సంవత్సరంలో తొలిసారిగా ముఖ్యమంత్రి పదవిని నితీష్ కుమార్ చేపట్టారు. ఏడు రోజులు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. సరిగ్గా ఐదు సంవత్సరాల తర్వాత మళ్లీ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.. దాదాపు ముఖ్యమంత్రిగా 19 సంవత్సరాల పాటు బీహార్ రాష్ట్రాన్ని ఆయన పరిపాలించారు. రాజకీయంగా ఏర్పడిన పరిస్థితులు, ఇతర పరిణామాల నేపథ్యంలో ఆయన 9సార్లు ప్రమాణం చేశారు. 2005 నుంచి మే 2014, ఫిబ్రవరి 2015 మధ్య మినహా మిగిలిన కాలం మొత్తం ఆయన సీఎం సీటులోనే ఉన్నారు.
పాట్నాలో ప్రమాణ స్వీకారం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 202 స్థానాలను సాధించింది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ నవంబర్ 20న పాట్నా లో ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన వినూత్నంగా ప్రసంగించారు. “ఎన్డీఏ కూటమిని అధికారం నుంచి దూరం చేయడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే వారంతా ఏమవుతారు? ఎటు వెళ్తారు? అనేది త్వరలోనే నిర్ణయం అవుతుందని” నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలకు తగ్గట్టుగానే ఆయన బీహార్లో కనివిని ఎరుగని స్థాయిలో డబుల్ సెంచరీ సీట్లను సాధించారు. అంతేకాదు బీహార్ ప్రజల గుండెల్లో తనకు ఎప్పటికీ స్థిరస్థానమేనని రుజువు చేశారు.