Allu Arjun: సంధ్య థియేటర్ లో డిసెంబర్ 4న చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో వివాహిత రేవతి కన్నుమూసింది. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అపస్మారక స్థితికి వెళ్ళాడు. బాలుడికి ప్రస్తుతం చికిత్స జరుగుతుంది. రేవతి మృతి దురదృష్టకరం. ఒక ఫ్యామిలీకి తీరని నష్టం జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రమాదానికి కారణమైన వారికి శిక్షపడాల్సిందే. అయితే అల్లు అర్జున్ ని పూర్తిగా బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసం?
అల్లు అర్జున్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది అనుకున్నప్పటికీ నేరుగా ఈ నేరాన్ని ఆయనకు అంటగట్టడం సరికాదు. ఇది ఎవరూ కావాలని చేసింది కాదు. సామర్థ్యానికి మించి సంధ్య థియేటర్లోకి అభిమానులు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ11 గా ఉన్నారు. ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. అల్లు అర్జున్ చేసింది తప్పా ఒప్పా అనేది న్యాయస్థానం తేల్చుతుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం తప్పు.
చివరికి ఇండస్ట్రీ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ ని టార్గెట్ చేయడం దారుణం. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇకపై తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ షోలకు అనుమతులు ఇచ్చేది లేదు. టికెట్స్ ధరల పెంపు ఉండదని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో పరిశ్రమ కంగుతింది. ఎఫ్ డీ సీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో పరిశ్రమ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీలో చేసిన ప్రకటనకే కట్టుబడి ఉన్నానన్న రేవంత్ రెడ్డి… టికెట్స్ ధరల పెంపు, స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వబోము అన్నారు.
మీటింగ్ లో మరిన్ని ఆంక్షలు తెరపైకి తెచ్చిన రేవంత్ రెడ్డి, భారీ షాక్ ఇచ్చాడు. అల్లు అర్జున్ వలనే ఈ సమస్యలు. ఒక్కడి వలన పరిశ్రమ మొత్తం సీఎం ఎదుట చేతులు కట్టుకుని నిల్చోవాల్సి వచ్చిందంటూ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆరోపించారు. అణిగిమణిగి ఉండాలి, ఎగిరి పడితే ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ప్రొడ్యూసర్ సురేష్ బాబు సైతం అల్లు అర్జున్ పై అసహనం వ్యక్తం చేశారని సమాచారం.
కాగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్నారు. అందులోనూ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఏకైక, మొదటి టాలీవుడ్ హీరో అల్లు అర్జున్. ఇది గొప్ప అచీవ్మెంట్. నేషనల్ అవార్డు గెలిచిన అల్లు అర్జున్ కి పరిశ్రమ సన్మానం చేయాలి. కనీసం ఆయన విజయాన్ని కొనియాడుతూ ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టినా చాలు. ఇండస్ట్రీ అల్లు అర్జున్ ని విస్మరించింది. దాంతో అల్లు అర్జున్ స్వయంగా ఒక వేదిక ఏర్పాటు చేసి, ప్రముఖులకు పార్టీ ఇచ్చాడు. అల్లు అర్జున్ పరిశ్రమ గౌరవాన్ని పెంచే విజయాలు సాధించినప్పుడు పొగడని పెద్దలు.. పొరపాట్లను ఎత్తి చూపుతూ విమర్శల దాడి చేయడం సరికాదనే వాదన గట్టిగా వినిపిస్తోంది.