Prabhas Adipurush: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం. హీరో ప్రభాస్ పరిస్థితి అలానే ఉంది. బాహుబలి లాంటి చిత్రం తర్వాత ఆయన నటించే చిత్రాలపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రభాస్ కి తెలియనిది కాదు. అనుభవం లేని దర్శకులకు అవకాశాలు ఇచ్చి ప్రభాస్ దెబ్బై పోతున్నారు. సాహోతో సుజీత్ కొంత పర్లేదు అనిపించాడు. రాధాకృష్ణ మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. రాధే శ్యామ్ ప్రభాస్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆదిపురుష్ కూడా ప్రభాస్ తప్పుడు ఎంపికే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రామాయణం వంటి ఎపిక్ ని డీల్ చేసే సత్తా ఓం రౌత్ కి లేదన్న మాట గట్టిగా వినిపిస్తోంది.

ఆదిపురుష్ టీజర్ తో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. చిత్ర టీజర్ కార్టూన్ మూవీని తలపించగా అభిమానులు, చిత్ర వర్గాలు షాక్ తిన్నారు. రూ. 400 కోట్ల బడ్జెట్ తో ఓం రౌత్ తీసిన సినిమా ఇదా అంటూ పెదవి విరుస్తున్నారు. దానికి తోడు పురాణ పాత్రలైన రావణాసురుడు, హనుమంతుడు లుక్స్ తప్పుగా చూపించి విమర్శల పాలయ్యారు. హిందూ వర్గాలు దీన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. ఆదిపురుష్ విడుదల ఆపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశాయి.
దీంతో రిపేర్లు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. సంక్రాంతి కి విడుదల కావాల్సిన ఆదిపురుష్ వాయిదా అంటూ వార్తలు వస్తున్నాయి. మేకర్స్ అధికారిక ప్రకటన చేయకున్నప్పటికీ… విశ్వసనీయవర్గాల సమాచారం అందుతుంది. జనవరి 12న విడుదల కావాల్సిన ఆదిపురుష్ ఏకంగా ఆరు నెలలు వెనక్కి వెళ్లిందట. మరో వంద కోట్లు కేటాయించి మెరుగ్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారట. ఈ వార్తలు ఆదిపురుష్ పై అంచనాలు తగ్గించేశాయి. ప్రభాస్ కి మరో ప్లాప్ పడనుందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ఎందుకంటే రిపేర్లు ఏ సినిమాకైనా కలిసిరావు. దానికి ఆచార్య రిజల్టే నిదర్శనం. కొరటాల శివ అనుకున్న స్క్రిప్ట్ కి అనేక మార్పులు చేశాడు. చిరంజీవి పక్కన హీరోయిన్ గా కొన్ని సన్నివేశాల్లో నటించిన కాజల్ పాత్ర తీసేశారు. ఇలా ఆచార్య రిపేర్స్ కి బలమైంది. అదే పని ఇప్పుడు ఓం రౌత్ చేస్తున్నాడు. ఆల్రెడీ షూట్ చేసి ప్రీప్రొడక్షన్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిన చిత్రానికి అదనంగా దిద్దే మెరుగులు ఎలాంటి ఆకర్షణ తేలేవు. పైగా మరింత డామేజ్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆదిపురుష్ పై అంచనాలు పెంచుకోకపోతేనే బెటర్.