Keerthy Suresh’s wedding : సౌత్ ఇండియా లో అందంతో పాటు అద్భుతమైన నటన ఉన్న హీరోయిన్లు చాలా తక్కువమంది మాత్రమే ఉన్నారు. ఆ తక్కువమందిలో ఒకరు కీర్తి సురేష్. మలయాళం లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈమె, తెలుగు లో ‘నేను శైలజ’ చిత్రం ద్వారా మన ఆడియన్స్ కి పరిచయమైంది. తొలిసినిమానే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈమెకు అవకాశాలు క్యూలు కట్టాయి. అలా టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమయంలో, ఆమె చేసిన ‘మహానటి’ చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. కేవలం కమర్షియల్ గా మాత్రమే కాకుండా, ఈ సినిమా నటిగా కూడా కీర్తి సురేష్ కి నేషనల్ అవార్డుని తెచ్చిపెట్టింది. ఒక సినిమాతో నేషనల్ వైడ్ ఈమె పేరు మారుమోగిపోయింది. ప్రస్తుతం ఆమె హిందీ లో ‘బేబీ జాన్’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదే ఆమెకు బాలీవుడ్ లో మొట్టమొదటి సినిమా.
ఇదంతా పక్కన పెడితే కీర్తి సురేష్ అతి త్వరలోనే తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ ని పెళ్లాడబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా కాలం నుండి కీర్తి సురేష్ పై ఇండస్ట్రీ లో ఉన్న పలువురి సెలబ్రిటీస్ తో లింకులు పెట్టి, వీరిని పెళ్లి చేసుకోబోతుంది అంటూ పుకార్లు పుట్టించారు. సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో అవి వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ తో ఈమె ప్రేమాయణం నడుపుతుందని, త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రచారం చేసారు. ఈ తప్పుడు ప్రచారాలకు ఫులుస్టాప్ పెడుతూ, రీసెంట్ గానే కీర్తి సురేష్ తండ్రి ఆమె పెళ్లి చేసుకోబోయే వరుడి వివరాలను అధికారికంగా తెలియచేసాడు. దీంతో ఈ ప్రచారాలకు ఫులుస్టాప్ పడింది. అయితే కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఆంటోనీ క్రిస్టియన్ మతానికి చెందిన వాడు.
దీంతో హిందువు అయినటువంటి కీర్తి సురేష్, తన మతాన్ని మార్చుకోవడానికి సిద్ధమైందని, త్వరలోనే ఆమె క్రిస్టియన్ గా మారబోతుందని, ఇలా పలు రకాల వార్తలు వినిపించాయి. దీనిని కీర్తి సురేష్ తండ్రి తీవ్రంగా ఖండించాడు. తమకి ఎలాంటి మత పరమైన అవధులు లేవని, ఇరు మతాలను గౌరవిస్తూనే వాళ్లద్దరి పెళ్లి చేస్తామని చెప్పుకొచ్చాడు. ఈ నెల 12 వ తేదీన ఉదయం 10 గంటలకు కీర్తి సురేష్ పెళ్లి హిందూ మత సాంప్రదాయంలో చేయబోతున్నారు. అదే రోజు సాయంత్రం ఒక చర్చిలో క్రిస్టియన్ మత సాంప్రదాయంలో పెళ్లి చేయబోతున్నారు. ఇలా ఒకే రోజు రెండు విభిన్నమైన సంప్రదాయాల్లో పెళ్లి చేసుకోబోతున్న ఏకైక సెలబ్రిటీ గా కీర్తి సురేష్ నిలవబోతుంది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ వివాహ మహోత్సవానికి ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులందరూ హాజరు కాబోతున్నారు.