
Tollywood Stars: మహేష్ బాబు మంచి బిజినెస్ మెన్. ఏ హీరో ఊహకి అందని సమయంలోనే హైదరాబాద్ లో ‘ఏ.ఎమ్.బి’ అనే భారీ మల్టీ ఫ్లెక్స్ కట్టించాడు. ఇప్పుడు భాగ్యనగరంలో ‘ఏ.ఎమ్.బి’ మాల్ ఓ ఐకానిక్ థియేటర్ గా మారిపోయింది. కరోనా సమయంలో కూడా సమర్థవంతంగా తట్టుకొని నిలబడింది. ఇక ‘ఏ.ఎమ్.బి’ తరువాత అమీర్ పేట లోని ‘ఓల్డ్ సత్యం’ థియేటర్ కూడా ఆ స్థాయి మల్టీ ఫ్లెక్స్ గా ముస్తాబు అవుతుంది.
అయితే, తాజాగా ఈ రెండిటినీ మించి మరో క్రేజీ మల్టీ ఫ్లెక్స్ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధం అయింది. పైగా ఈ మల్టీ ఫ్లెక్స్ కోసం ముగ్గురు హీరోలు పాలు పంచుకున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ స్థలంలో మహేష్ తో పాటు రానా, వెంకటేష్ ఓ భారీ మల్టీ ఫ్లెక్స్ మాల్ నిర్మాణానికి రెడీ అయ్యారు. దీని పేరు ‘ఎ.ఎమ్.బి విక్టరీ’.
ఈ ముగ్గురు హీరోలతో కలిసి ఆసియన్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్ కూడా ఓ భాగస్వామి. నారాయణ్ దాస్ అందరి హీరోలతో ఇలాంటి వెంచర్లను ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తో కూడా గుంటూరులో ఇలాంటి మాల్ కట్టించే ప్రపోజల్ ఒకటి ఉంది. అలాగే విజయవాడలో నాగార్జునతో కూడా ఇలాంటి క్రేజీ మల్టీ ఫ్లెక్స్ కట్టడానికి రెడీ అవుతున్నారు.
నిజానికి థియేటర్ బిజినెస్ ఈ మధ్య బాగా నష్టాల్లో ఉంది. డెబ్భై ఏళ్ల సినిమా చరిత్రలో ఎప్పుడూ థియేటర్లు ఇంతగా నష్టాలు చవిచూడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో హీరోలు థియేటర్ బిజినెస్ లోకి రావడం విశేషమే. ఒకపక్క దిల్ రాజు లాంటి అగ్రనిర్మాత ఇప్పటికే తన చేతిలోని థియేటర్లను మెయింటైన్ చెయ్యలేక వాటిని వదిలించుకునే ఆలోచనలో ఉన్నాడు.
ఇన్నేళ్లు అగ్ర నిర్మాతగా ఈ తరం సినీ నిర్మాణ విభాగానికి ప్రతినిధిగా నిలుస్తూ వస్తున్న దిల్ రాజుకు థియేటర్ బిజినెస్ లో అపారమైన అనుభవం ఉంది. పైగా తన నిర్మాణ సంస్థే ఒక చిన్న సినీ పరిశ్రమ అన్న స్థాయిలో దిల్ రాజు ఓ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నాడు.
మరి అలాంటి దిల్ రాజే థియేటర్లు కారణంగా నష్టపోతున్నాం, థియేటర్ల బిజినెస్ వేస్ట్ అని తేల్చేశాడు. మరి ఈ హీరోలు పోయి పోయి నష్టాల బిజినెస్ కోసం ఎందుకు ఉబలాట పడుతున్నారో.