Star Hero : కోలీవుడ్ టాప్ హీరోగా ఎదిగాడు విజయ్. ఏకంగా రజినీకాంత్ కి పోటీ ఇచ్చే రేంజ్ లో ఉన్నాడు. విజయ్ సినిమాలు జయాపజయాలతో సంబంధం లేకుండా వందల కోట్లు కొల్లగొడతాయి. విజయ్ ఇటీవల నటించిన చిత్రాలన్నీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాయి. వసూళ్ళు మాత్రం కుమ్మేశాయి. బిగిల్, మాస్టర్, వారసుడు, లియో ఇవన్నీ ఓ మోస్తరుగా ఉన్నాయని రివ్యూవర్స్ తేల్చారు. అయినప్పటికీ ప్రతి చిత్రం రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన లియో పూర్తి స్థాయిలో మెప్పించలేదు. ఈ చిత్రానికి నెగిటివ్ రివ్యూలు పడ్డాయి. అయినప్పటికీ ఇండియాలో లియో రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. రన్ ముగిసే నాటికి వరల్డ్ వైడ్ రూ. 550 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. విజయ్ రేంజ్ అది. కాగా లియో చిత్రానికి నిర్మాతలు విజయ్ కి రూ. 120 కోట్లు చెల్లించారని టాక్. కొన్నాళ్లుగా ఆయన సినిమాకు రూ. 100 కోట్లు తగ్గకుండా ఆర్జిస్తున్నారు.
ఒక అంచనా ప్రకారం విజయ్ ఆస్తుల విలువ రూ. 474 కోట్లు. ఆయనకు ఖరీదైన బంగ్లాలు, ఫార్మ్ హౌసులు, లగ్జరీ కార్లు ఉన్నాయి. పలు వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెట్టారట. మరి ఇంత సంపద, సంపాదన ఉన్న విజయ్ ఇష్టపడి కొనుక్కున్న కారు అమ్ముకోవడం ఏమిటనే సందేహం రావొచ్చు. విజయ్ 2012లో రోల్స్ రాయిస్ కొన్నారు. అతికొద్ది మంది హీరోల వద్ద మాత్రమే రోల్స్ రాయిస్ ఉంటుంది. విజయ్ ఈ కారు విషయంలో కొన్ని లీగల్ ట్రబుల్స్ కూడా ఎదుర్కొన్నాడు.
కాగా ఈ కారును విజయ్ అమ్మకానికి పెట్టినట్లు ఎంపైర్ ఆటోస్ కార్ డీలర్ షిప్ అనే సంస్థ ప్రకటించింది. విజయ్ రోల్స్ రాయిస్ కారును రూ. 2.6 కోట్లకు బేరం పెట్టాడట. దీనికి కారణం ఆయన రాజకీయ ప్రవేశమే అంటున్నారు. నిధుల సమీకరణలో భాగంగా విజయ్ రోల్స్ రాయిస్ కారును అమ్మేయాలని డిసైడ్ అయ్యాడట. విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.
విజయ్ పార్టీ పేరు తమిళగ వెట్రి కజగం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయలేదు. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. సీఎం సీటు లక్ష్యంగా విజయ్ రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఒక రాజకీయ పార్టీని నడపటం అంత సులభం కాదు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలి. అందుకు చాలా ఖర్చు అవుతుంది. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. విజయ్ సంసిద్ధం అవుతున్నారు.
ఇకపై సినిమాలు చేయనని కూడా విజయ్ ప్రకటించారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న గోట్ ఆయన చివరి చిత్రం కావచ్చు. ఈ చిత్రంలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ప్రశాంత్, స్నేహ, ప్రభుదేవ, వైభవ్, యోగిబాబు, లైలా, జయరాం వంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఆఫర్ అందుకుంది. గోట్ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ నెలలో వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల కానుంది…