తమిళ స్టార్ హీరో విజయ్ పై చెన్నై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆయన తీరు రాజద్రోహమేనని చెప్పింది. అంతేకాదు.. హీరో విజయ్ చేసిన పనికి దండనగా లక్ష రూపాయల ఫైన్ విధించింది. దీంతో.. తమిళనాడుతోపాటు దేశవ్యాప్తంగా విజయ్ ఇష్యూ ట్రెండింగ్ లో ఉంది. ఇంతకీ.. కోర్టు ఎందుకు అంత ఘాటు వ్యాఖ్యలు చేసింది? విజయ్ ఏం చేశారు అన్నది చూద్దాం.
కార్లలో టాప్ బ్రాండ్ గా ఉన్న.. రోల్స్ రాయిస్ మోడల్ ను విజయ్ కొనుగోలు చేశాడు. ఈ కారును 2012లో ఇంగ్లాండ్ నుంచి తెప్పించాడు. కానీ.. ఎంట్రీ ట్యాక్స్ చెల్లించలేదు. దీంతో.. ఈ కారును రిజిస్ట్రేషన్ చేసేందుకు రవాణా శాఖ అధికారులు అంగీకరించలేదు. దీంతో.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కారు రిజిస్టర్ కాలేదు. విజయ్ కూడా ట్యాక్ చెల్లించలేదు.
ఈ క్రమంలో.. వాణిజ్య పన్నుల విభాగం అధికారి ఈ రోల్స్ రాయిస్ కారుకు సంబంధించిన ఎంట్రీ ట్యాక్స్ వెంటనే కట్టాలని నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసును సవాల్ చేస్తూ.. హీరో విజయ్ తమిళనాడు హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన న్యాయస్థానం.. కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ప్రముఖులుగా ఉన్న వారు సరిగా ట్యాక్సులు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది.
సెలబ్రిటీలుగా ఉన్నవారు దేశానికి సంపద లాంటివారని చెప్పింది. వారి సంపాదన ఆకాశంలోంచి ఊడి పడదని, అది ప్రజల కష్టార్జితం నుంచి వచ్చిందేని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇలాంటి వారు చెల్లించే పన్నులు ఆర్థిక వ్యవస్థకు కీలకమని తెలిపింది. జనం చెల్లించే పన్నులతోనే స్కూళ్లు, హాస్పిటల్స్ లో సౌకర్యాలు సహా.. సంక్షేమ పథకాలు కొనసాగుతాయని గుర్తు చేసింది.
ఇంకా కొనసాగిస్తూ.. సినీ నటులు రియల్ హీరోలుగా ఉండాలే గానీ.. రీల్ హీరోలుగా ఉండకూడదని న్యాయస్థానం హితవు పలికింది. ఇలాంటి వారు ట్యాక్సులు ఎగవేయడం అనేది ఏ మాత్రం సరికాదని చెప్పింది. పన్ను ఎగవేత ఖచ్చితంగా రాజద్రోహమేనని తేల్చి చెప్పింది. ఈ కారుకు రెండు వారాల్లోగా ట్యాక్స్ చెల్లించాలని ఆదేశించింది. అదేవిధంగా.. ఈ ఫిర్యాదు చేసినందుకు రూ.లక్ష జరిమానా సైతం విధించి, సీఎం సహాయ నిధికి జమ చేయాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో.. ఈ విషయమై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతోంది. విజయ్ సినిమాలో అవినీతి, అక్రమాలపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు ప్రత్యర్థులు.