Hero Tarun : చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ఆరంభించిన హీరో తరుణ్ అనేక సంచలనాలు నమోదు చేశాడు. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన అంజలి చిత్రంలో నటనకు జాతీయ అవార్డు అందుకున్నాడు. పలు భాషల్లో బాల నటుడిగా సత్తా చాటాడు. 2000లో నువ్వే కావాలి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. యూత్ఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన నువ్వే కావాలి ఒక సంచలనం. పలు టాలీవుడ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసిన చిత్రం అది. తరుణ్-రిచా జంటగా నటించారు. ఒక్క సినిమాతో తరుణ్ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.
ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే చిత్ర విజయాలతో తరుణ్ కెరీర్ పీక్స్ కి చేరింది. లవర్ బాయ్ ఇమేజ్ తో ఒక స్థాయి హీరోగా నిలదొక్కుకున్నాడు. తరుణ్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. నువ్వే నువ్వే తర్వాత తరుణ్ కి క్లీన్ హిట్ లేదు. వరుస పరాజయాలతో ఎంత త్వరగా ఎదిగాడో అంతే త్వరగా పడిపోయాడు. 2014 అనంతరం తరుణ్ కి భారీ గ్యాప్ వచ్చింది. చెప్పాలంటే తరుణ్ కెరీర్ ముగిసింది.
ఒక్క హిట్ పడితే పూర్వ వైభవం వస్తుందని భావించిన తరుణ్… 2018లో ‘ఇది నా లవ్ స్టోరీ’ టైటిల్ తో ఒక చిత్రం చేశాడు. అది కనీస ఆదరణ దక్కించుకోలేదు. తరుణ్ మరలా మేకప్ వేసుకోలేదు. ఇతర హీరోల చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ కి ఆయన ఒప్పుకోలేదు. అయితే తరుణ్ కెరీర్ నాశనం కావడానికి తల్లి రోజా రమణినే కారణం అనే వాదన ఉంది. ఆమె నిర్ణయాలే తరుణ్ ని పాతాళానికి పడేశాయని కొందరు అంటారు. ఈ విమర్శల మీద తరుణ్ స్పందించారు.
తన కెరీర్ నాశనం కావడానికి తల్లి రోజా రమణి ఏ విధంగా కూడా కారణం కాదని ఆయన అన్నారు. కథలు నేను కుటుంబ సభ్యులతో చర్చించేవాడిని. అయితే ఫైనల్ డెసిషన్ నాదే. నువ్వే కావాలి సినిమా చూశాక ఆడియన్స్ నా నుండి అదే స్థాయి చిత్రాలు ఆశించారు. అందుకే వరుస పరాజయాలు ఎదురయ్యాయని తరుణ్ అన్నారు. కాగా హీరోయిన్ ఆర్తి అగర్వాల్ తో ప్రేమాయణం వంటి వివాదాలు కూడా తరుణ్ ఇమేజ్ దెబ్బ తీశాయి. అలాగే పలుమార్లు డ్రగ్స్ కేసులో తరుణ్ విచారణ ఎదుర్కొన్నాడు.