Hero Surya : సినీ ఇండస్ట్రీలో స్టార్ హోదా దక్కించుకోవడం అంత సులభం కాదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమకు వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలానే స్టార్ కిడ్స్ గా పరిశ్రమలో అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోలు ఉన్నారు. హీరో సూర్య కూడా ఆ కోవకి చెందిన వాడే. సూర్య తండ్రి శివకుమార్ ఒకప్పుడు కోలీవుడ్ స్టార్స్ లో ఒకరు.
సూర్య అందరు హీరోల కొడుకుల్లాగా వెంటనే పరిశ్రమకు రాలేదు. చదువు పూర్తయిన వెంటనే జాబ్ లో జాయిన్ అయ్యాడు. నెలకు రూ. 1200 జీతంతో పని చేశాడు. కానీ యాక్టింగ్ పట్ల ఆస్తకి ఉండటంతో మూడు నెలలకు ఉద్యోగం మానేశాడు. మంచి నటుడిగా ఎదగాలనే ఆశతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. పట్టుదల,శ్రమతో ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు. ఇప్పుడు స్టార్ హీరోగా కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుంటున్నాడు.
సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. తండ్రి శివకుమార్ 70లలో కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు. సూర్య చదువు కంప్లీట్ అవగానే ఓ గార్మెంట్ ఫ్యాక్టరీ లో ఉద్యోగానికి జాయిన్ అయ్యాడట. నెలకు రూ. 1200 జీతం తీసుకున్నాడట. చెన్నై లో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్ లో సూర్య మాట్లాడారు. తన కెరీర్ ప్రారంభ దశలో జరిగిన విషయాలు పంచుకున్నాడు.
ఉద్యోగి నుండి నటుడిగా నేను యూ టర్న్ తీసుకున్నాను. నేరరుక్కు నేర్ నా మొదటి సినిమా. ఆ మూవీ సక్సెస్ కావడంతో ప్రేక్షకులకు నేను నచ్చాను. ఆదరిస్తారని నమ్మాను. కృషి, పట్టుదలతో ఈ స్థాయికి వచ్చాను అని అన్నారు. కాగా సూర్య కి టాలీవుడ్ లో కూడా మార్కెట్ ఉంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా ఈజీగా రూ. 100 కోట్లు కలెక్ట్ చేస్తాయి. సూర్య సూరారైపోట్రు చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్నారు. డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జీఆర్ గోపినాధ్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. సూరారై పోట్రు చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహించారు.
యువ, గజినీ, ఆరు, సింగం వంటి చిత్రాలు సూర్య కి తెలుగులో కూడా ఫేమ్ తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా గజినీ తెలుగులో కూడా భారీ విజయం అందుకుంది. ఈ చిత్రంలో సూర్య వినూత్నమైన రోల్ చేశారు. మెమరీ లాస్ పేషెంట్ గా అద్భుత నటన కనబరిచాడు. సూర్య తమ్ముడు కార్తీ సైతం తెలుగులో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సూర్య నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ కంగువ ‘. ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో సూర్య రెండు గెటప్స్ లో అలరించనున్నాడు.
ఇటీవల సూర్య తన మకాం ముంబై కి మార్చాడు. తన ఇద్దరు పిల్లలతో పాటు అక్కడే ఉంటున్నారు. కెరీర్ కోసం సూర్య ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇక సూర్య కుటుంబం పేద పిల్లల కోసం ఒక స్కూల్ ని నడుపుతున్నారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.