Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. గతేడాది సలార్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలతో వరుసగా భారీ బ్లాక్ బస్టర్లు అందుకున్నారు.. భారీ కలెక్షన్లతో బాక్సాఫీసును కొల్లగొట్టేశారు. ఆ సినిమాలు ఇచ్చిన ఉత్సాహంతో ప్రస్తుతం ఫుల్ స్వింగులో ఉన్నారు డార్లింగ్. ఇలా వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లను అందుకున్న ప్రభాస్ త్వరలో రాజాసాబ్ అనే సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు ప్రభాస్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్లో రూపొందనున్న ఫౌజీ సినిమాను లైన్ లో పెట్టారు ప్రభాస్. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం డార్లింగ్ ప్రభాస్ తన కెరీర్ లో ఎన్నడూ చేయని సాహసం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా లైన్ అప్ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే. ఆయన వరుస కమిట్మెంట్లను చూస్తే కళ్లు తిరగాల్సిందే. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకు వెళ్తున్న ప్రభాస్.. ప్రస్తుతం ‘ రాజాసాబ్’ అనే హర్రర్ కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది. వాస్తవానికి ఈ సినిమా గతేడాది చివరిలోనే ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ ఈ హర్రర్ అండ్ కామెడీ ట్రైలర్ మూవీని ఏప్రిల్ సమ్మర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, వీఎఫ్ఎక్స్ సంబంధించిన సీన్లు ఎడిటింగ్ డిలే అవుతుండడంతో ఈ సినిమా అనుకున్న సమయానికి కాకుండా జూన్ ప్రారంభంలో గాని, చివర్లో గాని విడుదల చేయబోతున్నారన్న టాక్ నడుస్తుంది.
ఈ మూవీ తర్వాత.. హను రాఘవ పూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ప్రభాస్ వింటేజ్ లుక్‌తో కనిపించబోతుండడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ప్రభాస్ లైన్ అప్ లో ఇక కల్కి 2, సలార్ 2, స్పిరిట్ తో పాటు మరో రెండు సినిమాలు ఉన్నాయి. వీటన్నింటిని లైన్ లో పెట్టాలంటే.. ప్రభాస్ జెట్ స్పీడులో దూసుకుపోవాల్సిందే. లేకపోతే.. ఈ సినిమాలు తెరకెక్కడం కష్టమే అని కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో ప్రభాస్ తన కెరీర్ లో ఎవరూ ఊహించని విధంగా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో ఫౌజీ సినిమా కోసం ప్రభాస్ తెగ కష్టపడుతున్నారట. హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న పీరియాడిక్ వార్ అండ్ లవ్ స్టోరీ ‘ఫౌజీ’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లింగంపల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అక్కడ ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో 20 రోజుల పాటు షూటింగ్ జరగనుందని సినీవర్గాలు తెలిపాయి. ప్రస్తుత షెడ్యూల్ మార్చి చివరి వారం వరకూ కొనసాగనుందని వెల్లడించాయి. మైత్రీ మూవీ మేకర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారట.