https://oktelugu.com/

నేచురల్ స్టార్ నాని.. ప్రేక్షకులు నిలబెట్టిన నటుడు..!

‘వెండి తెరపై ఒక హీరో జన్మించాలంటే క‌ష్ట‌ప‌డాలా..? అదృష్టం ఉండాలా..?’ చాలా మంది ఈ రెండు ప్రశ్నల్లో ఏదో ఒకదానిని ఎంచుకుంటారు. అయితే.. కొందరు మాత్రం ఈ రెండిటికి బదులుగా ముందు ‘అవకాశం రావాలి’ అంటారు! అవును.. ఛాన్స్ వ‌స్తేనే క‌దా త‌న‌ని తాను నిరూపించుకునేది! ఆ నిరూప‌ణ నిరంత‌రం కొన‌సాగితేనే క‌దా.. అదృష్టంగా పిలుచుకునేది! హీరో నాని విషయంలో జరిగింది ఇదే. అనుకోకుండా అవకాశం వచ్చింది. తానేంటో నిరూపించుకున్నాడు. అది కంటిన్యూ చేస్తూ ‘నేచురల్ స్టార్’ […]

Written By:
  • Rocky
  • , Updated On : February 24, 2021 12:36 pm
    Follow us on

    Nani
    ‘వెండి తెరపై ఒక హీరో జన్మించాలంటే క‌ష్ట‌ప‌డాలా..? అదృష్టం ఉండాలా..?’ చాలా మంది ఈ రెండు ప్రశ్నల్లో ఏదో ఒకదానిని ఎంచుకుంటారు. అయితే.. కొందరు మాత్రం ఈ రెండిటికి బదులుగా ముందు ‘అవకాశం రావాలి’ అంటారు! అవును.. ఛాన్స్ వ‌స్తేనే క‌దా త‌న‌ని తాను నిరూపించుకునేది! ఆ నిరూప‌ణ నిరంత‌రం కొన‌సాగితేనే క‌దా.. అదృష్టంగా పిలుచుకునేది! హీరో నాని విషయంలో జరిగింది ఇదే. అనుకోకుండా అవకాశం వచ్చింది. తానేంటో నిరూపించుకున్నాడు. అది కంటిన్యూ చేస్తూ ‘నేచురల్ స్టార్’ అనే బిరుదును కూడా సొంతం చేసుకున్నాడు. ఇవాళ నాని బర్త్ డే. ఈ సందర్బంగా వెండి తెరపై జన్మించిన ఆ నేచురల్ స్టార్ ప్రస్థానాన్ని ఓ సారి పరిశీలిద్దాం..

    2008లో ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ఓ సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలోనే ఏదో పనిమీద ఓ సినిమా లొకేషన్ కు వెళ్లాడు. అక్కడ ఓ కుర్రాడు కనిపించాడు. చూడగానే బాగున్నాడే అనిపించింది. ‘నా సినిమాలో హీరోగా ఛాన్స్ ఇస్తా చేస్తావా?’ అని అడిగితే.. తాను డైరెక్ట‌ర్ కావాల‌ని వ‌చ్చానని.. సీరియ‌స్ గా క‌థ సిద్ధం చేసుకుంటున్నాన‌ని చెప్పాడు ఆ కుర్రాడు. ‘పర్లేదు.. నా సినిమాలో హీరోగా చెయ్.. ఆ తర్వాత నీ సినిమాకు డైరెక్షన్ చేసుకో’ అన్నాడు ఇంద్రగంటి. ఇదేదో బాగానే ఉందని ఓకే చెప్పేశాడు. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ సినిమాలకు ఓకే చెప్పేస్తూనే ఉన్నాడు.

    తొలి చిత్రం ‘అష్టాచమ్మా’ నుంచి నిన్నటి ‘వి’ వరకు ఏ సినిమాలో చూసినా.. మన పక్కింటి కుర్రాడే అన్న ఫీలింగ్ కలుగుతుంది. అతను సెలక్ట్ చేసుకునే సినిమాలు కూడా అదే తరహాలో ఉంటాయి. ఆయా సినిమాల్లో విభిన్నమైన పాత్రలో పోషిస్తుంటాడు. అన్ని సినిమాల్లోనూ క్యారెక్టర్ కనిపిస్తుంది తప్ప.. నానీ కనిపించడు. ఇమేజ్ ఛట్రాలు ప్రత్యేకంగా బిగించుకోవడం వంటివి ఉండవు. అందుకే.. నేచురల్ స్టార్ ట్యాగ్ ను బలవంతంగా మెళ్లో వేశారు ఆడియన్స్.

    సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి నేపథ్యమూ లేకుండా వచ్చి.. తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న అతికొద్దిమంది హీరోల్లో నాని ఒకరు. అండ లేకుండా వచ్చిన వారికి ఎలాంటి సాంప్రదాయ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు.. వెన్నుతట్టి ప్రోత్సహించే వారు కూడా అరుదే. పై పెచ్చు విమర్శల రాళ్లు విసిరికొట్టడం అత్యంత సహజం. ఇలాంటి చోట.. కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ, విసిరిన రాళ్లను పునాదులుగా మలుచుకొని ఎదగాలి. గెలవాలి.. గెలిచి నిలబడాలి.

    నాని అదే చేశాడు. మధ్యలో వరుస ఫ్లాపులు ఎదురైనా.. ఎదురీదాడు. కెరీర్ ను నిలబెట్టుకున్నాడు. అద్భుతంగా నిర్మించుకున్నాడు. పుష్కర కాలం దాటిన ఈ హీరో ప్రయాణం అప్రతిహతంగా సాగిపోతోంది. ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. ఈ ఏడాది నాని మూడు సినిమాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. వాటిలో ‘టక్ జగదీశ్’ ముందుగా రాబోతుండగా.. ఆ తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’ ‘అంటే .. సుందరానికీ!’ సినిమాలో లైన్లో ఉన్నాయి. టైటిల్స్ ను బట్టే వైవిధ్య చిత్రాలనే విషయం అర్థమవుతోంది. తన సక్సెస్ ను కంటిన్యూ చేస్తూ.. ప్రేక్షకులను మరింతగా అలరించాలని కోరుకుందాం. ‘హ్యాపీ బర్త్ డే నానీ..’