సీఎం కేసీఆర్ రంగంలోకి దిగేశారు. వారం రోజులుగా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన హైదరాబాద్ నగర జనాలను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. కేసీఆర్.. తనకు అనుకూలంగా లేని వాతావరణాన్ని ఒక్క ప్రెస్ మీట్ లేదా ఆఫీషియల్ మీట్తో తన వైపుకు తిప్పుకోగల సమర్థులు. తనను తిట్టిన వారితోనే సంబురంగా చప్పట్లు కొట్టించగల నేర్పరి. విమర్శించిన వారితోనే పొగడ్తల వర్షం కురిపించుకోగల అసాధ్యుడు. ప్రస్తుతం ఆయన హైదరబాద్ వరద బాధితులకు నష్ట నివారణ చేసే ప్రయత్నంలో ఉన్నారు.
Also Read: వారానికి మేల్కొన్న జగన్, కేసీఆర్?
హైదరాబాద్ వరదలకు ఎవరు కారణమో పక్కకు పెడితే.. అనుకోకుండా విరుచుకు పడిన వర్షాలు బస్తీలను, లోతట్టు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ఎకరాలకు ఎకరాల్లో కట్టిన గేటెడ్ కమ్యూనిటీలు, చెరువు శిఖం భూములు, వరద ప్రాంతాల్లో వెలిసిన భారీ కట్టడాలు, కబ్జాలతో ఎవరి ఇష్టం వచ్చినట్టు కట్టుకున్న ఇండ్లు.. ఇవన్నీ నష్టానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక డ్రైనేజీ వ్యవస్థ కూడా అడ్డదిడ్డంగా ఉండడం మరో కారణం. ఏ నగరాల్లోనైనా రానున్న 25 ఏండ్లకు అప్పటి జనాభాకు సరిపోయే ఏర్పాట్లు చేయాలి. అప్పటి పరిస్థితులు, నీటి వాడకం, జనాల అవసరాలు తీరేటట్టు నిర్మించాలి. ఏ పబ్లిక్ కట్టడమైనా.. రోడ్లు, డ్రైనేజీలైనా. కురిసే వర్షం లెక్కను బట్టి నాలాలు నిర్మించాల్సి ఉంటుంది. నాలాల సామర్థ్యం సరిగా లేకుంటే రోడ్లన్నీ కాలువలుగా మారిపోతాయి. నాలాల కబ్జాలు, పూడికతీత లేకపోవడం లాంటివి వరదలు కారణాలు అవుతాయి. ప్రస్తుతం ఈ తప్పిదాలన్నీ హైదరాబాద్ దు:ఖానికి కారణమని చెప్పక తప్పదు.
ఇంతటి బాధలో నగర జనాలు సహజంగానే ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు చోట్ల ప్రజాప్రతినిధులను నిలదీశారు. రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం విమర్శలు, జోక్లు, సెటైర్లు, మీమ్స్ లాంటి విపరీతంగా ట్రోల్ చేశారు. తమ బాధను వెళ్లబోసుకున్నారు.
మరో కొద్ది రోజుల్లోనే గ్రేటర్ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఇప్పటికే తమ విజయం నల్లేరు మీద నడకే అన్నట్టుగా అధికార టీఆర్ఎస్ ఉంది. అయితే భారీ వరదలు.. తీవ్ర నష్టం సంభవించడంతో సీన్ మారింది. మరో వైపు బీజేపీ దూకుడుగా ఉంది. ముందే సర్దుకోకపోతే రానున్న ఎన్నికల్లో ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని గ్రహించిన గులాబీ బాస్ వెంటనే రంగంలోకి దిగిపోయారు. హైదరాబాద్ కు రూ.550 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. ప్రతీ బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా 10వేలు, పాక్షికంగా ఇల్లు కూలిన వారికి రూ.50వేలు, పూర్తిగా కూలిన వారికి లక్ష రూపాయలు ప్రకటించారు. అయితే ఈ డబ్బులు బాధితుల భారీ నష్టాన్ని పూడ్చివేయకున్నా.. ఎంతో కొంత ప్రభుత్వం సాయం చేసింది కదా అన్న భావన జనాల్లో కలిగే అవకాశం ఉంది. ఇది ఆరంభం మాత్రమే. . ఇంకా చాలా చేస్తాం అనే భావనను కేసీఆర్ కలిగించారు.
Also Read: గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలు రాసిన వాళ్లకు శుభవార్త..?
ఒక్క సాయాన్ని సీఎం కేసీఆర్ రెండు రకాల లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మూడు నాలుగు రోజుల కిందట కేంద్ర ప్రభుత్వాన్ని వరద సాయం అడిగారు. అయితే అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. కేంద్రం కూడా అర్జెంట్గా సాయం చేస్తుందన్న ఆశ కూడా లేదు. కేంద్రం ఇప్పుడు రూపాయి ఇవ్వకపోతే.. రేపు ఎన్నికల టైంలో బీజేపీ కి టీఆర్ఎస్ ను విమర్శించడం అనేది సాధ్యం కాదు. వరదలోచ్చి జనాలు ఇబ్బందులు పడుతుంటే తాము 550కోట్లు ఇచ్చామని, రూపాయి ఇవ్వని బీజేపీ ఓట్లు ఎందుకు అడుగుతోందని.. టీఆర్ఎస్ కమలనాధుల విమర్శలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.