‘అల వైకుంఠపురంలో’ సంగీత దర్శకుడు తమన్ ఇచ్చిన మ్యూజిక్ నభూతో నభవిష్యతి. టాలీవుడ్ లోనే అత్యంత నాణ్యమైన బాణీలు అందించి ఆ సినిమాను వేరే లెవల్ కు తీసుకెళ్లాడు తమన్. దీంతో దేవిశ్రీప్రసాద్ ను పక్కకు నెట్టి ఇప్పుడు టాలీవుడ్ నంబర్ 1 సంగీత దర్శకుడిగా మారాడు.
టాలీవుడ్ లోనే అత్యంత బిజీ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. సూపర్ ఫామ్ లో ఉన్న తమన్ నుంచి ఇప్పుడు అంతకంటే సూపర్ గా పాటలు వస్తున్నాయి.
అయితే ఇదే తమన్ ను ట్యూన్లు కాపీ కొడుతాడు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు బోలెడు ఉదాహరణలు చూపి ఆడుకున్నారు. అది కావాలని జరిగిందో.. లేక యథాలాపంగా వచ్చిందో కానీ తమన్ ఇచ్చిన ప్రతి హిట్ గీతానికి కొందరు కాపీ ట్యూన్లు అంటూ ఉదాహరణలను ఆన్ లైన్ లో పెట్టేవారు.
ఈ క్రమంలోనే ఈ కుట్రలపై తాజాగా తమన్ హాట్ కామెంట్స్ చేశారు. ‘నన్ను అప్రతిష్టపాలు చేయడానికి ఓ టీం పనిచేస్తోంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనవి కాపీ ట్యూన్లు కావని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ‘క్రాక్’ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేను నిజంగా కాపీ కొడితే పెద్ద దర్శకులు, నిర్మాతలు ఊరుకుంటారా? ఇంతింత పారితోషికాలు ఇస్తారా? ఇన్ని సినిమా ఆఫర్లు వస్తాయా? నాపై ఒక్క ఫిర్యాదు ఎందుకు చేయలేదు? అని లాజిక్కులు తీశాడు.
నాపై వచ్చినన్ని విమర్శలు ఎవరిపై రాలేదని.. మరొకరైతే సంగీత దర్శకత్వం వదిలేసేవారంటూ తమన్ భావోద్వేగానికి గురయ్యాడు. కాపీ కొట్టుంటే 100 సినిమాలు ఎలా చేసేవాడిని అని అన్నారు. కాపీ కొట్టాను అన్నవాళ్లు సొంతంగా ఓ ట్యూన్ చేసి హిట్టు కొట్టగలరా? అని సవాల్ విసిరాడు.