తెలుగు సినిమా ఇండస్ట్రీలో థియేటర్లు పునఃప్రారంభమయ్యాక, ఒకేరోజు నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వడం ఇదే మొదటి సారి. కరోనా లాక్ డౌన్ తెచ్చిన ఇబ్బందులు సినిమా ఇండస్ట్రీలో ఇంకా పూర్తిగా తొలగిపోలేదనడానికి ఇదే నిదర్శనం. అప్పుడెప్పుడో పూర్తయిన సినిమాలు, ఈ మధ్యన కంప్లీట్ అయిన మూవీస్.. అన్నీ ఒకేసారి వస్తుండడంతో ఇలాంటి ట్రాఫిక్ జామ్ అవుతోంది. తెచ్చిన అప్పులు వడ్డీలతో తడిసి మోపెడవుతుంటే.. ఆగలేక, వేగలేక.. పోటీకి ఎన్ని సినిమాలు ఉన్నా.. వదిలేస్తున్నారు నిర్మాతలు.
ఇలాంటి పరిస్థితుల వల్లనే శుక్రవారం ఒకే రోజు నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో అల్లరి నరేష్ ‘నాంది’ – అక్కినేని హీరో సుమంత్ ‘కపటధారి’ సినిమాలతోపాటు విశాల్ ‘చక్ర’, కన్నడ డబ్బింగ్ మూవీ ‘పొగరు’ ఉన్నాయి. మరి, ఈ నాలుగు సినిమాల్లో బాక్సాఫీస్ బాద్షాగా ఏది నిలవబోతోంది? ప‌్రేక్షకులు ఏ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు? ఏ హీరో సత్తా చాటాడు.. ఎవరు ఉసూరు మనిపించారు? అన్నది చూద్దాం.
Also Read: సారీ చెప్పినా వదల్లేదుగా.. ఎన్ కౌంటర్ చేసిన అనసూయ!
కామెడీ సినిమాలతో ఎదురు దెబ్బలు తినీ తినీ బాగా అలసిపోయిన అల్లరి నరేష్.. అనివార్యంగా తన రూటు మార్చుకున్నాడు. మనోడి కెరీర్ అయిపోయిందా? అనే మాటలు కూడా వినిపిస్తున్న తరుణంలో వినూత్న ప్రయత్నానికి ‘నాంది’ పలికాడు. నరేష్ క్రైం బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తుండడం.. అందులోనూ ఫస్ట్ లుక్, ట్రైలర్ మంచి ఇంప్రెషన్ కలిగించడంతో.. సినిమాపై హైప్ పెరిగింది. దీంతో.. మంచి ఓపెనింగ్సే దక్కాయి. మొదటి షో టాక్ పాజిటివ్ గానే రావడంతో అలాగే కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా.. సినిమా కన్నా నరేష్ నటన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు నరేష్. అల్లరోడు అద్భుతమైన నటనతో ఏడిపించాడని అభినందనలు కురిపిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్.వీ 2 ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై సతీష్ వేగేశ్న నిర్మించారు. కాగా.. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా తొలిరోజు రూ.49 లక్షలు షేర్, రూ. 72 లక్షల గ్రాస్ రాబట్టింది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు రూ. 2.70 కోట్ల జరిగిందని సమాచారం. మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించే ఛాన్స్ ఉందని ట్రేడ్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
ఇక, అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సుమంత్ మొదట్లో మంచి మంచి సినిమాలే చేశాడు. కానీ.. ఆ తర్వాత కాలంలో అపజయాలు ఎదురుకావడంతో సైలెంట్ అయిపోయాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత థ్రిల్లర్ కథతో మళ్లీ తెరపైకి వచ్చాడు. కన్నడ సూపర్ హిట్ ‘కవలుధారి’ రీమేక్ తో ‘కపటధారి’గా ఆడియన్స్ ను పలకరించాడు సుమంత్. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. క్రియేటివ్ ఎంటర్టైనర్స్ – బొఫ్తా మీడియా బ్యానర్స్ పై ధనుంజయన్ నిర్మించాడు. అయితే.. ఈ సినిమా ఓపెనింగ్స్ ఆశాజనకంగా లేవని చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు. ‘కపటధారి’ అనే టైటిల్ కూడా జనాలకు కనెక్ట్ కాలేదనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే.. సినిమాకు రివ్యూస్ మాత్రం మంచిగానే వచ్చాయి. దీంతో వసూళ్ళు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.
Also Read: పవన్ – మహేష్.. రెమ్యునరేషన్ లో ఎవరు నెంబర్ 1?
కోలీవుడ్ స్టార్ విశాల్ హీరోగా వచ్చిన చిత్రం ‘చక్ర’. ఎమ్.ఎస్ ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కింది. తెలుగులో విశాల్ మంచి మార్కెట్ నే క్రియేట్ చేసుకున్న నేపథ్యంలో.. చక్ర ఫలితంపై ఆసక్తి నెలకొంది. జనాలకు మరింత దగ్గరయ్యేందుకు ఈ చిత్ర ప్రమోషన్ కూడా భారీగానే చేశాడు విశాల్. తెలుగు ప్రేక్షకులు పైరసీకి దూరంగా ఉంటారని కూడా కితాబిచ్చాడు. అయినప్పటికీ.. ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఆశించినంతగా రాలేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అంతేకాదు.. సినిమా చూసిన వాళ్లు కూడా.. గతంలో విశాల్ నుంచి వచ్చిన చిత్రాల మాదిరిగానే ఉందంటున్నారు. విశాల్ సొంత బ్యానర్ లో ఈ సినిమా రూపొందింది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు.. ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
ఇక, చివరగా ‘పొగరు’ గురించి చూస్తే.. ఈ సినిమాలో హీరో యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా. అతడిని ఇండస్ట్రీలో నిలబెట్టడానికి అర్జున్ బాగానే ప్రయత్నించాడు. ఈ సినిమాలోని ‘కరాబు’ సాంగ్ యూట్యూబ్ హయ్యెస్ట్ వ్యూస్ సాధించిన టాప్ 20లో నిలిచింది. యూత్ ను తెగ ఊపేసిందీ పాట. ఈ సాంగ్ తెచ్చిన హైప్ తోనే.. ఆడియన్స్ థియేటర్ కు వెళ్లారు. సినిమాకు మంచి ఓపెనింగ్సే వచ్చాయని అంటున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు నంద కిశోర్ తెరకెక్కించాడు. అయితే.. సినిమాకు పాజిటివ్ టాక్ మాత్రం రాలేదు. ఈ వీకెండ్ లో పై నాలుగు సినిమాల్లో ఏవి అధికంగా కలెక్షన్లు రాబట్టనున్నాయి? ఏవి మరికొన్ని రోజులు థియేటర్లో నిలబడనున్నాయి? అన్నది చూడాలి.