శివాజీ ఒక శూద్రుడు. శూద్రుడికి ఈ దేశంలో కత్తిపట్టే హక్కులేదని అనాదిగా ఒక మూఢాచారం ప్రబలింది. అది కేవలం క్షత్రియకులానికే ఉంది. కానీ ముస్లిం పాలకులు రావడంతో మొదటిసారి భారీగా కిందికులాలు కత్తిపట్టి సుల్తానుల కింద తమ శౌర్యాన్ని, నమ్మకాన్ని చూపి పదవులు పొందాయి. అలా పదవులు పొందిన కుటుంబాలలో దక్కన్ ప్రాంతాన్ని పాలించిన అహ్మద్ నగర్, బీజాపూరు, బీదరు, బీరార్, గోల్కొండ సుల్తానుల కింద చాలామంది ఎదిగారు. ఆలా ఎదిగిన వాళ్లలో శివాజీ కుటుంబం కూడా ఒకటి.. శివాజీ తండ్రి షాజీ భాన్స్లే, అతని బంధువులు ఈ సుల్తానుల వద్దనే నమ్మకమైన సేనానులుగా పనిచేశారు. తండ్రి, బాబాయి వరుసలో కత్తివిద్యలు నేర్చిన శివాజీ మాంగ్, మహర్, కోలీ, సొంకాలీ, రామోసీ, జింజిర సిద్దీలు వంటి కిందికులాలకు చెందిన యువకులు, ముఖ్యంగా అప్పటికే తండ్రి, బాబయ్‌లకు మొదటిసారి సైన్యంలో అవకాశం కల్పించిన ముస్లిం పాలకుల కింద పనిచేసి, మతం మారిన ఇతర ముస్లిం యువకులతో ఒక స్వతంత్ర ప్రాంతం ఏర్పాటు చేసుకుని, పాలించాలని కలలుగని, దాని సాధనకోసం పోరాడాడు. అయితే అతడు అప్పుడు వీరు పోరాడింది పక్కనే ఉన్న అహ్మద్ నగర్, బీజాపూర్‌లని పాలించిన సుల్తానులపై.. అలాగే ఢిల్లీలో మొఘలులపై.. వీరంతా ఇస్లాం మతానికి చెందినవారు కాబట్టి శివాజీని హిందూ పాలకుడిగా.. ఇస్లాం పాలకుల మీద పోరాడినట్లు తర్వాతి కాలంలో అనువదించారు. దీనికి కారణాలు చూసే ముందు సమాకాలీనంలో వాస్తవాల్ని చూస్తే-
శివాజీ నిజానికి మాలిక్ అంబర్ అనే ప్రఖ్యాత గెరిల్లా యుద్ధవిద్యల ద్వారానే రాజ్యం సాధించాడు. శివాజీ సైన్యంలో దాదాపు అందరూ కింది కులాలవాళ్లు, ముస్లింలే ఎక్కువ. ఒకసారి అతడి పక్కనున్నవారిని చూస్తే-
శివాజీ అయుధాగారాధిపతి ఇబ్రహీంఖాన్, ఒక ముస్లిం, నావికాదళపతి సిద్దీ సంభాల్, ఒక ముస్లిం. శివాజీ అత్యంత నమ్మకస్తుడు, విదేశీ వ్యవహారాల మంత్రి మౌలానా హైదర్, ఒక ముస్లిం. అఫ్జల్‌ఖాన్ అనే సైనికాధికారిని చంపినా అతని గౌరవం కోసం ఒక దర్వాజాని రాయగడ్ లో నిర్మించాడు. అఫ్జల్‌ఖాన్ ని అంతమొందించడానికి భగ్నక్ అనే ఉక్కుగోళ్లని అందించి శివాజీ ప్రాణాలు కాపాడినవాడు రస్తిం జమాన్, ఒక ముస్లిం. ఔరంగజేబుతో యుద్దంచేసి ఓడినప్పుడు సంధి కోసం పంపిన దూత ఖాజీ హైదర్. మొఘలుల తరపున యుద్దం చేసి శివాజీని బంధించిన సైనికాధికారి రాజపుత్రుడు జైసింగ్ ఒక హిందు. జైసింగ్ యుద్ధంలో ఓడించి శివాజీని బంధించి తీసుకువెళ్తే అక్కడ ఔరంగజేబు చెరనుంచి తన ప్రాణాలు అడ్డుపెట్టి మారువేశంలో శివాజీని చెరనుండి విడిపించినవాడు మదాని మొహతర్, ఒక ముస్లిం. శివాజీ జీవితాన్ని ప్రభావితం చేసింది పరోక్షపు సమర్థరామదాసు బోధనలు కన్నా, ప్రత్యక్ష సమకాలీన హజ్రత్ బాబా యాకుత్, ఒక ముస్లిం. ఆందుకు కృతజ్ఞతతో ఆ గురువుకి జీవితకాలం పింఛన్ ఏర్పాటు చేశాడు శివాజీ. యుద్ధంలో ఖురాన్ కనిపిస్తే దాన్ని మర్యాదపూర్వకంగా ఇతర ముస్లింలకు అందజేయాలనే యుద్ద నియమం విధించాడు శివాజీ. ఇస్లాం సైనికులకోసం తన రాజధాని రాయగడ్ లో, తన రాజభవనానికి ఎదురుగా ఒక మసీదు నిర్మించాడు. ముస్లిమే కాదు ఆ మాటకొస్తే క్రైస్తవాన్నీ గౌరవించాడు. ఘుజరాత్ దాడిలో ధ్వంసమైన చర్చికి భూరి నిధులిచ్చి పునర్ నిర్మాణం చేయించాడు. ఫాదర్ ఆంబ్రోస్ పట్ల అపార గౌరవం చూపాడు.
నిజానికి ముస్లిం పాలకులతో చివరికి ఔరంగజేబుతో కూడా సైనికపరమైన, అధికారపరమైన ఘర్షణే తప్ప మరో వైరంలేదు శివాజీకి. శివాజీ తన జీవితకాలంలో ఎన్నడూ ఔరంగజేబు పాలనా ప్రాంతాలమీద దాడిచేయని విషయం గుర్తించాలి. శివాజీ తర్వాత అతని సంతతిలో సాహూకు కూడా అదే రాజా అనే బిరుదుతో మన్సబుదారుగా నియమించాడు ఔరంగజేబు. ఇవన్నీ ఒకవైపు వాస్తవాలుగా ఉన్నప్పుడు హిందూ పాలకుడు అన్నవివాదం ఎందుకు అంటే-
శివాజీ ఒక శూద్రుడు కాబట్టి రాజుగా అంగీకరించడానికి నాటి మధ్య యుగాలనాటి కరుడుగట్టిన బ్రాహ్మణ వర్గాలు ఒప్పుకోలేదు. మనుధర్మం కఠినంగా అమలైన కాలమది. జీవితకాలమంతా కష్టపడి ఒక రాజ్యం ఏర్పరచుకున్నా, అతడిని ఒక రాజుగా గుర్తించడానికి రాజ్యంలో ఏ బ్రాహ్మణుడూ ముందుకు రాకపోతే మనిషెత్తు బంగారం సమర్పించుకుని కాశీ నుండి గంగబట్టు అనే బ్రాహ్మణుడిని పిలిపించి పట్టాభిషేకం చేసుకున్నాడు. అదీ ఆ బ్రాహ్మణూడు కాలి బొటనవేలితో దిద్దిన తిలకంతో.
శివాజీ యుద్దాలకాలంలో బాజీ గుర్జర్ అనే అత్యాచారానికి పాల్పడిన మంత్రిని, కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి అనే అఫ్జల్ఖాన్ న్యాయసలహాదారుడిని చంపించాడు. శివాజీ ఈ చర్య అంటే బ్రాహ్మణ హత్య మనుస్మృతికి ప్రకారం మాహా పాతకం. ఇక్కడినుండే బ్రాహ్మణులు కక్ష పెంచుకున్నారు.
మరాఠా ప్రాంతంలో తరాలుగా జనాన్ని దోచుకుతినేది పన్నులు వసూలుచేసే బ్రాహ్మణ కులానికి చెందిన పాటిల్, కుల్‌కర్ణి, దేశ్‌ముఖ్, దేశ్‌పాండేల కున్న వారసత్వపు హక్కుల్ని తొలగించాడు. తరాల అగ్రహారాలు, జమీందారీలు రద్దుపరచి రైతులకు కబూలియత్‌లు అనే భూమిహక్కు పట్టాలిచ్చాడు. ఈ చర్యలు వంశపారంపర్య బ్రాహ్మణూలకు ఆగ్రహం కలిగించాయి.
వయసు ఉడిగిన శివాజీ జీవితం చివర్లో అతి దుర్భరంగా గడిచింది. చివరకు విషమిచ్చి చంపించారు. శివాజీ కుమారుడు తండ్రి బాటలో నడిచాడు. మనుస్మృతిని ధిక్కరించి ఒక శుద్రుడైనప్పటికీ చదువుకుని “బుద్ద భూషణం” అనే పుస్తకం రాశాడు. వేద పురాణాల్ని ఆధ్యయనం చేసి అవి పనికిరావని తేల్చి, “ఈ దేశానికి బౌద్దం ఒక్కటే మార్గం” అని నిర్ణయించి ప్రచారం చేశాడు. ఇది నచ్చని ఆధిపత్య కులాలు శంభాజీని బంధించి అతడి కాదని రాజారాంని వారసుడిగా గుర్తించాయి. అప్పటికే ఆస్థానంలో తిష్టవేసిన పీష్వాలూ చెలరేగిపోయారు. అసలైన పలకులుగా అవతారమెత్తేశారు.
మనుస్మృతిలో చెప్పినట్లు కళ్ళుపీకీ, చర్మం ఒలిచి, నాలుక కోసి శంభాజీ అతి క్రూరంగా హత్య చేశారు. శంభాజీ తలని, అతని అనుచరుల తలలని కోసి వాటిని కత్తులకు గుచ్చి పూణేలో ఊరేగించారు, కులధర్మాన్ని ధిక్కరించనవాడు చక్రవర్తి అయినా సరే, అతడికి ఏ గతి పడుతుందో స్వయంగా ఉదాహరణగా చూపి ప్రకటించారు.
శివాజీ తర్వాత బ్రాహ్మణ పీష్వాలు అధికారం హస్తగతం చేసుకున్నారు. ముస్లింలని, కిందికులాల్ని పదవుల్లోంచి తొలగించి అవమాన పరిచారు. దీని ఫలితమే మూడో పానిపట్టు యుద్దంలో అహ్మద్ షా అబ్దాలీ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ఇక తమమీద చేసిన దాడులు, అవమానాలకు ప్రతీకారంగా అణచివేయబడిన మాంగ్,మహర్ అంటరానికులాలు భీమా కోరేగావ్ యుద్దంలో బ్రిటిష్ తరపున యుద్దంలో పీష్వాల మరాఠా సైన్యాన్ని తత్తునియలు చేశాయి. శివాజీ వారసుల్లో ఒకడైన సాహూ మహరాజ్ మొదటిసారి రిజర్వేషన్లు తన సంస్థానంలో అమలుపరిచిన విషయం గుర్తించాలి.
చిత్పవన్ వంశానికి చెందిన పీష్వాలకు వారసుడైన బాలగంగాధర తిలక్ అనే బ్రాహ్మణుడే తర్వాతి కాలంలో బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో ప్రజల్ని ఉద్యమంలోకి తెస్తున్నాననే నెపంతో 1894లో శివాజీ ఉత్సవాలని ఆరంభించాడు. పరాయి పాలనకు వ్యతిరేకంగా శివాజీని నిలబెట్టే క్రమంలో అతడిని ఒక మతానికి చెందిన స్వతంత్ర పోరాటవీరునిగా విదేశాల నుంచి వచ్చిన ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా కథలు, పాటలు, నాటకాలు రాయించాడు. అందులో భాగంగా శివాజీ వీరత్వానికి కారణం అతడి కష్టం, శౌర్యం కాకుండా భవానీమాత ఇచ్చిన ఖడ్గంగా ప్రచారంచేశారు. తర్వాతి కాలంలో జ్యోతిబా ఫూలే శివాజీ సమాధిని వెదికించి, వెలికితీసి కావ్యాలు రాశాడు.
-సిద్ధార్థి
Note: Views expressed by author are his own, not of publishers
రచయిత అభిప్రాయాలు తన వ్యక్తిగతం, ప్రచురణ కర్తలకు చెందినవి కావు