Harish Rao: అమరావతిలో హైదరాబాద్.. మళ్లీ భయపెడుతున్న బీఆర్ఎస్

అచ్చంపేటలో సీఎం అలా మాట్లాడితే.. తాజాగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రచార కార్యక్రమంలో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకపోతే హైదరాబాద్‌ మరో అమరావతి అవుతుందని ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించేలా హెచ్చరికలు పంపారు.

Written By: Raj Shekar, Updated On : October 28, 2023 8:03 am

Harish Rao

Follow us on

Harish Rao: తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలన్న బీఆర్‌ఎస్‌ ఆశలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. కీలక నేతలు బీఆర్‌ఎస్‌ను వీడుతున్నారు. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోకన్నా.. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీ స్కీంలపైనే రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గ్రామీణ రైతుల నుంచి పట్టణ పేదల వరకు ఈసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇద్దాం అన్న ఆలోచన చేస్తున్నారు. మరోవైపు సర్వేలనీ‍్న కాంగ్రెస్‌కే ఎడ్జ్‌ ఇస్తున్నాయి. దీంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్‌ కేసీఆర్‌ సెంటిమెంటును పండిచే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం(అక్టోబర్‌ 26న) అచ్చంపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ‘ఓట్లేస్తే గెలుస్తం.. లేకుంటే రెస్ట్‌ తీసుకుంటం.. మాకు పోయేదేం లేదు.. నష్టపోయేది ప్రజలే’ అని సెంటిమెంట్‌తోపాటు, బెదిరింపు వ్యాఖ్యలు చేశారు.

హరీశ్‌ బెదిరింపులు..
అచ్చంపేటలో సీఎం అలా మాట్లాడితే.. తాజాగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రచార కార్యక్రమంలో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకపోతే హైదరాబాద్‌ మరో అమరావతి అవుతుందని ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించేలా హెచ్చరికలు పంపారు. కాంగ్రెస్‌ గెలిస్తే అమరావతి తరహాలోనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా పూర్తిగా పడిపోతుందని భయపెట్టారు.

రజినీకి అర్థమైనా.. గజీనీలకు కావడం లేదు..
హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిని చెన్నైలో నివసించే సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అర్థమైందని, అయితే ఇక్కడి కొందరు గజినీలు అర్థం చేసుకోలేకపోయారని హరీశ్‌రావు విపక్షాలపై విమర్శలు చేశారు. ‘రజనీకాంత్ హైదరాబాద్ అభివృద్ధిని చూసి మైమరచిపోయి న్యూయార్క్‌తో పోల్చారు. అయితే, ఇక్కడ ఉన్న కొందరు వ్యక్తులు దానిని అర్థం చేసుకోలేరు’ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో సూపర్ హిట్ అయిందని అందుకే కేసీఆర్ భరోసా అని పేరు పెట్టారని తెలిపారు.

హ్యాట్రిక్‌ ఖాయం..
బీఆర్‌ఎస్‌ నేతలు లోపల ఓటమి భయంతో ఆందోళన చెందుతున్నా.. బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అటు సీఎం కేసీఆర్‌, ఇటు మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ తెలంగాణలో హ్యాట్రిక్‌ కొడతామని ప్రకటిస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ రాకుంటే తెలంగాణ ఆగమవుతుందని భయపెడుతున్నారు. రాష్ట్రాన్ని రాబంధులకు అప్పగించొద్దని సూచిస్తున్నారు. తాజాగా హరీశ్‌రావు కూడా బీఆర్‌ఎస్‌పై ఎన్ని కుయుక్తులు పన్నినా పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కళ్ల ముందు చూసి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చివరగా, ఎన్నికల రేసులో.. బీజేపీ డకౌట్ అవుతుందని, కాంగ్రెస్ రన్ అవుట్ అవుతుందని, కేసీఆర్ సెంచరీ చేస్తాడని పంచ్‌ డైలాగ్‌ చెప్పారు.