Chiranjeevi’s Daughter : రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలతో పోటీ పడుతూ డ్యాన్స్, ఫైట్స్ చేయడమే కాదు, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ విషయంలో కూడా చాలా గట్టి పోటీని ఇస్తున్నాడు. ‘ఖైదీ నెంబర్ 150’, ‘సైరా నరసింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ లాంటి చిత్రాలతో మూడు సార్లు వంద కోట్ల రూపాయిల షేర్ ని అందుకున్న హీరోగా చిరంజీవి సరికొత్త చరిత్ర సృష్టించాడు. నేటి తరం హీరోలకు కూడా ఇలాంటి ట్రాక్ లేకపోవడం గమనార్హం. అలాంటి మెగాస్టార్ చిరంజీవి లో అభిమానులకు ఒకే ఒక్క అసంతృప్తి ఉంది. మెగాస్టార్ లుక్స్ ఎందుకో ఒకప్పటి లాగా సహజంగా లేవు, చాలా ఆర్టిఫీషియల్ గా ఉంది అని బహిరంగంగానే సోషల్ మీడియా లో మెగాస్టార్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు వేస్తున్నారు. అందుకు కారణం ఆయనకీ కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న, పెద్ద కూతురు సుస్మిత కొణిదల అని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవి కి వయస్సుకి తగ్గ డ్రస్సులు వేయించడం లో కానీ, ఆయన మేకప్ లో సహజత్వం కోల్పోవడంలో కానీ సుస్మిత కొణిదెల చెయ్యి చాలా ఉందని అంటున్నారు అభిమానులు. బయట చూసేందుకు ఎంతో యంగ్ గా కనిపిస్తున్న చిరంజీవి, స్క్రీన్ మీద మాత్రం ఎదో తెలియని లోపం ఉన్నట్టుగా కనిపిస్తుందని కంప్లైంట్ చాలా రోజుల నుండి ఉంది. రీసెంట్ గానే చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల (దసరా ఫేమ్) కాంబినేషన్ లో ఒక సినిమాని అధికారికంగా ప్రకటించారు. దసరా వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందించిన శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి సినిమా అని చెప్పగానే అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. నేటి తరం ఆడియన్స్ కి తగ్గట్టుగా చిరంజీవి సినిమాలు చేయాలని కోరుకునే ప్రతీ అభిమానికి ఈ కాంబినేషన్ ప్రకటన ఒక పండగ లాంటిది. అయితే వీరిలో ఒక చిన్నపాటి భయం కూడా ఉంది.
ఈ సినిమాకి కూడా సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ అయితే లుక్స్ మళ్ళీ ఆర్టిఫీషియల్ గా ఉండే అవకాశం ఉందని, దయచేసి ఆమెని దూరం పెట్టండి అంటూ అభిమానులు చిరంజీవి ని ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వసిష్ఠ తో విశ్వంభర అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా 80 శాతం కి పైగా పూర్తి అయ్యింది. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, గ్రాఫిక్స్ విషయం లో ఒక రేంజ్ లో ట్రోల్ అయ్యింది విశ్వంభర చిత్రం. ఇప్పుడు ఆ గ్రాఫిక్స్ ని హై క్వాలిటీ తో మళ్ళీ రీ వర్క్ చేయించే పనిలో ఉన్నాడట డైరెక్టర్ వసిష్ఠ. జనవరి 10 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, ‘గేమ్ చేంజర్’ చిత్రం కోసం వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.