ప్రపంచంలో ఇలాంటి బ్యాచ్ ప్రతిచోటా ఉంటుంది. మన దగ్గర కాస్త ఎక్కువగానే ఉంటుంది. తమ మనోభావాలను చేతిలో పట్టుకొని.. ఎప్పుడు దెబ్బతీసుకుందామా? ఎవరిని టార్గెట్ చేద్దామా? అని ఎదురు చూస్తుంటుంది. సోషల్ మీడియాలో ఈ తరహా బ్యాచ్ ఎలా వ్యవహరిస్తుందో అందరికీ తెలిసిందే. రెండు రోజుల క్రితం విడుదలైన ‘ఫ్యామిలీ మెన్-2’ వెబ్ సిరీస్ విషయంలో తమిళనాడులోని కొందరు చేసిన యాగీ అంతా ఇంతా కాదు.
ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగానే మనోభావాలను తెంపేసుకున్నారు. అసలు ఆ సినిమాలో ఏముందో తెలియదు. ఎలా ఉందో తెలియదు. కానీ.. వాళ్లు మాత్రం మనో భావాలను విరిచేసుకున్నారు. తమిళులకు వ్యతిరేకంగా ఈ సినిమా తీస్తున్నారని, దీన్ని వెంటనే అడ్డుకోవాలని, ఆపేయాలని డిమాండ్లు చేశారు. సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేశారు. ఇప్పుడు లాక్ డౌన్ ఉందిగానీ.. లేదంటే ధర్నాలు, రాస్తారోకోలు అంటూ ఎంత పెద్ద గొడవ జరిగేదో?!
ఈ మూవీ జూన్ 3వ తేదీన రిలీజ్ అయ్యింది. సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ తొలి పార్టు ఎంతటి విజయం సాధించిందో.. అంతకు మించి అనేలా సెకండ్ సిరీస్ ఆకట్టుకుంటోంది. రివ్యూలు మొదలు.. ప్రేక్షకుల దాకా అందరూ సూపర్బ్ అని కామెంట్ చేస్తున్నారు. కానీ.. ఆ బ్యాచ్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఎక్కడున్నారోగానీ.. సోషల్ మీడియాల కూడా కనిపించట్లేదు.
వాళ్లు ముందుగా గోల చేసినట్టుగా ఈ సినిమాలో ఎవ్వరికీ వ్యతిరేకమైన సన్నివేశాలు లేవు. చిత్ర దర్శకులు ముందునుంచీ ఇదే మాట చెప్పారు. ట్రైలర్ చూసి ఏదేదో అనుకోవొద్దని కూడా చెప్పారు. వారి మార్కెటింగ్ స్ట్రాటజీని వాళ్లు అనుసరించారు. ఇదంతా తెలియని బెబ్బే బ్యాచ్.. చొక్కాలు చించుకొని రెచ్చిపోయారు. తీరా సినిమా విడుదలైన తర్వాత తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్ అయిపోయారు. అందుకే.. తొందరి ముందే కూయొద్దని చెప్పేది. ఈ విషయం ఇప్పటికైనా అర్థమవుతుందో..?!!