హుజూరాబాద్ తో ఈటల బంధం ఈనాటిది కాదు. టీఆర్ఎస్ పుట్టిన నాటి నుంచీ.. అదే నియోజకవర్గంలో ఉన్నారు. అక్కడే నేతగా ఎదిగారు. దీంతో.. అందరికీ సుపరిచితమైన నాయకుడయ్యారు. ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించినప్పుడు అధికార పార్టీని కాదని, దాదాపు 90 శాతం మంది ప్రజాప్రతినిధులు ఆయన వెంట నిలవడమే.. ఈటల బలం ఏంటన్నది అందరికీ తెలిసి వచ్చింది. ఆ తర్వాత టీఆర్ఎస్ అధిష్టానం ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి.. తమ వైపు తిప్పుకునేందుకు సామ,దాన,బేద, దండోపాయాలను ప్రయోగించిందనే విమర్శలు వచ్చాయి.
అయితే.. ఈ మధ్య ఈటలపై సోషల్ మీడియా వేదికగా దాడి మొదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఇదే విషయాన్ని చాటి చెబుతున్నాయని అంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఈటల కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించిన విషయం కూడా ఇక్కడ ప్రస్తావనార్హం. తాను తప్పు చేశానని, తనను క్షమించాలని కోరుతూ ఈటల కేసీఆర్ కు రాసినట్టుగా ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై ఈటల పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.
తాజాగా.. ఆయన బావమరిది దళితులను దూషించారంటూ ప్రచారం మొదలైంది. వాట్సాప్ సంభాషణలు ఇవేనంటూ.. స్క్రీన్ షాట్లు ప్రచారంలోకి వచ్చాయి. కొందరు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈటల దిష్టిబొమ్మ దహనాలు కూడా చేపట్టారు. దీనిపై ఈటల సతీమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరి, అవి రాసింది ఎవరన్నది మాత్రం తేలలేదు.
ఇవన్నీ చూస్తుంటే.. ఈటలను సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేసినట్టు అనిపిస్తోందని ఆయన వర్గం అనుమానిస్తోంది. తప్పుడు ప్రచారం చేస్తూ.. బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇదిలాఉంటే.. ఇప్పటి వరకూ ఈ ఎన్నికకు నోటిఫికేషన్ రాలేదు. ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. కానీ.. హుజూరాబాద్ పోరాటం మాత్రం పతాకస్థాయిలో కొనసాగుతోంది. మరి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.