Drugs Case: నాలుగేళ్ల క్రితం డ్రగ్స్ కేసు (Drugs Case) పెద్ద సంచలనంగా మారింది. ఇందులో పెద్ద పెద్ద సినీ ప్రముఖుల హస్తం ఉందని ప్రచారం జరిగినా తరువాత ఆ కేసుకు క్లీన్ చిట్ ఇచ్చి అంతా మరచిపోయారు. కానీ ప్రస్తుతం ఈ కేసు ఈడీ (ED) చేతుల్లోకి వెళ్లింది. దీంతో మళ్లీ కలకలం రేగుతోంది. డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాలలో కీలక సాక్ష్యాధారాలు సేకరించి నిందితులను అరెస్టు చేసేందుకు ఈడీ సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. అప్పట్లో కేసును దర్యాప్తు చేసిన అకున్ సబర్వాల్ ను కూడా ఈడీ ప్రశ్నించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఎంత మేరకు ఉంది అనే విషయాలను నిగ్గు తేల్చేందుకు ఈడీ ముమ్మర దర్యాప్తు సాగించనున్నట్లు ప్రచారం సాగుతోంది.
డ్రగ్స్ కేసు టాలీవుడ్ (Tollywood) లో పెద్ద సంచలనమే సృష్టించింది. టాలీవుడ్ నటులు ఇందులో చిక్కుకున్నారు. వారి నుంచి సేకరించిన నమూనాల తర్వాత పోలీసులు నిశ్శబ్దం పాటించారు. దీంతో కేసు అక్కడే ఆగిపోయింది. ఏ ఒక్కరిపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో ప్రస్తుతం కేసు ఈడీ చేతుల్లోకి వెళ్లడంతో అందరిని విచారించి ఓ కొలిక్కి తేవాలని చూస్తున్నట్లు సమాచారం. ఇంతవరకు ఏ ఒక్కరిపై కూడా చార్జీషీటు దాఖలు చేసిన సందర్భాలు లేవు. డ్రగ్స్ దందాలో ప్రమేయం ఉన్నట్లు నిరూపించలేకపోయారు. ముంబై, కర్ణాటక వంటి స్టేట్లలో కూడా డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో రేవంత్ రెడ్డి డ్రగ్స్ కేసు గురించి రాష్ర్టపతికి ఫిర్యాదు చేశారు. హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసు ఈడీకి చేరడానికి కారణం ఆయనే కావచ్చనే అనుమానాలు వస్తున్నాయి. ఈ కేసులో తెలంగాణ పోలీసులు వారికి క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత ఈడీకి సమాచారం ఎవరిచ్చారనే దానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. డ్రగ్స్ విషయంలో ఎవరి ప్రమేయం ఎంత అనే విషయాలను నిగ్గు తేల్చాలని ఈడీ ప్రయత్నిస్తోంది.
టాలీవుడ్ డ్రగ్స్ దర్యాప్తులో వేగం పెరుగుతుందని భావిస్తున్నారు. కేసు ఈడీ చేపట్టాక దర్యాప్తు వేగం పుంజుకుంటుందని అందరిలో ఆసక్తి నెలకొంది. డ్రగ్స్ కేసులో ఎవరిని టార్గెట్ చేస్తారో? ఎవరిపై కేసులు పెడతారో? అనే సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ప్రభుత్వం మూసేసిన కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారనుంది. కేసుతో ప్రమేయం ఉన్న వారికి కచ్చితంగా శిక్ష పడేలా చేస్తారనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతోంది.
సాధారణంగా డ్రగ్స్ వాడకం.. రవాణా ఇలాంటి విషయాల్లో ఈడీ దర్యాప్తు చేయదు. వాటి కొనుగోలు, అమ్మకాల్లో నగదు లావాదేవీలు అక్రమం అయినప్పుడు మనీలాండరింగ్ కోణంలోనే కేసు దర్యాప్తు చేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ అక్రమ నగదు చెలామణీ కోణంలోనే దర్యాప్తు చేస్తోందని సమాచారం.