Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండాసారి బాధ్యతలు చేపట్టడం అటు అమెరికన్లకు.. ఇటు భారతీయులకు పెద్ద శాపంగా మారింది. ట్రంప్ భారతీయుల నెత్తిన భస్మాసుర హస్తం పెడుతున్నాడు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదమే అవుతున్నాయి. ట్రంప్ కారణంగా అమెరికా గతంలో ఎన్నడూ లేనివిధంగా అతిపెద్ద షట్‌డౌన్ ఎదుర్కొంటోంది. అయినా ముసలి తాత మొడిపట్టు వీడడం లేదు. ప్రజలకన్నా.. తనకు తన పట్టే ఎక్కువ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇక విదేశీయుల విషయంలో ట్రంప్ భారతీయులనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే అక్రమ వలసల సాకుతో వందల మందిని వెనక్కు పంపించారు. గ్రీన్‌కార్డు నిబంధనలు కఠినం చేశారు. హెచ్–1బీ వీసా రెన్యూవల్ నిబంధనలు మార్చారు. కొత్తవారికి ఫీజు భారీగా పెంచారు. ఇప్పుడు వ్యాధులు ఉన్నవారు కూడా భారత్‌కు రావొద్దని ఆంక్షలు పెట్టారు. బీపీ, షుగర్, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులున్న వారికి వీసా నిరాకరణ వంటి ఆరోగ్య ఆధారిత ఆంక్షలు వలసదారుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి.
ప్రతిభ కన్నా పరిమితులే ఎక్కువ
అమెరికాకు వెళ్లిన భారతీయులు ఆ దేశాన్ని దోచుకున్నట్లుగా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారతీయులను నియమించుకోవద్దని కంపెనీలకు హుకూం జారీ చేశారు. కానీ భారతీయులు తమ మేధాశక్తిని ఉపయోగించి ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నారు. కానీ నూతన నియమాలు ప్రతిభావంతుల మార్గాన్ని నిరోధించేలా మారుతున్నాయి. ఫలితంగా గ్లోబల్ ప్రతిభామార్కెట్‌లో అమెరికా తన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రత్యామ్నాయాలవైపు చూపు..
భారత్ లేకుంటే అమెరికా ఇంతలా అభివృద్ధి చెందేది కాదు.. అమెరికన్ల తెలివితక్కువతనం.. భారతీయులకు వరంగా మారింది. మన మేధాశక్తి అమెరికా అభివృద్ధికి ఎంతగానో తోడ్పడింది. అందుకే బిల్‌క్లింటన్ తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఇండియా లేకుంటే అమెరికా లేదు అని ప్రకటించారు. ఇక ట్రంప్ తీరు అందుకు విరుద్ధంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగం విస్తరించడంతో, అంతర్జాతీయ అవకాశాలు అమెరికాతో మాత్రమే పరిమితం కాదనే వాస్తవం స్పష్టమవుతోంది. కెనడా, యూరప్, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్యం, సింగపూర్ వంటి దేశాలు భారతీయ నైపుణ్యాన్ని ఆహ్వానిస్తున్నాయి. ఈ మార్పు అమెరికా ఆధిపత్యానికి ఎదురుదెబ్బ తప్పదు.
రెండు దేశాలకు ఇబ్బందులు..
తాత్కాలికంగా అమెరికా వీసాల కఠిన విధానం భారత్ నుంచి వెళ్లే ఉద్యోగుల సంఖ్యను తగ్గించి విదేశీ రమిత్తుల ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే దీని వలన నైపుణ్యపరమైన యువత దేశీయ పరిశ్రమలను ఆకర్షించడం సాధ్యమవుతుంది. భారత టెక్ సంస్థలు అంతర్జాతీయ ప్రాజెక్టులను స్వదేశంలోనే నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ కఠిన విధానాలు అమెరికాకే దీర్ఘకాలంలో నష్టమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా టెక్నాలజీ రంగం భారత మేధావుల సహకారం లేకుండా పూర్తిగా నిలబడలేదనే వాస్తవం ఉంది. ఆరోగ్య ఆధారిత వీసా నిబంధనలు వేయడం ద్వారా అత్యంత ప్రతిభావంతుల ఎంపికను కూడా అమెరికా కోల్పోతుంది. ఇక భారతీయుల పట్ల మానసిక అవరోధం పెంచడం ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
మరో మూడేళ్లు ట్రంప్ విధానాలు కొనసాగుతాయని స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ మార్పులు భారత యువతలో స్వీయ అవకాశాలను పరిశీలించే ధోరణిని పెంచుతాయి. విదేశీ ఉపాధి కలలు కన్న తరం ఇప్పుడు ఇక్కడే సృష్టించుకుందాం అనే కొత్త దిశలో ఆలోచన ప్రారంభించింది.