Dokka Seethamma: అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పది. ఆకలితో ఉన్నవారికి కడుపు నింపితే అందులో ఉన్న సంతృప్తే వేరు. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తే జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆకలి బాధ అందరికీ సమానమే. దానికి ధనిక, పేద అన్న తేడాలు ఉండవు. అయితే అటువంటి మహోన్నత అన్నదానం చేసి ఆంధ్రుల అన్నపూర్ణగా గుర్తింపు సాధించారు డొక్కా సీతమ్మ( Dokka Seethamma ). ఆమె ఔన్నత్యాన్ని ముందుగా గుర్తించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆమె పేరుతో ఏపీలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే తాజాగా ఆమె జీవిత కథను వెండితెరపైకి ఆవిష్కరించనున్నారు. సీనియర్ నటి ఆమని డొక్కా సీతమ్మ పాత్ర పోషించునున్నారు. డొక్కా సీతమ్మ బయోపిక్ ను టీవీ రవి నారాయణ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు వచ్చే ఆదాయం డొక్కా సీతమ్మ పేరు పై ఉన్న పథకానికి వినియోగించమని ప్రభుత్వానికి విరాళంగా ఇస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.
Also Read: ఏపీలో 2029లో విజేత వారే.. ఉండవల్లి అరుణ్ కుమార్ ఈజీ విశ్లేషణ!
* నిత్య అన్నదాతగా..
అయితే డొక్కా సీతమ్మ ఎవరు? ఆమె జీవిత విశేషాలు ఏంటి? బ్రిటిష్ దొర చేతులెత్తి మొక్కేంత నిత్య అన్నదాత గా ఎలా ప్రసిద్ధి చెందారు? అన్నది వెండి తెరపై చూడనున్నాం. ప్రపంచమంతా డొక్కా సీతమ్మ చరిత్ర చూడనుంది. ఆంధ్రుల అన్నపూర్ణగా పేరు పొందారు డొక్కా సీతమ్మ. తూర్పుగోదావరి జిల్లా( East Godavari district) రామచంద్రాపురం మండలం మండపేటలో ఆమె 1841 అక్టోబర్ రెండో వారంలో జన్మించారు. ఆమె తండ్రి అనుపింది భవాని శంకరం, తల్లి నరసమ్మ. సీతమ్మ తండ్రి శంకరంను గ్రామస్తులు బువ్వన్న అనే పేరుతో పిలిచేవాళ్ళు. అడిగిన వారందరికీ ఆయన అన్నం పెట్టేవారు. అన్నం అంటే బువ్వ కాబట్టి.. ఆయనను బువ్వన్నగా పిలిచేవారు. అయితే సీతమ్మ సైతం తండ్రి బాట పట్టింది. ఆకలితో వచ్చే వారికి అన్నం పెట్టేది.
* బాల్యం నుంచే సుగుణం..
బాల్యం నుంచే దాతృత్వ గుణాన్ని అలవరచుకుంది సీతమ్మ. బాల్యంలో సీతమ్మకు ఆమె తల్లిదండ్రులు కథలు, పాటలు, పద్యాలు అన్నింటిని నేర్పించారు. ఆ రోజుల్లో స్త్రీలు విద్య నేర్చుకునే అవకాశాలు చాలా తక్కువ. సీతమ్మ బాల్యంలోనే ఆమె తల్లి నరసమ్మ మరణించారు. దీంతో ఇంటిని చక్కదిద్దే భారం సీతమ్మ పై పడింది. దానిని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరించారు. కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులకు తన దాతృత్వంతో ఆదుకునేవారు. మూడు పూటలా అన్నం పెట్టేవారు. గోదావరి నది తీర ప్రాంతాల్లో లంక గ్రామాలు ఉండేవి. ఆ లంక గ్రామాల ప్రజల కడుపు నింపేవారు సీతమ్మ.
* అలా ఆ దాతృత్వానికి పునాది
గోదావరి తీర( Godavari coastal) ప్రాంతంలో లంక గన్నవరం అనే లంక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో జోగన్న పంతులు అనే పెద్ద ధనవంతుడు ఉండేవారు. ఆయన మంచి వేద పండితుడు కూడా. ఓ రోజు పండిత సభకు వెళ్లి వస్తు మండపేట వచ్చేటప్పటికి ఆలస్యం అయింది. భోజనం చేసే సమయం కావడంతో మంచి ఆకలితో ఉన్నారు. సమయానికి వారికి భవాని శంకరం గుర్తుకు వచ్చారు. వెంటనే దగ్గర్లో ఉన్న భవాని శంకరం ఇంటికి వెళ్లి ఆ పూట వారి ఇంట్లోనే ఆతిథ్యాన్ని స్వీకరించారు. అక్కడే యవ్వనంలో ఉన్న సీతమ్మ చూపించిన గౌరవ మర్యాదలు, వినయ విధేయతలు నచ్చి జోగన్న ఆమెను వివాహం చేసుకున్నారు. అయితే జోక్ అన్న సొంత గ్రామమైన లంక గన్నవరం దారిలో ఉండడం వల్ల చాలామంది ప్రయాణికులు వారి ఇంటి వద్ద భోజనాలు చేసేవారు. ఈ సమయంలో అతిథులు వచ్చినా వారికి అన్నం లేదని చెప్పకుండా.. సకల మర్యాదలు చేయడం ఒక పవిత్ర కార్యంగా ఆ దంపతులు స్వీకరించారు. అలా కొద్ది కాలంలోనే ఉభయగోదావరి జిల్లాలో నిత్య అన్నపూర్ణగా సీతమ్మ పేరు పొందారు. అప్పట్లో లంక గ్రామాలు తరచూ వరదల్లో చిక్కుకునేవి. ఆ సమయంలో డొక్కా సీతమ్మ తన సొంత వనరులతో, నిధులతో బాధితులకు అండగా నిలిచేవారు. వారికి మూడు పూటలా అన్నం పెట్టేవారు. అలా ఆమె కీర్తి నలు దిశలా వ్యాపించింది.
* బ్రిటిష్ చక్రవర్తి ఫిదా..
డొక్కా సీతమ్మ గొప్పతనం తెలుసుకొని బ్రిటిష్ చక్రవర్తి( British Empire) ఫిదా అయ్యారు. ఏడవ ఎడ్వర్డ్ చక్రవర్తి తన పట్టాభి షేకం వార్షికోత్సవానికి 1903లో ఆమెకు ప్రత్యేక ఆహ్వానం పంపారు. అయితే తాను రాలేనని.. క్షమించాలని సీతమ్మ కోరినట్లు సమాచారం. అయితే అప్పట్లో కనీసం ఫోటో అయినా పంపించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు చక్రవర్తి కోరినట్లు ఇప్పటికీ ప్రచారంలో ఉంది. అన్నదానానికి మించిన దానం లేదని దాతృత్వాన్ని చాటి చెప్పిన సీతమ్మ 1908లో మృతి చెందారు. మరుగున పడుతున్న ఇలాంటి ఆణిముత్యాలు చరిత్రను సినిమాగా తీసుకురావడం నిజంగా శుభపరిణామం. అయితే సీనియర్ హీరోయిన్ ఆమని డొక్కా సీతమ్మ పాత్రధారిగా నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ ఇటీవల రిలీజ్ చేశారు. మొత్తానికి అయితే డొక్కా సీతమ్మ బయోపిక్ తో ఆమె ప్రపంచానికి మరింత సుపరిచితురాలు అవుతారు. కొత్త జనరేషన్ కు ఆమె చరిత్ర పరిచయం అవుతుంది.