Saif Ali Khan : ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆయన పై కత్తితో ఆరు సార్లు దాడి చేసి పారిపోయారు. ఇంట్లో దొంగతనం కోసం వచ్చిన దుండగులను అడ్డుకునేందుకు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోని పని మనిషి ముందుకొచ్చింది. ఆమెపై దాడి చేస్తుండగా, ఆమె పెద్దగా అరవడంతో సైఫ్ అలీ ఖాన్ ఆ అరుపులను విని బయటకి వచ్చాడు. నిందితులను పట్టుకోడడానికి ప్రయత్నం చేయగా, వాళ్ళు అత్యంత దారుణంగా సైఫ్ అలీ ఖాన్ పై ఆరు సార్లు దాడి చేసారు. దీంతో సైఫ్ ని వెంటనే లీలావతి హాస్పిటల్ కి తరలించారు కుటుంబ సభ్యులు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి అభిమానులు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా లీలావతి హాస్పిటల్ సిబ్బంది సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పై ఒక బులిటెన్ ని విడుదల చేసారు.
సైఫ్ అలీ ఖాన్ వెన్నులో చిక్కుకున్న కత్తిని ఆపరేషన్ చేసి తొలగించామని, వెన్ను భాగం నుండి విపరీతంగా కారుతున్న రక్తాన్ని కూడా అదుపు చేశామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు 7 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పలు ఆధారాలను సేకరించరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. పని మనిషి పై కూడా దాడి జరగడంతో ఆమె కూడా చికిత్స పొందుతుంది. ఆమె మేలుకున్న తర్వాత పోలీసులు ఆమెని కూడా విచారించనున్నారు. మొదటి నుండి అసలు ఏమి జరిగిందో కేవలం ఆమె మాత్రమే చూసింది. మరో పక్క సైఫ్ అలీ ఖాన్ కి ఇలా జరగడం పై టాలీవుడ్ సెలెబ్రిటీలు తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి వంటి వారు కాసేపటి క్రితమే ట్విట్టర్ లో సంగీభావం వ్యక్తం చేసారు.
జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి సైఫ్ అలీ ఖాన్ గత ఏడాది ‘దేవర’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తెలుగు ఆడియన్స్ కి సైఫ్ అలీ ఖాన్ ని బాగా దగ్గర చేసింది. ఈ చిత్రానికి ముందు ఆయన ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రం లో రావణ్ క్యారక్టర్ చేసాడు. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరో గా ఒక వెలుగు వెలిగిన సైఫ్ అలీ ఖాన్, ఇప్పుడు విలన్ క్యారెక్టర్స్ తో పాటు ముఖ్య పాత్రలు పోషిస్తూ మంచి ట్రెండింగ్ లో ఉన్నాడు. ఆయన కూతురు సరా అలీ ఖాన్ బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అదే విధంగా కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ కూడా త్వరలోనే హీరోగా వెండితెర అరంగేట్రం చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది.