Shri Tej’s health : సంధ్య థియేటర్ ఘటనలో రేవతి అనే అమ్మాయి చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. గత 18 రోజుల నుండి శ్రీతేజ్ కిమ్స్ హాస్పిటల్ లో వైద్యం అందుకుంటున్నాడు. శ్రీతేజ్ కి పాతిక లక్షల రూపాయిలను విరాళంగా ప్రకటించిన అల్లు అర్జున్ ఇప్పటి వరకు 10 లక్షల రూపాయిలు అందించాడని, ప్రభుత్వం తరుపున వైద్యం అందుతుందని శ్రీతేజ్ తండ్రి భార్గవ్ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ ఈ ఘటన వ్యవహారం లో అరెస్ట్ అయ్యి, ఆ తర్వాత బెయిల్ మీద విడుదలై ఎలాంటి పరిణామాలను ఎదురుకుంటున్నాడో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. నేడు కూడా ఆయన పోలీస్ విచారణ కోసం చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చింది. పోలీసులు సుమారుగా మూడు గంటల పాటు అల్లు అర్జున్ ని విచారించి పంపారు.
ఈ వ్యవహారం పై అల్లు అర్జున్ అభిమానులు ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అని భయంతో ఉంటున్నారు. ఇలాంటి సమయంలో వాళ్లకు ఇప్పుడు శుభవార్త కాస్త ఉపశమనం కలిగిస్తుంది. శ్రీ తేజ్ ఆరోగ్యం ఇప్పుడు చాలా వరకు మెరుగుపడిందని వైద్యులు కాసేపటి క్రితమే ఒక బులిటెన్ ని విడుదల చేసారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అతనికి వెంటిలేటర్ సహాయాన్ని పూర్తిగా తొలగించి, ఆక్సిజన్ ని కూడా తీసేశామని ఈ సందర్భంగా డాక్టర్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు శ్రీతేజ్ శరీర ఉష్ణోగ్రత సాధారణమైన స్థితికి వచ్చిందని, ఆహారాన్ని ప్రస్తుతం పైప్ ద్వారా అందిస్తున్నామని డాక్టర్లు చెప్పుకొచ్చారు. తలకు అయినటువంటి గాయం కాస్త ఆందోళన కరంగా ఉన్నప్పటికీ శ్రీతేజ్ వైద్యానికి సహకరిస్తున్నాడని, త్వరలోనే అతను పూర్తి స్థాయిలో కోలుకునే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. శ్రీతేజ్ కి జ్వరం కూడా తగ్గుముఖం పట్టిందని, అతని శరీరం లోని తెల్ల రక్త కణాలు పెరుగుతున్నాయని, ఇవి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడుతాయని చెప్పుకొచ్చారు.
ఇది ఇలా ఉండగా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి పై ఇప్పుడు ఇండస్ట్రీ నుండి ఒక్కొక్కరుగా కిమ్స్ హాస్పిటల్ కి వెళ్తూ ఆరాలు తీస్తున్న సంగతి తెలిసిందే. అందరి కంటే ముందుగా జగపతి బాబు హాస్పిటల్ కి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధినేత నవీన్ నిన్న శ్రీ తేజ్ ని కలిసి 50 లక్షల రూపాయిల చెక్ ని అతని తండ్రి భార్గవ్ కి అందచేసాడు. నేడు దిల్ రాజు కూడా కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీసాడు. అధైర్యపడొద్దని, ఏ కష్టమొచ్చినా మేమంతా అండగా ఉన్నామంటూ దిల్ రాజు శ్రీ తేజ్ తండ్రి కి ధైర్యం చెప్పి వచ్చాడు. అదే విధంగా ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ కూడా శ్రీతేజ్ కి అండగా ఉంటామంటూ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.