Mahesh Movie Villain: కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనేది పెద్దోళ్ళు చెప్పిన మాట. లక్ష్యం చేరుకోవాలనే పట్టుదల ఉంటే సామాన్యులు కూడా స్టార్స్ అయిపోతారు. ఎయిర్ కండీషనర్స్ రిపేర్ చేసుకునే ఓ కుర్రాడు స్టార్ హీరో కావాలి అనుకున్నాడు. ఆ దిశగా ప్రయత్నం చేశాడు. స్టార్ హీరో కాకపోయినా గ్రేట్ యాక్టర్ అయ్యాడు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అనేక భాషల్లో నటించాడు. ఆయన ఎవరో కాదు ఇర్ఫాన్ ఖాన్. రాజస్థాన్ కి చెందిన ఇర్ఫాన్ ఖాన్ నటన వైపు అడుగులు వేశాడు. ఇర్ఫాన్ అంకుల్ థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో ఈయనకు కూడా నటన పట్ల మక్కువ పెరిగింది.
నాటకాలు ఆడటం ప్రారంభించాడు. జైపూర్ లో డిగ్రీ పూర్తి అయ్యాక ఢిల్లీలో గల నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో జాయిన్ అయ్యాడు. నటనలో శిక్షణ తీసుకున్నాడు. ముంబై వెళ్లిన ఇర్ఫాన్ ఖాన్ కుటుంబ పోషణ కోసం ఎయిర్ కండీషనర్స్ మెకానిక్ గా జీవనం సాగించాడు. రాజేష్ ఖన్నా స్టార్డం చూసి ఫిదా అయిన ఇర్ఫాన్ ఖాన్ స్టార్ హీరో కావాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. సలామ్ బాంబే చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు.
2001లో విడుదలైన వారియర్ మూవీలో ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్ర చేశాడు. అది ఆయనకు బ్రేక్ ఇచ్చిన చిత్రం. 2012లో విడుదలైన పాన్ సింగ్ తోమర్ చిత్రానికి గాను ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అందుకున్నాడు. ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్, జురాసిక్ వరల్డ్, లైఫ్ ఆఫ్ ఫై వంటి హాలీవుడ్ చిత్రాల్లో ఆయన నటించారు. లైఫ్ ఆఫ్ ఫై చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర చేశారు. ఇర్ఫాన్ నటించిన లైఫ్ ఆఫ్ పై, స్లమ్ డాగ్ మిలియనీర్ అనేక విభాగాల్లో ఆస్కార్స్ కొల్లగొట్టాయి.
ఇర్ఫాన్ ఖాన్ నటించిన ఒకే ఒక తెలుగు చిత్రం సైనికుడు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ మూవీలో ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన విలన్ పాత్ర చేశాడు. త్రిష హీరోయిన్ గా నటించింది. అరుదైన క్యాన్సర్ బారిన పడిన ఇర్ఫాన్ ఖాన్ 2020 ఏప్రిల్ 29న కన్నుమూశాడు. అప్పటికి ఆయన వయసు 53 ఏళ్ళు మాత్రమే. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో మరణించిన నేపథ్యంలో ఇర్ఫాన్ అంత్యక్రియలు నిరాడంబరంగా ముగిశాయి.