Director Shankar: డైరెక్టర్ శంకర్ తో మూవీ చేయాలని ప్రతి హీరో కోరుకుంటాడు. ఆయన ఒక్కో సినిమా ఒక మాస్టర్ పీస్. జెంటిల్ మెన్ తో మొదలైన ఆయన ప్రస్థానం… ఘనంగా సాగింది. ప్రేమికుడు, భారతీయుడు, ఒకే ఒక్కడు, జీన్స్, బాయ్స్, అపరిచితుడు, రోబో, 2.0 బాక్సాఫీస్ షేక్ చేశాయి. ఆయన ప్రతి సినిమాలో సామాజిక కోణం ఉంటుంది. వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన ఒక బర్నింగ్ టాపిక్ ని శంకర్ ఎంచుకుంటారు. కమర్షియల్ అంశాలు జోడించి సామాజిక సందేశంతో కూడిన సినిమాలు చేయడంలో ఆయన దిట్ట.
ఇండియన్ సినిమాకు రాజమౌళి కంటే ముందే ఆయన భారీ తనం నేర్పాడు. అత్యాధునిక సాంకేతికత, విజువల్ ఎఫెక్ట్స్ పరిచయం చేశాడు. అయితే శంకర్ ఇతర పరిశ్రమల హీరోలతో సినిమాలు పెద్దగా చేయలేదు. ఒకే ఒక్కడు మూవీని నాయక్ పేరుతో హిందీలో రీమేక్ చేశాడు. ఈ మూవీలో అనిల్ కపూర్ హీరో. శంకర్ పని చేసిన నాన్ తమిళ్ హీరో అనిల్ కపూర్ మాత్రమే. తమిళులకు భాషాభిమానం, ప్రాంతీయాభిమానం చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆయన పరభాషా హీరోలతో చిత్రాలు చేసేందుకు ఇష్టపడలేదు, అనే వాదన ఉంది.
దీనిపై ఆయన ఒకింత స్పష్టత ఇచ్చారు. యూఎస్ లో తెలుగు వారు అధికంగా ఉండే డల్లాస్ వేదికగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి సుకుమార్ అతిథిగా హాజరయ్యారు. డల్లాస్ ఈవెంట్లో శంకర్ మాట్లాడుతూ… నేను ఒక్కడు, పోకిరి వంటి మాస్ కమర్షియల్ సినిమాలు చేయాలని అనుకున్నాను. చిరంజీవి గారితో మూవీ చేయాలని చాలా ప్రయత్నం చేశాను. అది కుదర్లేదు. అలాగే మహేష్ బాబుతో మూవీ చేయాలని అనుకున్నాను. ప్రభాస్ తో అయితే కరోనా సమయంలో చర్చలు జరిగాయి. కానీ మూవీ కార్యరూపం దాల్చలేదు.
రామ్ చరణ్ తో నేను మూవీ చేయాలని రాసి పెట్టి ఉంది. గేమ్ ఛేంజర్… ఒక ప్రభుత్వ అధికారికి రాజకీయ నాయకుడికి మధ్య నడిచే సంఘర్షణ. సినిమా చాలా బాగుంటుంది. గొప్ప సాంకేతికత, అద్భుతమైన సెట్స్ వాడాము. సునీల్, ఎస్ జె సూర్య, కియారా అద్వానీతో పాటు అందరూ చాలా బాగా నటించారని, అన్నారు. కాగా గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల అవుతుంది. దిల్ రాజు నిర్మిస్తుండగా, థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.