Prabhas- Krishnam Raju: కెరీర్ లో కృష్ణంరాజు అనేక మల్టీస్టారర్స్ చేశారు. పలువురు స్టార్స్ కి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. అయితే కొడుకు ప్రభాస్ విషయంలో మాత్రం ఆయన ఫెయిల్ అయ్యారు. ప్రభాస్-కృష్ణంరాజు కాంబినేషన్ లో వచ్చిన మూడు చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. కృష్ణంరాజు అబ్బాయి ప్రభాస్ చిత్రాల్లో నటించాలని చాలా ఇష్టపడేవారు. ఫ్యాన్స్ సైతం ఈ కాంబినేషన్ కోరుకునేవారు.అలనాటి రెబల్ స్టార్ నేటి యంగ్ రెబల్ స్టార్ తో నటించాలని ఆశపడేవారు. అభిమానులు కోరుకున్నట్లు మూడు సార్లు ప్రభాస్, కృష్ణంరాజు కలిసి నటించారు. కానీ ఫ్యాన్స్ కి చేదు అనుభవాలు మిగిల్చాయి. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రాలేవో చూద్దాం.

2009లో విడుదలైన బిల్లా చిత్రంలో వీరిద్దరూ మొదటిసారి కలిసి కనిపించారు. ప్రభాస్ మాఫియా డాన్, పిక్ పాకెటర్ గా రెండు విభిన్నమైన పాత్రలు చేశారు. కృష్ణంరాజు బిల్లాను వెంటాడే ఇంటర్ పోల్ ఆఫీసర్ రోల్ చేశారు. ఈ సినిమా కమర్షియల్ గా నిరాశపరిచింది. కానీ ప్రభాస్ కి ఇమేజ్ తెచ్చిపెట్టడంతో పాటు ఆయన కెరీర్ లో మోస్ట్ స్టైలిష్ మూవీగా నిలిచిపోయింది. బిల్లాగా ప్రభాస్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
బిల్లా విడుదలైన మూడేళ్లకు 2012లో ప్రభాస్-కృష్ణంరాజు రెబల్ చిత్రంలో కలిసి నటించారు. రాఘవ లారెన్స్ తెరకెక్కించిన ఈ రివేంజ్ యాక్షన్ డ్రామా ప్లాప్ అయ్యింది. యాక్షన్ సన్నివేశాలతో పాటు ప్రభాస్ స్టైల్, మేనరిజంకి మంచి మార్కులు పడ్డాయి. కృష్ణంరాజు మాఫియా లీడర్ గా సరికొత్త లుక్ ట్రై చేశారు. ప్రభాస్ నాన్నగా కృష్ణంరాజు నటించారు. కథ, స్క్రీన్ ప్లే విషయంలో ఫెయిల్ అయిన రెబల్ ప్లాప్ గా మిగిలిపోయింది.

ముచ్చటగా మూడోసారి రాధే శ్యామ్ చేశారు. కృష్ణంరాజు చివరి చిత్రం ఇదే కావడం విశేషం. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన రాధే శ్యామ్ లో ప్రభాస్ గురువు పరమహంసగా కృష్ణంరాజు కనిపించారు. కేవలం తెలుగు వర్షన్ లో కృష్ణంరాజు చేశారు. మిగతా భాషల్లో సత్యరాజ్ చేయడం జరిగింది. ప్రభాస్ కెరీర్ లో రాధే శ్యామ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. భారీ నష్టాలు మిగిల్చిన ఈ మూవీ ప్రభాస్ కి షాక్ ఇచ్చింది. పెదనాన్న కృష్ణంరాజు సెంటిమెంట్ ప్రభాస్ కి కలిసి రాలేదు. ఇతర హీరోలకు హిట్స్ ఇచ్చిన కృష్ణంరాజు అబ్బాయికి మాత్రం డిజాస్టర్స్ ఇచ్చారు.