Dil Raju: పట్టుదల కృషి ఉంటే ఏ రంగంలో అయినా రాణించొచ్చని చెప్పడానికి నిర్మాత దిల్ రాజునే నిదర్శనం. చిత్ర పరిశ్రమలో సక్సెస్ కావడమంత ఈజీ కాదు. డిస్ట్రిబ్యూషన్, నిర్మాణం చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారాలు. ఒకరకంగా చెప్పాలంటే జూదం. పది సినిమాల్లో వచ్చిన డబ్బు ఒక్క మూవీతో పోవచ్చు. పెద్ద పెద్దోళ్లే దివాళా తీసిన రంగం ఇది. అలాంటి చోట దిల్ రాజు తనకంటూ ఓ సామ్రాజ్యం నిర్మించుకున్నాడు. సినిమా వరకు ఆయన నైజాం కింగ్. ఆ ఏరియాలో చిత్రాల ఫేట్ నిర్ణయించగల కింగ్ మేకర్.

పెద్దగా చదువుకోని దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ కొట్టి నిర్మాణం వైపు వెళ్లి, స్టార్ ప్రొడ్యూసర్ అయ్యాడు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ తో సినిమాలు చేసే రేంజ్ కి ఎదిగాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో సినిమా అంటే బాగుంటుంది, హిట్ కొడుతుంది అనే ఓ గుడ్ విల్ తెచ్చుకున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన దిల్ రాజు సాధించాల్సింది ఇంకేముంది అనుకుంటే పొరపాటే, జీవితంలో మనిషి సాధించాల్సిన చాలా ఉన్నాయి.
ఈ క్రమంలో దిల్ రాజు పాలిటిక్స్ లో అడుగుపెట్టనున్నారట. వచ్చే తెలంగాణా ఎన్నికల్లో తన సొంతూరు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ స్థానం నుండి దిల్ రాజు పోటీపడనున్నాడట. వ2023లో తెలంగాణాలో ఎన్నికలు నేపథ్యంలో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టాడట. అక్కడ సర్వేలు నిర్వహిస్తూ, తన గెలుపోటములపై లెక్కలు వేస్తున్నాడట. దిల్ రాజుకు ఆ ప్రాంతంలో మంచి పేరుంది. ఆయన సొంత డబ్బులతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. అలాగే ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి సామాజిక సేవ చేస్తున్నారు. ఈ క్రమంలో పొలిటికల్ గా కూడా సక్సెస్ అవుతాననే విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడట.

అయితే దిల్ రాజు ఏ పార్టీ నుండి పోటీ చేస్తాడనేది సస్పెన్సు. ఆయనకు అధికార టీఆర్ఎస్ తో మంచి సంబంధాలున్నాయి. అయితే ఆ పార్టీలో టికెట్ కోసం తీవ్ర పోటీ ఉంటుంది. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ సైతం బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ కి పోటీ ఇస్తూ తెలంగాణాలో బీజేపీ ఎప్పుడూ లేనంతగా పుంజుకుంది. కాబట్టి దిల్ రాజు ఈ మూడు పార్టీల్లో ఎవరి తరపున పోటీ చేస్తాడనేది తెలియాల్సి ఉంది. మూడు పార్టీలతో సంప్రదించి తనకు టికెట్ ఇచ్చిన పార్టీ తరపున పోటీ చేసే అవకాశం లేకపోలేదు. దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ పై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ.. ఈ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: F3 Movie Team: కోట్ల రూపాయిల డీల్ ని మిస్ చేసుకున్న F3 మూవీ టీం