
RGV : రామ్ గోపాల్ వర్మకు ఏం తెలుసు? ఈ ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతారు. కానీ.. వాస్తవం ఏమంటే.. మనస్తత్వ శాస్త్రం ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని చెప్పొచ్చు. ఒక వేళ తెలిసినా.. ఆర్జీవీ వాడినంతగా మరెవ్వరూ వాడరని మాత్రం ఘంటాపథంగా చెప్పొచ్చు. ఏ కామెంట్ చేస్తే.. జనాలు అలర్ట్ అవుతారు? ఏ ఫొటో వదిలితే.. నెటిజన్స్ రియాక్ట్ అవుతారు? అన్నది రామ్ గోపాల్ వర్మకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో?
ఓ ట్వీట్ చేసినా.. వీడియో వదిలినా.. అసలు ఆర్జీవీ ఏం చేసినా.. అది వార్త అయ్యి తీరుతుంది. నిజానికి ఆర్జీవీని తిట్టేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆయనో పిచ్చివాడని కూడా మెజారిటీ జనాల అభిప్రాయం. మరి, అలాంటి వ్యక్తి మాటలను ఈ సమాజం ఎందుకు పట్టించుకుంటుంది? ఆయన మాటల్లో ‘విషయం’ లేకపోతే..? చర్చ ఎందుకు జరుగుతుంది? వార్తలు ఎందుకు పుట్టుకొస్తాయి? అన్నది ఆయన అభిమానుల ప్రశ్న.
రామ్ గోపాల్ వర్మ చేసే ప్రతీ ట్వీట్ కు.. మాట్లాడే ప్రతీ మాటకు ఖచ్చితంగా మీనింగ్ ఉంటుంది. ఒకసారి జనాలను తనవైపు తిప్పుకోవడానికి.. మరోసారి హాస్యాన్ని పండించడానికి.. ఇంకోసారి తనలోని హ్యూమన్ యాంగిల్ ను బయటపెట్టడానికి.. ఇలా సందర్భాన్ని బట్టి వర్మ బిహేవ్ చేస్తుంటాడు. ఇలా పలు విధాలుగా ప్రవర్తించడం ద్వారా.. తాను ఏ చట్రంలోనూ ఇరుక్కోకుండా.. తనకు ఇష్టం వచ్చినట్టుగా.. ఫ్లెక్సిబిల్ గా ఉండేలా చూసుకుంటాడు.
అల్టిమేట్ గా తనకు నచ్చినట్టు బతుకుతానని చెప్పే వర్మ.. జనాల అటెన్షన్ ను తీసుకోకుండా మాత్రం ఉండలేడు. జనాల మధ్య బతుకుతున్నాడు కదా మరి! తన మాటలకు జనాలు రియాక్ట్ అయ్యే విధానం ద్వారా ఆనందం పొందుతుంటాడు. సంస్కృతి, సంప్రదాయాల మాటున బతికే జనాలను.. తన రొమాన్స్ ద్వారా.. శృంగారంపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయడం ద్వారా.. తనవైపు దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తాడు. కుటుంబ బంధాలు.. సామాజిక సంబంధాల సాలెగూడులో.. తాను చిక్కుకోను అని చెప్పడం ద్వారా.. తనకు తాను స్వేచ్ఛ కల్పించుకుంటాడు వర్మ. సొసైటీ విధించే బంధనాలను తెంచేసుకుంటాడు.
ఇక.. ఆడ, మగ మధ్య రిలేషన్ గురించే, శృంగార సంబంధ విషయాల గురించే వర్మ ఎందుకు ఫోకస్ చేస్తాడంటే.. అలాంటి విషయాలను గుప్పిట దాచే సమాజం మనది. సెక్స్ అనే మాటను మాట్లాడడమే తప్పుగా, పాపంగా భావించే దేశం మనది. కాబట్టి.. ఆ ఒక్క మాట మాట్లాడితే.. దేశం మొత్తం తనవైపు చూస్తుందని వర్మకు బాగా తెలుసు. అందుకే.. మెజారిటీగా ఇలాంటి విషయాలపై ఫోకస్ చేస్తాడు. అమ్మాయిలతో ఫొటోలు దిగినా.. డ్యాన్సులు చేసినా.. రొమాన్స్ చేసినా.. కారణం ఇదే.
‘శివ’ తీసిన దర్శకుడు కనిపించట్లేదని చెప్పినా.. ‘సత్య’ తీసిన వర్మ అగుపించట్లేదన్నా.. రంగీలా తీసిన ఆర్జీవీ కనుమరుగైపోయాడన్నా.. ఆయన పట్టించుకోడు. కాదు..కాదు.. పట్టించుకోనట్టుగా నటిస్తాడు. ఎందుకంటే.. సీరియస్ గా తీసుకుంటే.. దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పాలంటే.. ఖచ్చితంగా మరో ‘శివ’ తీయాల్సి ఉంటుంది. అది సాధ్యం కాకపోవచ్చు. అప్పుడు.. అనివార్యంగా తీవ్రమైన ఒత్తిడికి గురవ్వాల్సి వస్తుంది. అందుకే.. లైట్ తీసుకున్నట్టుగా నటిస్తాడు. అతను గొప్ప దర్శకుడే కాదు.. అంతకు మించిన నటుడు కూడా.
అంతిమంగా.. ఎలాంటి రెస్పాన్సిబిలిటీల్లో చిక్కుకోకుండా.. తనకు నచ్చినట్టు బతుకుతూ.. జనాలను అట్రాక్ట్ చేస్తూ.. వార్తల్లో ఉండడమే వర్మకు బాగా కిక్కిస్తుంది. దానికి షార్ట్ కట్ అమ్మాయిలతో రొమాన్స్. అది వర్మకు మాత్రమే కాదు.. ఆ వచ్చే అమ్మాయిలకు కూడా ఫేమ్ తెచ్చి పెడుతుంది. వర్మకు ఆరుపదుల వయసు వచ్చినా.. ఆయనతో డ్యాన్స్ కట్టేందుకు, రొమాన్స్ చేసేందుకు అమ్మాయిలు క్యూ కట్టేది ఇందుకే! అరియానా అయినా అంతే.. అషూ రెడ్డి అయినా అంతే.. లేటెస్ట్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సోనియా వర్మ, మరో బ్యూటీ అయినా ఇంతే.
వర్మ తత్వం ఇదీ అని తెలియనివాళ్లే.. ఆయన చేసే ట్వీట్ కు స్పందిస్తారు. ఇంటర్వ్యూను ఎగబడి చూస్తారు. నచ్చని వాళ్లు తిట్టేస్తారు. నచ్చినవాళ్లు పొగిడేస్తారు. కొందరు పిచ్చివాడంటారు. మరికొందరు జీనియస్ అంటారు. జనాలు ఏదో ఒకటి అనుకుంటేనే కదా.. వర్మ తీసిన సినిమా అయినా.. మరొకటైనా చర్చలోకి వస్తుంది? అందుకే.. ఆర్జీవీ రచ్చ చేయడు. జనాలనే చర్చలోకి దింపుతాడు. తన గురించి, తన పని గురించి మాట్లాడుకునేట్టు చేస్తాడు. ఆ తర్వాత తన పనికి సంబంధించి ఎంత రేటింగ్ పెరిగిందో లెక్కేసుకుంటూ కూర్చుంటాడు. దటీజ్ ఆర్జీవీ.