Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ఇంట్లో గత నాలుగు రోజులుగా ఐటీ అధికారులు చేసిన సోదాల గురించి కాసేపటి క్రితమే ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి మాట్లాడాడు. దిల్ రాజు ఇంట్లో అక్రమంగా కొన్ని ఆస్తులు దొరికాయని, వాటిని ఐటీ అధికారులు సీజ్ చేసి, దిల్ రాజు ని ఈడీ ఆఫీస్ కి తీసుకెళ్లి నిర్బంధించారని నిన్న మీడియా మొత్తం ఒక వార్త తెగ షికారు చేసింది. ఈ వార్తలన్నిటికీ చెక్ పెడుతూ దిల్ రాజు ఈ ప్రెస్ మీట్ లో అసలు జరిగిన వాస్తవం ఏమిటో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ నిన్న మీడియా మొత్తం నా ఆస్తులు సీజ్ చేసినట్టు తెగ ప్రచారం చేసింది. మీకు ఎప్పుడూ సేసెన్షన్ కావలి కాబట్టి ఇలాంటివి రాస్తుంటారు. ఐటీ అధికారులు మా ఇంట్లో సోదాలు నిర్వహించి, మా నిజాయితీని చూసి ఆశ్చర్యపోయారు’ అంటూ చెప్పుకొచ్చాడు.
‘దిల్ రాజు అంటే చాలా పెద్దోడు..అయన దగ్గర ఉండే లెక్కల్లో చాలా బొక్కలు ఉండొచ్చు అని చాలా మంది అనుకున్నారు. కానీ నా ఇంట్లో, నా సోదరుడు ఇంట్లో, నా కూతురు ఇంట్లో, అదే విధంగా మా ఆఫీస్ లో కలిపి 20 లక్షలు మాత్రమే వాళ్లకు దొరికింది. మిగతా మొత్తం లెక్కలకు మా దగ్గర డాక్యూమెంటల్ ప్రూఫ్స్ ఉన్నాయి. మా భార్య నగలతో సహా లెక్కాపత్రాలు ఉన్నాయి’ అంటూ డాకుమెంట్స్ తో సహా మీడియా ముందుకొచ్చి చూపించాడు దిల్ రాజు. ప్రభుత్వం మీపై కావాలని టార్గెట్ చేసిందని బయట అందరూ అనుకుంటున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి అని ఒక రిపోర్టర్ అడగ్గా, దానికి దిల్ రాజు సమాధానం చెప్తూ’ఇలాంటివన్నీ కావాలని క్రియేట్ చేసినవి. వాళ్ళు నా ఒక్కడిపైనే సోదాలు నిర్వహించి ఉండుంటే మీరు చెప్పేది కరెక్ట్ అయ్యేది. కానీ మైత్రీ మూవీ మేకర్స్ మీద చేసారు, అభిషేక్ అగర్వాల్ వంటి వారిపై కూడా చేసారు కదా’ అంటూ సమాధానం ఇచ్చాడు.
‘మా సినీ ఇండస్ట్రీ పై ఐటీ రైడింగ్స్ జరిగి 18 ఏళ్ళు దాటింది..కచ్చితంగా ఎదో ఒకరోజు సోదాలు నిర్వహించాలి కదా, అది ఇప్పుడు జరిగింది. నాపై 2008 వ సంవత్సరం లో జరిగింది. మళ్ళీ ఇన్నాళ్లకు ఇప్పుడు జరిగింది’ అంటూ చెప్పుకొచ్చాడు దిల్ రాజు. ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తో మా సంస్థ హిట్స్ కొట్టడం ప్రారంభించింది. ఇక ఈ ఏడాది కొడుతూనే ఉంటాం, మా టైం మొదలైంది అంటూ చెప్పుకొచ్చాడు దిల్ రాజు. ‘గేమ్ చేంజర్’ చిత్రం పై కనీసం మాటవరుసకి కూడా ఆయన మాట్లాడలేదు. సినిమా థియేటర్స్ లో నడుస్తున్న సమయంలో నిర్మాతనే తమ సినిమాకి టాక్ లేదు, పెద్దగా ఆడలేదు అని పరోక్షంగా జనాలకు చెప్పినట్టు అయ్యింది పరిస్థితి. ఇంతటి దయనీయమైన స్థితి ఈ సినిమాకి దక్కుతుందని ఎవ్వరూ అనుకోలేదు.