https://oktelugu.com/

Tollywood : అంతా దిల్ రాజు చేతిలోనే, సీఎంతో చర్చలకు మెగా ఫ్యామిలీ దూరం?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయాలు టాలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు రేపాయి. భారీ బడ్జెట్ చిత్రాలు పెద్ద మొత్తంలో నష్టపోయానున్నాయి. సంక్రాంతికి రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ చిత్రాల నిర్మాతలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మీటింగ్ దిల్ రాజు నేతృత్వంలో జరగనుందట. మెగా ఫ్యామిలీ ఈ మీటింగ్ కి దూరంగా ఉండనుందట.

Written By:
  • S Reddy
  • , Updated On : December 25, 2024 / 02:07 PM IST

    Dil Raju

    Follow us on

    Tollywood :  సంధ్య థియేటర్ ఘటన టాలీవుడ్ పై ప్రతికూల ప్రభావం చూపింది. మహిళ మృతి నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇకపై తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ షోలకు అనుమతులు ఇచ్చేది లేదు. టికెట్స్ ధరల పెంపు కూడా ఉండదని తేల్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన టాలీవుడ్ పెద్దల్లో గుబులు రేపింది. రేవంత్ రెడ్డి నిర్ణయం వలన మొదటగా నష్టపోయేది దిల్ రాజు. ఆయన నిర్మించిన రెండు సినిమాలు సంక్రాంతికి విడుదలవుతున్నాయి.

    రామ్ చరణ్-శంకర్ కాంబోలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ జనవరి 10న విడుదల కానుంది. ఈ మూవీ బడ్జెట్ రూ. 250-300 కోట్లు. షూటింగ్ ఆలస్యం కావడంతో అనుకున్న బడ్జెట్ కంటే వ్యయం పెరిగింది. గేమ్ ఛేంజర్ భారీ ఓపెనింగ్స్ రాబట్టాలి. ఇక టికెట్స్ ధరల పెంపు, బెనిఫిట్ షోల ప్రదర్శన గేమ్ ఛేంజర్ కి చాలా అవసరం. పుష్ప 2 మూవీ ప్రీమియర్స్ విడుదలకు ముందు రోజే రాత్రి పడ్డాయి. అలాగే పెద్ద మొత్తంలో టికెట్స్ హైక్ ఇచ్చారు.

    ఇది పుష్ప 2 ఓపెనింగ్స్ కి ఎంతగానో ఉపయోగపడింది. పుష్ప 2 వరల్డ్ వైడ్ ఫస్ట్ డే రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. దిల్ రాజు నిర్మించిన మరొక చిత్రం సంక్రాంతికి వస్తున్నాం సైతం సంక్రాంతికి విడుదల అవుతుంది. అందుకే దిల్ రాజు వీలైనంత త్వరగా సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరపాలని భావిస్తున్నారు. సాధారణంగా పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా చిరంజీవి ముందుంటారు. ఆయన నేతృత్వంలో ప్రభుత్వ పెద్దలను కలుస్తారు. కానీ ఈ మీటింగ్ కి మెగా హీరోలు దూరంగా ఉంటారట.

    దిల్ రాజు సీఎంని కలవబోయే ముందు మాత్రం కొందరు టాలీవుడ్ పెద్దలు ఆయనతో భేటీ కానున్నారట. దిల్ రాజుకు కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డిని చల్ల బరచగలడు అని కొందరు భావిస్తున్నారు. మేటర్ ఇంత సీరియస్ అయిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తగ్గుతారా అనే సందేహం కలుగుతుంది. సంధ్య థియేటర్ మహిళ మృతి కేసు అల్లు అర్జున్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు తయారైంది. అల్లు అర్జున్ పై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.