Dil Raju: సంక్రాంతి సమీపిస్తోంది. అంతటా పండగ వాతావరణం ప్రారంభం అయ్యింది. అదే సమయంలో సినిమాల విడుదలకు రంగం సిద్ధమయ్యింది. సంక్రాంతి బరిలో సరికొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు విడుదల ముంగిట ఉన్నాయి. అయితే తెలంగాణలో ఇటీవల జరిగిన పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. సినిమా టిక్కెట్ల ధర పెంపు, ప్రీమియం షోల ప్రదర్శన విషయంలో తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పింది. ఈ తరుణంలో సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కానీ పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. ఈ తరుణంలో దిల్ రాజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశం కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మెగాస్టార్ చిరంజీవి సూచనతోనే దిల్ రాజు పవన్ కళ్యాణ్ ను కలవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
* ఏపీలో సానుకూల నిర్ణయాలు
అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్ర పరిశ్రమ విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. టికెట్ల ధర పెంపుతో పాటు ప్రీమియం షోల ప్రదర్శన విషయంలో ఎటువంటి ఆంక్షలు విధించడం లేదు. ఆ చిత్ర యూనిట్లు చేసిన విజ్ఞప్తి మేరకు టికెట్లు ధర పెంచుకునేందుకు నిర్ణిత సమయం కూడా ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం ఇదే మాదిరిగా అనుకూలంగా వ్యవహరించింది. కానీ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం విడుదల తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ బాధ్యుడిని చేస్తూ తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది సినీ ప్రముఖులు మాట్లాడారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి మాత్రమే తాము చేయూతనందిస్తామని.. టికెట్ల ధర పెంపు, ప్రీమియం షోల ప్రదర్శన విషయంలో కఠినంగా ఉంటామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఆయనను చిత్ర పరిశ్రమ ప్రముఖులు కలిసినా.. ఆ నిర్ణయాల్లో మార్పులు లేకుండా పోయాయి. ఇటువంటి తరుణంలో దిల్ రాజు పవన్ కళ్యాణ్ ను కలవనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
* చిరంజీవి సూచనతోనే
అయితే మెగాస్టార్ సూచన మేరకు పవన్ కళ్యాణ్ ను దిల్ రాజు కలవనున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాకు సహ నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందించారు. భారీ బడ్జెట్ చిత్రంగా ఇది నిలుస్తోంది. జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. అందులో భాగంగా దిల్ రాజు విజయవాడలో రామ్ చరణ్ భారీ కట్ అవుట్ ను ఆవిష్కరించారు. 256 అడుగుల ఎత్తైన ఈ కటౌట్ లాంచ్ ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఏపీలో ఈ చిత్రానికి సంబంధించి మెగా ఈవెంట్ ఏర్పాటు చేయనున్నారు. దానికి డిప్యూటీ సీఎం పవను ఆహ్వానించేందుకే దిల్ రాజు కలవనున్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా చిత్ర పరిశ్రమలో ఎదురైన సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించనున్నట్లు సమాచారం.